SP Fakirappa :  అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప వ్యవహారం ఇటీవలి కాలంలో తీవ్రంగా వివాదాస్పదమవుతోంది. ఎంపీ గోరంట్ల మాధవ్ ఇష్యూలో ఆయన చేసిన ప్రకటనపై అనేక విమర్శలు రాగా.. వెంటనే కానిస్టేబుల్ భానుప్రకాష్‌ను ఓ తప్పుడు ఫిర్యాదుతో డిస్మిస్ చేసేసిన వ్యవహారం దుమారం రేపుతోంది. తనను బూచిగా చూపి కానిస్టేబుల్ ప్రకాష్‌పై చర్య తీసుకున్నారని.. తనను కానిస్టేబుల్ ప్రకాష్ ఎలాంటి మోసం చేయలేదని ఆమె మీడియా ముందు చెప్పడంతో  ఫక్కీరప్ప పరిస్థితి ముందు నుయ్యి .. వెనుక గొయ్యి అన్నట్లుగా మారింది. తాము దర్యాప్తు చేశామని.. నిజమని తేలడంతోనే డిస్మిస్ చేశామని ఎస్పీ చెబుతున్నారు. కానీ మొత్తం రివర్స్ అయింది.


ఫక్కీరప్పపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కానిస్టేబుల్ భానుప్రకాష్


ఆ వెంటనే కానిస్టేబుల్ భాను ప్రకాష్ .. అనంత ఎస్పీ ఫక్కీరప్పతో పాటు మరో ముగ్గురిపై ఫిర్యాదు చేశారు.  తన ఫిర్యాదుపై చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఎస్పీపై ఫక్కీరప్ప చేసిన ఆరోపమలు కలకలం రేపుతున్నాయి. అవినీతి సంపాదనతో ఎస్పీ బళ్లారిలో రూ. మూడు కోట్లు పెట్టి ఇళ్లు కట్టిస్తున్నారని.. అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్నారని భానుప్రకాష్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై ఎస్పీ అసహనం వ్యక్తం చేస్తున్నారు. తన ఇల్లు అంటూ.. కర్ణాటకలోని హవేరి జిల్లాలో నెలగొల్ గ్రామంలోని తన పాత ఇంటిని మీడియాకు విడుదల చేశారు. కానీ ఆయన బళ్లారిలో ఇల్లు కట్టిస్తున్నారని ఆ ఇంటి ఫోటోలను ఓ పత్రిక ప్రచురించింది . దీంతో ఎస్పీ మరింత ఆగ్రహం వ్యక్తం చేసి.. నేరుగా ఆ పత్రిక ఎడిషన్‌ కు పరువు నష్టం నోటీసులు ఇచ్చి వచ్చారు.  ఈ వ్యవహారం పోలీసులతో పాటు ప్రభుత్వాన్ని కూడా ఇరకాటంలో పడేసింది.


ఫక్కీరప్పనే తనపై కేసు పెట్టాలని డీఐజీని అడిగినట్లుగా చెబుతున్న పోలీసు వర్గాలు


ఆరోపణలు తీవ్రమైనవి కావడంతో ఆయన విషయంలో ఏ విధంగా వ్యవహరించాలన్నది ఇప్పుడు ప్రభుత్వ పెద్దలకు పజిల్‌గా మారింది. కానిస్టేబుల్ ప్రకాశ్ ఆరోపణలు తీవ్రమైనవి కావడంతో ఎస్పీ ఫక్కీరప్పనే డిఐజిని కలిసి తనపై కేసు నమోదు చేసి విచారణ జరిపించాలంటూ విన్నవించుకొన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఎస్పీ ఫక్కీరప్పతో పాటు,అడిషనల్ ఎస్పీ హనుమంతు, సిసిఎస్ డీఎస్పీ మహబూబ్ బాషా, ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ పై అనంతపురం టూటౌన్ లో కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. 


ఫక్కీరప్పపై బదిలీ వేటు తప్పదా ?


ప్రకాశ్ వ్యవహారం అనంతపురం పోలీస్ శాఖలో తీవ్ర ప్రకంపనలే సృష్టిస్తోంది. ఇటీవల కాలంలో గోరంట్ల మాధవ్ వ్యవహారం లో కూడా ఎస్సీ సరిగా హ్యాండిల్ చేయలేకపోయారంటూ ప్రభుత్వపెద్దలు తీవ్ర అసంతృఫ్తితో వున్నట్లు తెలుస్తోంది. వీటికి తోడు డిస్మిస్డ్ కానిస్టేబుల్ ప్రకాశ్ వ్యవహారం కూడా తలనొప్పిగా మారడంతో అనంతపురం ఎస్పీ ఫక్కీరప్పను బదిలీ చేసే అవకాశాలు కూడా వున్నట్లు ప్రచారం జరుగుతోంది.