Good News For AP government employees on childcare leaves : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ (CCL) వినియోగంపై మరింత సౌలభ్యం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. పిల్లల వయో పరిమితిని పూర్తిగా ఎత్తివేస్తూ, ఉద్యోగులు తమ సర్వీసు ముగిసే వరకు ఎప్పుడైనా ఈ సెలవును వినియోగించుకునే వీలుగా ఆర్థిక శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ మేరకు జీవో ఎంఎస్ నం.70ను డిసెంబర్ 15, 2025న జారీ చేశారు.
ఈ ఉత్తర్వులతో మహిళా ఉద్యోగులతో పాటు ఒంటరి పురుష ఉద్యోగులు కూడా చైల్డ్ కేర్ లీవ్‌ను వినియోగించుకునే అవకాశం లభించింది. దివ్యాంగ పిల్లల సంరక్షణతో సహా పిల్లల పెంపకం, పరీక్షల సమయంలో సహాయం, అనారోగ్యం వంటి వివిధ సందర్భాల్లో ఈ సెలవును తీసుకునే వెసులుబాటు కల్పించారు.
గతంలో జారీ చేసిన జీవోల ప్రకారం మొత్తం 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్‌ను గరిష్టంగా 10 విడతల్లో వినియోగించుకునే అవకాశం ఉంది. ఈ సౌకర్యం ఇప్పుడు పిల్లల వయో పరిమితి లేకుండా ఉద్యోగుల మొత్తం సర్వీసు కాలంలో ఎప్పుడైనా అందుబాటులో ఉంటుంది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వచ్చాయని ప్రభుత్వం పేర్కొంది. 2016లో జీవో ఎంఎస్ నం.132 ద్వారా మహిళా ఉద్యోగులకు 60 రోజుల సీసీఎల్ అందుబాటులోకి వచ్చింది. 2022లో జీవో ఎంఎస్ నం.33 ద్వారా దీనిని 180 రోజులకు పెంచి, ఒంటరి పురుష ఉద్యోగులకు కూడా వర్తింపజేశారు. అదే ఏడాది జీవో ఎంఎస్ నం.199 ద్వారా గరిష్ట విడతల సంఖ్యను 10కి పెంచారు. 2024 మార్చి 16న జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ జారీ చేసిన జీవో ఎంఎస్ నం.36లో మహిళా ఉద్యోగులకు వయో పరిమితిని ఎత్తివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీనికి అనుగుణంగా ఆర్థిక శాఖ ఇప్పుడు సమగ్ర ఉత్తర్వులు విడుదల చేసింది.
ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా మహిళలు మరింత ఉపశమనం పొందనున్నారు. ఉత్తర్వుల పూర్తి వివరాలు https://goir.ap.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.