AP Elections 2024: ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే.. తనకు నేరుగా ఫోన్ చేయవచ్చని.. అర్ధరాత్రి వేళ అయినా.. నేను స్పందిస్తానని నాది 9 నెంబర్ల సెల్ ఫోన్ కాదని టిడిపి అర్బన్ నియోజకవర్గ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. నగరంలోని 35వ డివిజన్లో చంద్రదండు రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాష్ నాయుడు, మాజీ కార్పొరేటర్ రాజారావు ఆధ్వర్యంలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కాలనీకు వచ్చిన దగ్గుపాటికి ప్రజల నుంచి అనూహ్య స్పందన కనిపించింది. పలుచోట్ల పూల వర్షం కురిపిస్తూ, హారతులు పట్టి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వందల సంఖ్యలో పాల్గొన్నారు. 


ప్రతి ఇంటికి వెళ్తూ బాబు సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ముందుకు సాగారు. తాము అధికారంలోకి రాగానే చేపట్టబోయే కార్యక్రమాల గురించి వివరించారు. ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ నగరం నేడు ఇంత అధ్వాన్నమైన పరిస్థితిలో ఉందంటే.. దీనికి కారణం వైసిపి నాయకులే అని విమర్శలు చేశారు. డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా ఉందని దీని వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రతి కార్యక్రమంలోనూ అవినీతికి పాల్పడుతూ అభివృద్ధిని మరిచిపోయారని విమర్శలు చేశారు. తాము అధికారంలోకి రాగానే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తోపాటు డంపింగ్ యార్డ్ ను తరలించడమే తొలి కర్తవ్యంగా తీసుకుంటామన్నారు. కొందరు మహిళలు తమకు ఉపాధి లేదని తన దృష్టికి తీసుకొచ్చారని.. నేను ఎమ్మెల్యే కాగానే కచ్చితంగా నగరానికి పరిశ్రమలు తీసుకొచ్చి మహిళలకు, యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. 


ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా దగ్గుపాటి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఏదైనా సమస్య ఉంటే పారిపోయే వ్యక్తిని కాదని.. మీరు అర్ధరాత్రి వేళ ఫోన్ చేసినా నేను స్పందిస్తానన్నారు. వారిలా తొమ్మిది నెంబర్ల తరహాలో వ్యవహారం ఉండదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరోవైపు చంద్రదండు ప్రకాష్ నాయుడు, మాజీ మేయర్ స్వరూప, రాజారావు ఇతర ముఖ్య నాయకులు మాట్లాడుతూ దగ్గుపాటి ప్రసాద్ ను గెలిపించడమే లక్ష్యంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. నగరానికి ఒక మంచి యువకుడుని చంద్రబాబు తీసుకొచ్చారని.. ఆయనకు మనము మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని వారి అభిప్రాయపడ్డారు. నాయకులందరూ కలిసి వారి మెజార్టీ సాధించే దిశగా పని చేస్తామని స్పష్టం చేశారు.