Andhra News :  ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్  ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించిన తెలుగుదేశం పార్టీ-జనసేన పార్టీ.. కలిసి కార్యాచరణ రూపొందించుకున్నాయి.  ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం ప్రారంభించాయి.  అందులో భాగంగా టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి పోరాట కార్యాచరణలో భాగంగా శని, ఆదివారం రోడ్ల పరిస్థితిపై క్షేత్ర స్థాయిలో ఆందోళనలు ప్రారంభించారు.   రెండ్రోజులపాటు ఆందోళన చేపట్టాలని నిర్ణయించాయి.. ఇందులో భాగంగా ధ్వంసమైన రోడ్ల వద్దకు వెళ్లి నిరసనలు తెలపడం, ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించడం, అధికారులకు రోడ్ల దుస్థితిపై వినతి పత్రాలు అందించడం చేస్తున్నాయి.  





 పలు  చోట్ల టీడీపీ , జనేసన నేతలు కలిసి ఆందోళనలు చేశారు. ప్రజా సమస్యలపై ఉమ్మడిగా కదిలితే ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని ఈ ఆలోచన చేశామని, వరుస క్రమంలో వివిధ సమస్యలపై ఆందోళనలు చేపడతామని ఆయా పార్టీల వర్గాలు తెలిపాయి. గుంతలు పడ్డ రోడ్లు.. ప్రభుత్వ నిర్లక్ష్యం.. ప్రజలు పడుతోన్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ సోషల్ మీడియా క్యాంపెయిన్‌ కూడా చేయాలని నిర్ణయించారు.. #GunthalaRajyamAP, #WhyAPHatesJagan హ్యాష్ ట్యాగులతో సోషల్ మీడియా వేదికగా టీడీపీ – జనసేన ప్రచారం చేస్తున్నారు. 


 





 


 రెండు పార్టీల శ్రేణులు ఐకమత్యంతో కలిసి పనిచేసేలా ఉమ్మడి ఆందోళనలకు నాయకత్వాలు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. . కాగా, ఇప్పటికే రాష్ట్రస్థాయి ఉమ్మడి సమావేశాలతో పాటు.. నియోజకవర్గాల స్థాయిలోనూ టీడీపీ-జనసేన పార్టీలు ఉమ్మడి సమావేశాలు నిర్వహించి ప్రజాపోరాటాలపై నిర్ణయం తీసుకుంది.





 ఇప్పటికే నియోజకవర్గాల స్థాయిలో ఉమ్మడిగా సమన్వయ సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కలిసి పని చేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓట్ల బదిలీ పర్ ఫెక్ట్ గా జరగాలంటే.. అన్ని స్థాయిలో సమన్వయం ఉండాలని భావిస్తున్నారు.