AP News: ఆంధ్రప్రదేశ్‌ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల కారణంగా నిలిచిపోయిన ఖరీఫ్ 2023 కరువు సాయం, మిచాంగ్ తుపాన్ పంట నష్ట పరిహారం (ఇన్ పుట్ సబ్సిడీ)ను రైతుల ఖాతాల్లో జమచేయనుంది. ఎన్నికల నేపథ్యంలో డీబీటీ పథకాల చెల్లింపులపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో పథకాలపై ఈసీ ఆంక్షలను ఎత్తివేసింది. దీంతో శనివారం నుంచి ఇన్‌పుట్ సబ్సిడీ జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సీఎం జగన్ విదేశాలకు వెళ్లిన నేపథ్యంలో నిధుల విడుదలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 


103 కరువు మండలాలు
గత ఏడాది దేశవ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఖరీఫ్ సీజన్‌ సాగుపై తీవ్ర ప్రభావం పడింది.  సాగు విస్తీర్ణం, వర్షపాతం, వాగు ప్రవాహం, భూగర్భ జల స్థాయిలు, జలాశయాల్లో నీటి నిల్వలు, ఉపగ్రహ ఆధారిత పంటల పరిస్థితి అంశాల ప్రామాణికాల ఆధారంగా ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించింది. ఏడు జిల్లాల్లో  మొత్తం 103 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. నిబంధనల మేరకు 14,24,245 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. ఉద్యాన పంటలు 92,137 ఎకరాలు, వ్యవసాయ పంటలు 19,32,108 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు లెక్కలు వేశారు. 


ఆర్టీకేల్లో అర్హుల జాబితా
2023-24 రబీ సీజన్ ఆరంభంలో మిచాంగ్ తుఫాన్ రాష్ట్రాన్ని అతాలకుతలం చేసింది. భారీ వర్షాలతో 6,64,380 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.  ఉద్యాన పంటలు 64,695 ఎకరాల్లో, వ్యవసాయ పంటలు 5,99,685 ఎకరాలు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో కరువు ప్రభావంతో ఖరీఫ్ పంటలు నష్టపోయిన 6,95,897 మంది రైతులకు రూ.847.22 కోట్లు, మిచాంగ్ తుఫాన్‌తో పంట నష్టపోయిన 4,61,337 మంది రైతులకు రూ.442.36 కోట్లు.. మొత్తం మీద 11.57 లక్షల మందికి రూ.1,289.58 కోట్లు పెట్టుబడి రాయితీ అందించనున్నారు. ఈ మేరకు స్థానిక సచివాలయ పరిధిలోని రైతు భరోసా కేంద్రాల్లో  అర్హుల జాబితాలను ప్రదర్శించారు.


ఎన్నికల నేపథ్యంలో ఆగిన నిధులు
కరువు సాయం, మిచాంగ్ తుపాన్ పరిహారం గత మార్చిలోనే జరగాల్సి ఉంది. అయితే ఎన్నికల షెడ్యూల్ రావడంతో డీబీటీ పథకాలతో పాటు రైతులకు జమ చేయాల్సిన ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపులపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది. పోలింగ్ ముగిసే వరకు డీబీటీ చెల్లింపులు చేయోద్దని ఈసీ ఆదేశించింది. దీంతో బాధిత రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఇన్పుట్ సబ్సిడీ చెల్లించేందుకు మినహాయింపు ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ క్రమంలో మే 10వ తేదీన జమ చేసేందుకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. అయితే ఎన్నికల కమిషన్ మరోసారి ప్రశ్నలు సంధించడంతో  నిధులు జమ కాలేదు. 


తాజాగా పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఎన్నికల కమిషన్ ఆంక్షలను సడలించింది. ఇన్పుట్ సబ్సిడీ చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రెండు మూడు రోజుల్లో 11.57 లక్షల మందికి రూ.1,289.58 కోట్లు జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజా మొత్తంతో కలిపి ఐదేళ్లలో వైపరీత్యాల వల్ల నష్టపోయిన 34.41 లక్షల మంది రైతులకు రూ.3,261.60 కోట్లు పెట్టు బడి రాయితీగా అందించినట్లు వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది.