Andhra Power Shock : ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ కొరత కారణంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున బయట మార్కెట్ నుంచి కొనుగోలు చేసి ప్రజలకు సరఫరా చేస్తోంది. ఈ కారణంగా ప్రజలపై పెనుభారం పడే అవకాశాలు కనిపిస్తున్నయి. ఇప్పుడు కొత్తగా విద్యుత్ వినియోగదారులపై మరో ట్రూఅప్ భారం పడనుంది. ఇప్పటికే రెండు ట్రూఅప్‌లు భారం మోపిన డిస్కమ్‌లు ముచ్చటగా మూడోసారి మోపేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఒక బిల్లులో మూడు రకాలైన భారాలను వసూలు చేస్తున్నాయి. కొత్తగా రూ.7,200 కోట్లు వసూలు చేసేందుకు ఎపిఇఆర్‌సికి డిస్కమ్‌లు ప్రతిపాదనలు పంపాయి.
త్వరలో ఏపీ ప్రజలపై నాలుగో భారం
ఏపీ ప్రజలపై ఇప్పటికే ఓ ట్రూ అప్, రెండు ఇంధన సర్ చార్జీలను వడ్డించారు. త్వరలో నాలుగో భారం పడనుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ట్రూఅప్ ప్రతిపాదనలను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఎపిఇఆర్‌సి)కి ఇటీవల డిస్కమ్‌లు సమర్పించాయి. ఇఆర్‌సి అనుమతించిన దాని కంటే అదనంగా విద్యుత్ కొనడం వల్ల ఈ ఖర్చును వసూలు చేయదలిచినట్లు ప్రతిపాదనల్లో పేర్కొన్నాయి. ఇపిడిసిఎల్ రూ.2,800 కోట్లు, ఎస్‌పిడిసిఎల్ రూ.2,500 కోట్లు, సిపిడిసిఎల్ రూ.1,900 కోట్లు చొప్పున ప్రతిపాదించినట్లు సమాచారం. వీటిపై విచారణ జరిపిన అనంతరం ఎంత భారం వేయాలనేది ఎపిఇఆర్‌సి నిర్ణయిస్తుంది. దీనికోసం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.
ప్రభుత్వ వైఫల్య భారం తమ మీద పడుతోందని ప్రజల ఆవేదన
రాష్ట్రంలో మూడు డిస్కమ్‌ల పరిధిలో 1.91 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. అదనపు భారాలతో జనం గగ్గోలుఇప్పటికే విద్యుత్ బిల్లులు మోత మోగుతున్నాయని ప్రజలు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం లెక్క చేయడం లేదు. డిస్కమ్‌లు రెండు ట్రూఅప్‌ల రూపంలో రూ.5,993 కోట్లను వసూలు చేస్తున్నాయి. 2014-19 కాలానికి సంబంధించిన ట్రూఅప్ రూ.2,910 కోట్లను 2022 ఆగస్టు నుంచి వసూలు చేస్తున్నాయి. ఇది కాకుండా 2021-22 సంవత్సరం ట్రూఅప్ రూ.3,083 కోట్లను ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వసూలు చేస్తున్నాయి. ఇవి చాలవన్నట్లు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా నెలనెలా ట్రూఅప్ విధానం మే నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పేరుతో నెలకు యూనిట్‌కు రూ.0.40 పైసలు వసూలు చేస్తున్నాయి. ఈ భారం ఏడాదికి మూడువేల కోట్లపైనే ఉంది. నెల నెలా విధానం కాకుండా మరలా ఏడాది ముగిసిన తరువాత కూడా డిస్కమ్ లోటును భర్తీ చేసుకునేందుకు అదనపు వసూళ్లకు అవకాశం ఉంది. ఇప్పటికే వాడిన విద్యుత్‌తో పాటు అదనంగా ట్రూఅప్‌లు, ఇంధన సర్దుబాటు ఛార్జీలకే వినియోగదారులు 40 శాతం అదనంగా చెల్లించాల్సి వస్తోంది.
ఎన్నికలకు ముందు ప్రభుత్వం ధైర్యం చేస్తుందా ?
సీఎం జగన్ నాలుగున్నరేళ్ల కిందట ప్రమాణస్వీకారం చేసినప్పుడు కరెంట్ రేట్లు భారీగా తగ్గించేస్తానని ప్రకటించారు. తీరా చూస్తే.. ఇప్పుడు కరెంట్ బిల్లులు రెట్టింపు అయ్యాయన్న విమర్శలు వస్తున్నాయి. కరెంట్ ఉత్పత్తిపై దృష్టి పెట్టకుండా.. పీపీఏలు రద్దు చేయడం, బొగ్గు నిల్వలు సరిపడా ఉంచుకోకపోవడం తో కరెంట్ సమస్యలు వస్తున్నాయని అధిక రేటుకు బయట మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఆ భారం అంతా.. మళ్లీ ప్రజలపైనే వేస్తున్నారు. దీనిపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఎన్నికలు మరో వంద రోజుల్లో ఉన్నాయని భావిస్తున్న సమయంలో ప్రజలపైమరో సారి భారం మోపుతుందా వెనక్కి తగ్గుతుందా అన్నది చూడాల్సి ఉంది.