Skill Development in Andhra Pradesh Budget 2025: "జ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థలో, నిరంతరం నైపుణ్యాలను మెరుగు పరచుకోవటం చాలా కీలకం అని చంద్రబాబు ఎప్పుడూ చెబుతుంటారని అన్నారు పయ్యావు కేశవ్. అందుకు అనుగుణంగానే ప్రభుత్వం శ్రామిక జనాభా నైపుణ్యాలను అంచనా వేస్తోందని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల అవసరాలు గుర్తించి మానవ వనరులు తయారు చేసే దిశగా నైపుణ్య గణన జరుగుతున్నట్టు ఏపీ బడ్జెట్‌లో వెల్లడించారు.
స్థానిక పరిశ్రమల డిమాండ్‌ను తీర్చడానికి నిరుద్యోగ యువతకు, కళాశాల డ్రావ్ - అవుట్లకు శిక్షణ ఇచ్చేందుకు, 83 ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థల (ఐ.టి.ఐ.)లో నైపుణ్య కేంద్రాలను (స్కిల్ హబ్స్)లను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం కింద అల్పసంఖ్యాక వర్గాల వారి కోసం ప్రత్యేకంగా నాలుగు కొత్త పారిశ్రామిక శిక్షణ సంస్థలు ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశామని పేర్కొన్నారు. అందుకే 2025-26 ఆర్థిక సంవత్సరానికి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణా శాఖకు 1,228 కోట్ల రూపాయల కేటాయింపులు చేసినట్టు బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. విద్యకు కేటాయింపులు పయ్యావుల మాటల్లోనే" గత ప్రభుత్వపు దుర్మార్గపు పాలనా కాలంలో రాష్ట్ర విద్యావ్యవస్థపై దృష్టి సారించకపోవడం, నిర్లక్ష్యం, తప్పుడు విధానాలు వలన, మన రాష్ట్రంలోని 2.43 లక్షల మంది విద్యార్థులు బడి మానివేయటంతో వారి భవిష్యత్ ప్రమాదంలో పడింది. ఇలాంటి పరిస్థితులలో విద్యా వ్యవస్థను చక్కదిద్దే అత్యంత కఠినమైన బాధ్యతను మంత్రి నారా లోకేష్ తనపై వేసుకున్నారు.
'నేటి బాలలే.. రేపటి పౌరులనే భావనతో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడం మొదలు పెట్టారు. రిజల్ట్ ఓరియెంటెడ్ ఎడ్యుకేషన్ పై దృష్టి సారించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీ విషయాలను ప్రధాన పాఠ్యాంశాలుగా తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నాలతో మన పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీవడి రాణించడానికి సిద్ధమవుతున్నారు.