BJP Satya Kumar :  మంత్రి కేటీఆర్ తెలంగాణ విషయాలు వదిలేసి ఏపీలో రోడ్ల పరిస్థితి మాట్లాడుతున్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ అన్నారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణలో ఇవాళ కనిపిస్తున్న రహదారులు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకా నిర్మించినవా అని ప్రశ్నించారు. అవుటర్ రింగ్ రోడ్ కేసీఆర్ నిర్మించారా? కేటీఆర్ ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. కేటీఆర్ హైదరాబాద్ లో రహదారులను చూపించి ఇదే తెలంగాణ అంటే ఎలా అని ప్రశ్నించారు. గ్రామీణ ప్రాంతాలకు వెళితే ప్రజల ఇబ్బందులు తెలుస్తాయన్నారు. 


హైదరాబాద్ చూపించి మభ్యపెడుతున్నారు 


సీఎం కేసీఆర్ పరిపాలన గాలికి వదిలేసి ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని సత్య కుమార్ విమర్శించారు. చాలా రోజుల తర్వాత ఆవిర్భావ దినోత్సవంలో గంటా 45 నిమిషాలు మాట్లాడాడన్నారు. 24 గంటలు కరెంట్ ఇచ్చామని కేసిఆర్ చెబుతున్నారని, కానీ తెలంగాణలో పరిస్థితులు వేరే అన్నారు. తనకు తెలంగాణలో ఇళ్లుందని, కరెంట్ లేక ఇన్వెర్టర్లు పెట్టుకోలేక, జనరేటర్లకు డీజిల్ భరించలేక ఎంత ఇబ్బంది పడుతున్నామో తనకు తెలుసన్నారు. తన లాంటి వారి పరిస్థితితే ఇలా ఉంటే ఇక పేదల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఒక హైదరాబాద్ ను చూపించి ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. మంత్రి కేటీఆర్, సీఎం జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒకే గూటి పక్షులని సత్య కుమార్ విమర్శించారు. వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కేటీఆర్ ఇలాంటి విమర్శలు చేసి సమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేటీఆర్ మాట్లాడుతుంటే నవ్వువస్తోందన్నారు. ఉద్యోగాలు ఇచ్చామన్న కేటీఆర్ ఎవరికి ఇచ్చారో చెప్పాలన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని, నిరుద్యోగులకు కాదన్నారు. 


టీడీపీ, వైసీపీ పొత్తులపై 


ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాల టైముంద కాబట్టి పొత్తులపై అప్పుడే స్పందించలేమని సత్య కుమార్ తెలిపారు.  ఏపీలో జనసేన పార్టీతో పొత్తుందని, ఈ పొత్తుని ఎన్నికల సమయం దాకా కొనసాగిస్తామన్నారు. ఏపీలో అత్యంత ప్రజాధరణ కలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక్క పవన్ కల్యాణ్ మాత్రమే అన్నారు. రాష్ట్రంలో పవన్ ప్రజాదరణ, జాతీయ స్థాయిలో నరేంద్రమోదీ ప్రజాదరణ, సంక్షేమ పథకాలు, అభివృద్ధిని తీసుకెళ్తామన్నారు. ఎన్నికల సమయంలో ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలో ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్ కలసి నిర్ణయిస్తారన్నారు. టీడీపీ, వైసీపీలతో సమాన దూరం పాటిస్తా్మన్నారు. టీడీపీ, వైసీపీ ఈ రెండు పార్టీలు అవినీతి పార్టీలు పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిన పార్టీలని విమర్శించారు. చంద్రబాబు, జగన్ ఇద్దరూ ఆస్తులు పెంచుకుంటూ రాష్ట్రాన్ని అప్పుల ఉబిలోకి నెట్టారని ఆరోపించారు.