Guntur Mirchi tourism project: గుంటూరు మిర్చి సాగు అద్భుత దృశ్యాలపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా , ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ మధ్య సోషల్ మీడియా వేదికగా జరిగిన ఆసక్తికర చర్చ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. గుంటూరు జిల్లాలో మిరపకాయలను ఆరబోసిన దృశ్యాలను డ్రోన్ ద్వారా చిత్రీకరించిన వీడియోను ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. పైనుంచి చూస్తుంటే ఎర్రటి తివాచీ పరిచినట్లున్న ఈ దృశ్యం ప్రకృతి సిద్ధమైన హోలీ రంగుల పండుగను తలపిస్తోందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ అద్భుతమైన దృశ్యాన్ని కేవలం వ్యవసాయానికే పరిమితం చేయకుండా, ఏపీ ప్రభుత్వం దీనిని ఒక పర్యాటక ఆకర్షణగా మార్చాలని ఆనంద్ మహీంద్రా సూచించారు. శీతాకాలంలో జరిగే ఈ పంట కోత సమయాన్ని పర్యాటక సీజన్‌గా మార్చవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. నేల మీద నుంచి చూస్తే ఈ అందం కనిపించకపోవచ్చని, అందుకే పర్యాటకుల కోసం హాట్ ఎయిర్ బెలూన్ రైడ్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని, అలాగే స్థానిక సంగీత, నృత్య ప్రదర్శనలతో ఒక ఫెస్టివల్‌లా దీనిని నిర్వహించవచ్చని అద్భుతమైన ఐడియాలను ఇచ్చారు.
ఆనంద్ మహీంద్రా సూచనలపై మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందిస్తూ సానుకూలంగా సమాధానమిచ్చారు. గుంటూరు మిర్చి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, వేల మంది రైతుల కష్టానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఈ రంగుల దృశ్యాన్ని పర్యాటక పరంగా ఎలా అభివృద్ధి చేయవచ్చో పరిశీలించాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌కు లోకేష్ విజ్ఞప్తి చేశారు. మహీంద్రా ఇచ్చిన సలహాలు స్థానిక రైతుల ఆదాయాన్ని పెంచేందుకు దోహదపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అదే సమయంలో మంత్రి లోకేష్ చమత్కారంగా మరో ప్రతిపాదన కూడా చేశారు. భవిష్యత్తులో ఏపీపై డ్రోన్ విజువల్స్ తీసినప్పుడు కేవలం వ్యవసాయ క్షేత్రాలే కాకుండా.. రాష్ట్రంలో రాబోయే మహీంద్రా ఆటో ఫ్యాక్టరీ, డిఫెన్స్ ఎస్టాబ్లిష్‌మెంట్స్, ఏరోస్పేస్ పార్కులు కూడా ఆ డ్రోన్ కెమెరాల్లో కనిపించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పారిశ్రామికంగా కూడా ఆంధ్రప్రదేశ్ ఎలా అభివృద్ధి చెందుతోందో ప్రపంచానికి చూపించాలనే తన ఆకాంక్షను ఆయన వెల్లడించారు.
ఆనంద్ మహీంద్రాను స్వయంగా ఆంధ్రప్రదేశ్‌కు ఆహ్వానిస్తూ లోకేష్ ట్వీట్ చేశారు. ఏపీలో ఉన్న పారిశ్రామిక మరియు పర్యాటక అవకాశాలను దగ్గరుండి చూపిస్తామని లోకేష్ పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక పారిశ్రామిక దిగ్గజం ఇచ్చిన ఐడియాకు, ఒక యువ మంత్రి స్పందించిన తీరు సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.
