JC Prabhakar Reddy Bus Yatra : తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సేవ్ కార్యకర్త అంటూ చేపట్టనున్న బస్ యాత్రకు బ్రేకులు వేసేందుకు జిల్లా నేతలంతా ఒక్కటయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ యాత్ర జరగకుండా చూడాలంటూ జిల్లాకు చెందిన కీలకనేతలు చంద్రబాబు వద్ద పంచాయితీ పెట్టినట్లు సమాచారం. మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఎట్టి పరిస్థితులో యాత్ర జరిపి తీరుతానంటూ ప్రకటిస్తున్నారు. తాను చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి, కార్యకర్తలు బాగుండాలి అన్న నినాదంతో కార్యకర్తలకు ధైర్యం చెప్పేందుకు యాత్ర చేపడుతున్నట్లు చెప్తున్నారు. ఇప్పుడు ఇదే అనంతపురం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని, వారిపై ఇంఛార్జ్ ల పెత్తనం ఉండదంటూ చేసిన వ్యాఖ్యలు జేసీ వర్గంలో నూతనోత్సహాన్ని తెచ్చాయి. చంద్రబాబు ఇన్నాళ్లకు కార్యకర్తలకు స్వేచ్చను ఇచ్చారంటూ వ్యాఖ్యలు చేశారు. 


టీడీపీ నేతల్లో ఆందోళన 


పార్టీ కోసం కార్యకర్తలు మాత్రమే కష్టపడుతన్నారని, నేతలు మాత్రం అధికారంలో ఉన్నన్నాళ్ళు సంపాదించుకొని ఇప్పుడు పట్టించుకోవడం లేదంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడుతున్నారు. గత మూడేళ్లుగా కార్యకర్తలు ఏవిధంగా నియోజకవర్గాల్లో ఇబ్బందులు పడుతున్నారన్నది తెలిసి కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహిరస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు. ఈసారి కూడా ఇంఛార్జ్ లకు టికెట్లు కేటాయిస్తే మళ్లీ టీడీపీ ఓటమి తప్పదంటూ చేస్తున్న వ్యాఖ్యలు నేతల్లో తీవ్ర అలజడి సృష్టిస్తోన్నాయి. ఇన్నాళ్లు ఇతర నియోజకవర్గాల్లో అడపాదడపా వేలు పెడుతున్న జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా సేవ్ కార్యకర్త అంటూ బస్ యాత్రకు సిద్ధం అవుతుండడంతో జేసీ వ్యతిరేక వర్గీయుల్లో టెన్షన్ నెలకొంది. ఈ యాత్ర వల్ల కార్యకర్తల్లో తీవ్ర గందరగోళం రేపుతుందని, ఎట్టి పరిస్థితుల్లో యాత్ర జరపకుండా చూడాలంటూ చంద్రబాబు వద్ద పంచాయితీ పెట్టినట్లు తెలుస్తోంది. 



చంద్రబాబు రంగంలోకి 


అయితే జేసీ ప్రభాకర్ రెడ్డితో మాట్లాడేందుకు రాష్ట్రంలో కీలక నేతలెవ్వరు ముందుకు రావడంలేదు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా మాట్లాడేందుకు సుముఖంగా లేరని సమాచారం. దీంతో చంద్రబాబే స్వయంగా రంగంలోకి దిగితే తప్ప జేసీ ప్రభాకర్ రెడ్డి వినరని, జిల్లా నేతలంతా ఆయనతోనే పంచాయితీ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పల్లె రఘునాథ్ రెడ్డి, కాలువ శ్రీనివాస్ లాంటి నేతలంతా ఈ విషయంపై అధిష్టానంతో చర్చిస్తున్నట్లు సమాచారం. మరి అధిష్ఠానం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి మరి. మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం తన యాత్రకు బస్సును కూడా రెడీ చేయిస్తున్నారు. ఎవ్వరు చెప్పినా తన యాత్ర మాత్రం ఆగదంటున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటే కార్యకర్తల్లో ధైర్యం నింపాలని, అందుకోసమే యాత్ర చేపడుతనుట్లు తెలిపారు జేసీ.  మరి ఎవరిదిపై చెయ్యి అవుతుందో చూడాలి మరి.