2014లో రూ. 1.47 లక్షల కోట్ల నుంచి 2019 నాటికి రూ. 3.90 లక్షల కోట్లకు అప్పులు పెంచారని, ప్రస్తుత ప్రభుత్వం 18 నెలల్లోనే రూ. 3.17 లక్షల కోట్లు అప్పు చేసిందని జగన్ ఆరోపించారు.
YS Jagan Comments: జగన్ సంచలన ఆరోపణలు: చంద్రబాబు బడ్జెట్ అంకెల గారడీ, అప్పుల్లో కూరుకుపోయిన AP!
చంద్రబాబు పాలన పబ్లిసిటీ పీక్... ఫెర్ఫార్మెన్స్‌వీక్ అన్నట్టు ఉందని జగన్ విమర్శించారు. ఆదాయం పడిపోవడం, అప్పులు పెరగడం సంక్షేమ పథకాలకు కోతలు భవిష్యత్‌ను ప్రశ్నార్థం చేస్తున్నాయని హెచ్చరించారు.

YS Jagan Comments: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం అంకెల గారడీ అని పచ్చి అబద్దాలతో ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్ ధ్వజమెత్తారు. తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ప్రభుత్వం సూపర్ ఫ్లాప్ సినిమా చూపిస్తూ, దాన్ని సూపర్ హిట్ సినిమా అని డప్పు కొట్టుకుంటోందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సంక్షేమ పథకాల కోత, ఉద్యోగుల బకాయిలపై జగన్ సంచలన ఆరోపణలు చేశారు.
'అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్' జగన్
రాష్ట్ర అప్పులపై చంద్రబాబు ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేస్తోందని జగన్ మండిపడ్డారు. గత పదేళ్ల అప్పుల వివరాలను ఆయన గణాంకాలతో వివరించారు. 2014 నాటికి రాష్ట్ర అప్పులు 1,47, 717 కోట్లుగా ఉంటే, 2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి అవి 3, 90, 247 కోట్లు చేరాయని జగన్ గుర్తు చేశారు. అంటే చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో భారీగా అప్పులు చేశారని ఆరోపించారు. వైఎస్‌ఆర్‌సీపీ ఐదేళ్ల పాలనలో చేసిన అప్పులు 3,31,671 కోట్లు అని జగన్ స్పష్టం చేశారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్ం కేవలం 18 నెలల కాలంలోనే రూ. 3, 17, 448 కోట్లు అప్పులు చేసిందని, ఈ లెక్కలను ప్రభుత్వం పారదర్శకంగా చూపించడం లేదని ఆయన విమర్శించారు. ఇంత భారీగా తెచ్చిన అప్పుల డబ్బు అంతా ఎక్కడికి పోతోందని జగన్ ప్రశ్నించారు.
పెన్షన్లు కోతలు
సంక్షేమ పథకాల్లో అత్యంత కీలకమైన పింఛన్ల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు యాభై ఏళ్లకే పింఛన్లు ఇస్తానని చెప్పి ఇప్పుడు ఆ మాట ఎత్తడం లేదని విమర్శించారు. దీని వల్ల సుమారు 20 లక్షల మందికి 1,44,000 కోట్లు ప్రభుత్వం బాకీ పడిందని లెక్కలు చెప్పారు.
గత 18 నెలల్లోనే 5,38, 636 పింఛన్లు కట్ చేశారని, ఏడాది మరో 7, 45, 993 ఫించన్లు తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని జగన్ ఆరోపించారు. కొత్త ఇప్పటికే రెండు లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన తెలిపారు. వైఎస్‌ఆర్‌సీపీ హయాంలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి కొత్త పింఛన్లు ఇచ్చే వారమని, 2024 నాటికి తాము 66 లక్షలకుపైగా పింఛన్లు ఇచ్చామని గుర్తు చేశారు.
తల్లికి వందనం పేరుతో చెలగాటం
చదువుకునే పిల్లలు ఇచ్చే తల్లికి వందనం పథకంలో కూడా ప్రభుత్వం కోతలు విధిస్తోందని జగన్ ఆరోపించారు. యూడీఐఎస్‌ఈ డేటా ప్రకారం ప్రభుత్వం దిగిపోయే నాటికి పాఠశాలల్లో 87, 41, 885 మంది విద్యార్థులు ఉన్నారని, ప్రతి పిల్లాడికి 15 వేలు ఇస్తామని చెప్పిన బాబు, బడ్జెట్ ప్రకారం 13, 112 కోట్లు కేటాయించాల్సి ఉందని ఆయన వివరించారు
కానీ, 2024-25లో ఈ పథకాన్ని పూర్తిగా ఎగ్గొట్టారని, ఈ ఏడాది బడ్జెట్‌లో కేవలం రూ. 8,456 కోట్లు మాత్రమే చూపించారని జగన్ ఆరోపించారు. అంటే ఈ ఏడాది కూడా మెజర్టీ విద్యార్థులకు ఈ పథకం అందదని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్ర ఆదాయంలో దేశంలోనే చివరి స్థానంలో ఏపీ
రాష్ట్ర రెవెన్యూ పురోగతిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అట్టడుగు స్థానానికి పడిపోయిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని 23 రాష్ట్రాల్లో 22వ స్థానంలో ఉందని, ఇది చంద్రబాబు అసమర్థతకు నిదర్శనమని ఆయన విమర్శించారు. కేంద్రం ఆదాయ పురోగతి 9.64 శాతంగా ఉంటే, ఏపీ పురోగతి కేవలం 1.97 శాతమే ఉందని ఆయన గణాంకాలు చూపారు. రాష్ట్ర ఆదాయం పెరగకుండా కేవలం బాబు అండ్‌కో జేబుల్లోకి వెళ్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఉద్యోగులకు, ఆరోగ్యశ్రీ బకాయిలు
ప్రభుత్వ ఉద్యోగులను కూడా చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని జగన్ ఆరోపించారు. రెండేళ్లుగా ఉద్యోగులకు జీతాలు పెరగలేదని, నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన తెలిపారు. ఐఆర్, పీఆర్సీ, ప్రస్తావనే లేదని ఉద్యోగులకు ప్రభుత్వం 35,000 కోట్లు బకాయి పడిందని ఆయన విమర్శించారు.
ఆరోగ్యశ్రీ పథకానికి ఏడాదికి రూ. 4 వేల కోట్లు అవసరం కాగా, గ రెండేళ్లలో ప్రభుత్వం రూ. 3, 141కోట్లు బకాయిలు పెట్టిందని జగన్ వెల్లడించారు. నిధుల కొరత వల్ల ఆరోగ్య శ్రీ సేవలు కుంటుపడుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
నాడు- నేడు నిర్లక్ష్యం, మహిళలకు, యువతకు మొండి చేయి
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం తాము ప్రవేశ పెట్టిన నాడు-నేడు పథకాన్ని ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందని జగన్ విమర్శించారు. తాము స్కూళ్ల కోసం రూ. 8,524 కోట్లు ఖర్చు చేస్తే, కూటమి ప్రభుత్వం ఏడాదికి మూడు వందల కోట్లు కూడా ఖర్చు చేయడం లేదని ఆయన ఆరోపించారు. దీని వల్ల స్కూళ్లలో కలుషిత నీరు తాగి విద్యార్థులు ఆసుపత్రుల్లో చేరుతున్నారని ఆయన గుర్తు చేశారు. ఎన్నిల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను చంద్రబాబు చెత్తబుట్టలో పడేశారని మండిపడ్డారు. నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మూడు బడ్జెట్‌లలోనూ ఎలాంటి కేటాయింపులు జరపలేదని విమర్శించారు. దీని వల్ల నిరుద్యోగులు ప్రభుత్వం రూ. 21, 600 కోట్లు బాకీ పడిందని ఆయన అన్నారు. 18-60 ఏళ్ల మహిళలకు నెలకు పదిహేను వందలు ఇస్తామని చెప్పి మోసం చేశారని , ప్రతి మహిళకు ప్రభుత్వం 54 వేలు బకాయిలు పడిందని లెక్కలు చూపించారు. తమ హయాంలో పొదుపు సంఘాల రుణాలు 49, 926 కోట్లకు చేరితే, ఇప్పుడు అవి 30,698 కోట్లకు పడిపోయాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వడ్డీలేని రుణాల ప్రస్తావనే బడ్జెట్‌లో లేదని ఆయన విమర్శించారు.
Frequently Asked Questions
రాష్ట్ర అప్పులపై చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ చేసిన ఆరోపణలు ఏమిటి?
పెన్షన్ల విషయంలో ప్రభుత్వంపై జగన్ చేసిన విమర్శలేమిటి?
ఎన్నికల హామీలను విస్మరించి, 20 లక్షల మందికి 1.44 లక్షల కోట్లు బాకీ పడిందని, గత 18 నెలల్లో 5.38 లక్షల పెన్షన్లు తొలగించారని జగన్ ఆరోపించారు.
రాష్ట్ర ఆదాయ పురోగతిపై జగన్ ఏమన్నారు?
రాష్ట్ర రెవెన్యూ పురోగతిలో ఏపీ దేశంలో 22వ స్థానంలో ఉందని, కేంద్రం 9.64% ఉంటే ఏపీకి 1.97% మాత్రమే ఉందని జగన్ విమర్శించారు.
ఉద్యోగులు, ఆరోగ్యశ్రీ విషయంలో ప్రభుత్వంపై జగన్ చేసిన ఆరోపణలు ఏమిటి?
ఉద్యోగులకు జీతాలు, డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, 35,000 కోట్లు బకాయి పడ్డారని, ఆరోగ్యశ్రీకి కూడా రూ. 3,141 కోట్లు బకాయిలు ఉన్నాయని జగన్ తెలిపారు.























