Good news For APSRTC employees:   ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో విలీనమైన ఏపీఎస్‌ఆర్టీసీ  ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. విధుల్లో ఉండగా అనారోగ్య కారణాలతో  మెడికల్ అన్‌ఫిట్ గా మారిన ఉద్యోగులందరికీ ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఉన్న నిబంధనల ప్రకారం కేవలం డ్రైవర్లకు మాత్రమే ఈ వెసులుబాటు ఉండగా, ఇప్పుడు కండక్టర్లతో సహా అన్ని కేటగిరీల ఉద్యోగులకు ఈ ప్రయోజనం చేకూరనుంది.

Continues below advertisement

ముఖ్యంగా 2020 జనవరి 1న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత మెడికల్ అన్‌ఫిట్ అయిన ఉద్యోగులకు ఈ నిర్ణయం వరంలా మారింది. ఆర్టీసీ కార్పొరేషన్‌లో ఉన్నప్పుడు 21 కేటగిరీల్లో పనిచేస్తూ అనారోగ్యానికి గురైన వారికి కూడా ప్రత్యామ్నాయ ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మెడికల్ అన్‌ఫిట్ అయిన వారిని వారి అర్హతలను బట్టి కండక్టర్, రికార్డు ట్రేసర్, అసిస్టెంట్ మెకానిక్ లేదా శ్రామిక్ వంటి పోస్టుల్లో నియమించనున్నారు.

ఒకవేళ ఆర్టీసీ విభాగంలో ఖాళీలు లేకపోయినా లేదా ఆ ఉద్యోగాలకు సదరు వ్యక్తికి అర్హత లేకపోయినా, వారిని ఇతర ప్రభుత్వ శాఖల్లో నియమించేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. జిల్లా కలెక్టర్ల ద్వారా సంబంధిత శాఖల్లో వారి విద్యార్హతలకు తగినట్లుగా పోస్టింగ్స్ ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీనివల్ల ఉద్యోగం కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వేలాది కుటుంబాలకు భరోసా లభించనుంది.

Continues below advertisement

మరోవైపు, ఏ ఉద్యోగానికీ అర్హత లేని వారికి లేదా మెడికల్ అన్‌ఫిట్ కారణంగా స్వచ్ఛంద విరమణ పొందాలనుకునే వారికి ప్రభుత్వం అదనపు ఆర్థిక ప్రయోజనాలను ప్రకటించింది. ఇందుకు సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఏపీపీటీడీ కమిషనర్‌తో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ నిర్ణయంతో ఆర్టీసీ ఉద్యోగ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.