అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించేలా ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. అమరావతికి సంబంధించిన బిల్లుకు మద్దతుపై నెలకొన్న ఉత్కంఠకు వైసీపీ తెరదించింది. నేడు పార్లమెంటులో ఈ బిల్లుపై జరగనున్న చర్చలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పాల్గొని తమ పార్టీ వైఖరిని స్పష్టం చేయనున్నారు.

ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లుకు తాము వ్యతిరేకం కాదని మిథున్ రెడ్డి పేర్కొన్నారు. అయితే, రాజధాని కోసం భూములిచ్చిన రైతుల ప్రయోజనాలను ప్రభుత్వం కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు పూర్తిస్థాయిలో మేలు చేకూర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో వైసీపీ రైతులకు అండగా ఉంటుందని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు.