Minister Usha Sri Viral Video : ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు కాకరేపుతున్నాయి. పోలింగ్ దగ్గర పడడంతో పార్టీలు ప్రలోభాలు స్టార్ట్ చేశాయి. కొన్ని పార్టీలో డబ్బులు పంపిణీ మొదలుపెట్టాయి. విశాఖ, తిరుపతిలో వైసీపీ తరఫున డబ్బులు పంపిణీ చేస్తున్న వారిని ప్రతిపక్షపార్టీలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాయి. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లకు నగదు పంపిణీపై ఏకంగా మంత్రి సమీక్ష చేసిన ఓ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఏపీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీ చరణ్ ఎమ్మెల్సీ ఓట్లకు డబ్బు పంపిణీపై సమీక్ష చేసినట్లు ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియాలో ఒక ఓటుకు వెయ్యి రూపాయలు వంతున పంపిణీ చేసింది ఎవరని మంత్రి ఆరా తీస్తున్నారు. అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారా అని వాకబు చేశారు. మంత్రి ఉషా శ్రీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్లకు డబ్బులు పంపిణీపై అధికారులు, కార్యకర్తలతో మంతనాలు జరిపినట్లు ఉన్న వీడియో వైరల్ అవుతుంది. ఒక్కోఓటుకు రూ. వెయ్యి ప్రకారం పంపిణీ చేయండని, ఒక గ్రామంలో 20 మంది ఓటర్లు ఉంటే రూ.20 వేలు ఇవ్వండని, ఓటర్లకు ఆ డబ్బు చేరిందో లేదో  ఫోన్ చేసి క్రాస్ చెక్ చేసుకోండంటూ మంత్రి అంటున్నారు. 






ఆర్డీవోకు టీడీపీ ఫిర్యాదు 


బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి ఎన్నికల్లో నగదు పంపిణీపై తన అనుచరులకు ఆదేశాలు ఇవ్వడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. వెంటనే మంత్రిని బర్తరఫ్ చేయాలని తెలుగుదేశం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.  కళ్యాణదుర్గం టీడీపీ ఇన్ ఛార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు ఈ వీడియోపై స్థానిక ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు.  ఓటర్లను ప్రలోభపెట్టే పనిలో ఉన్న అధికారులందరినీ సస్పెండ్ చేయాలని కోరారు. 


ఓటర్లకు నోట్లు పంచుతూ దొరికిన వైసీపీ కార్యకర్తలు 


తిరుపతి యశోద నగర్ లో ఓటర్లకు డబ్బులు పంచుతూ వైసీపీ కార్యకర్తలు దొరికిపోయారు. యశోధ నగర్ లోని ఓటర్లకు ఆదివారం మధ్యాహ్నం ఇంటింటికి వెళ్ళి ఓటర్లకు డబ్బులు పంచిన వైసీపీ‌ కార్యకర్తలు చైతన్య, అరుణ్ లను సీపీఎం కార్యకర్తలు పట్టుకున్నారు. ఓటర్లకు నగదు పంచుతున్న సమయంలో వైసీపీ కార్యకర్తల వెంట స్థానిక వాంటీర్లు సైతం ఉండడం గమనార్హం. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ వైసీపీ నాయకులపై సీపీఎం కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వైసీపీ కార్యకర్యలను అదుపులోకి తీసుకుని కొంత సమయం అనంతరం వారిని విడిచిపెట్టారు పోలీసులు. 


వైసీపీ అభ్యర్థి తరఫున డబ్బులు పంపిణీ! 


ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేస్తున్న సుధాకర్ తరఫున ఓ వ్యక్తి ఓటర్లకు డబ్బులు పంచుతూ పట్టుబడ్డాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. విశాఖ ఈస్ట్ నియోజకవర్గంలో గ్రాడ్యుయేట్ ఓటర్లకు డబ్బులు పంచుతూ వైసీపీ కార్యకర్త, ఎంపీ అనుచరుడు ఈశ్వర్ రావును కొందరు వ్యక్తులు పట్టుకున్నారు. అతడి వద్ద ఉన్న  87 వేల నగదును వచ్చి పంచుతుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు స్థానికులు. వార్డు నెం 16లోని బూత్ నెం : 232 లో  డబ్బులు పంచుతుండగా పట్టికున్నామని స్థానికులు అంటున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.  దీంతో అక్కడి చేరుకున్న అధికారులు, పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ ఎంపీకి సంబంధించిన నిర్మాణ సంస్థలో ఈశ్వర్ రావు ఉద్యోగిగా పని చేస్తున్నట్లు తెలుస్తోంది.