AP Capital Amaravati | న్యూఢిల్లీ /అమరావతి: అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశానికి సంబంధించి రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టిన సమయంలో ఏపీ రాజధాని అంశంపై వైఎస్సార్ సీపీ ప్లాన్ బీ తెరమీదకు తెచ్చింది. మచిలీపట్నం- విజయవాడ- గుంటూరు వరకూ కొత్త రాజధానిని ప్రకటించాలని... దానికి MAVIGUN(మావిగన్) అని పేరు పెట్టాలని ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. మచిలీపట్నం (MA)- విజయవాడ (Vi)- గుంటూరు (GUN) పేర్లతో మావిగన్ పేరు పెట్టాలని.. తన పేరు వస్తుందనిపిస్తే మరో పేరు పెట్టాలని జగన్ సూచించారు. ఓవైపు అమరావతికి తాము వ్యతిరేకం కాదంటూనే అన్ని ప్రాంతాల అభివృద్ధి కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. అంతలోనే రాజధాని అంశంలో కొత్త రాజధాని పేరు తెరమీదకు తేవడం ఏపీ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

Continues below advertisement

తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘రాజధాని అంశంపై మేం చెప్పిన విషయం నచ్చకపోతే ప్లాన్ బీ కూడా ఇచ్చాం. దానిపై నిర్ణయం తీసుకున్నా ప్రయోజనం ఉంటుంది. మచిలీపట్నం నుంచి విజయవాడ 70 కి.మీ.. విజయవాడ నుంచి గుంటూరు 40 కి.మీ.. ఉంటుంది. నేషనల్ హైవే ఉన్న ఈ ఏరియాను క్యాపిటల్ గా తీసుకుని అభివృద్ధి చేయండి. మచిలీపట్నం నుంచి MA, విజయవాడ నుంచి VI, గుంటూరు నుంచి GUN తీసుకోండి. రాజధానికి మావిగన్ అని పేరు పెట్టండి. గన్ అయితే బాగుండదనుకుంటే, జగన్ గుర్తొస్తారనుకుంటే వేరే పేరు పెట్టి 110 కి.మీ క్యాపిటల్ కారిడార్ ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉంటుంది. మచిలీపట్నంలో వైసీపీ హయాంలో పోర్టుకు శ్రీకారం చుట్టాం. పర్మిషన్లు తెచ్చి, పని మొదలుపెట్టాం. ల్యాండ్ కొనుగోలు చేసి ఇచ్చాం. ఆర్థిక పరమైన ఏర్పాట్లు చేశాం. ఈరోజు చెన్నై, బాంబే పోర్ట్ సిటీలుగా ఉన్నాయి.  2 లక్షల కోట్లలో పది శాతం నిధులు ఖర్చు చేస్తే ఈ మావిగన్ రాజధాని ఏర్పాటు అవుతుందని’ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Continues below advertisement

అమరావతి చట్టబద్ధతపై వైఎస్ జగన్ ధ్వజం

అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఘాటుగా స్పందించారు. రాజ్యాంగంలో రాష్ట్ర రాజధాని అనే పదమే లేదని, అసెంబ్లీలో తీర్మానం చేయడం కేవలం చంద్రబాబు ఆడుతున్న డ్రామా అని విమర్శించారు. ఒక ప్రభుత్వం తెచ్చిన సవరణలను మరో ప్రభుత్వం మార్చలేదా అని ఆయన ప్రశ్నించారు. అమరావతి అభివృద్ధి పేరుతో గత ఏడేళ్లలో కేవలం 8000 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి, ఇప్పుడు ₹2 లక్షల కోట్ల అంచనాలతో అవినీతికి తెరలేపుతున్నారని మండిపడ్డారు.

లక్ష ఎకరాల్లో మౌలిక సదుపాయాల కోసం ఎకరాకు ₹2 కోట్లు ఖర్చవుతుందని చెప్పడం హాస్యాస్పదమని, ఇది దశాబ్దాల కాలం పట్టే ప్రక్రియ అని జగన్ పేర్కొన్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల ప్రయోజనాలను కాపాడటమే తమ ప్రాధాన్యతని, కేంద్రం తెచ్చే బిల్లుపై పార్లమెంటులో వైసీపీ ఎంపీలు గళమెత్తుతారని స్పష్టం చేశారు. బాహుబలి సెట్టింగ్స్ చూపిస్తూ చంద్రబాబు ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు బుధవారం పార్లమెంటు ముందుకు వచ్చింది. గతంలో ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ విభజన చట్టం- 2014లోని సెక్షన్‌ 5(2)కి సవరణ చేస్తూ కేంద్రం రూపొందించిన బిల్లును హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టడంతో చర్చ మొదలైంది. ఈ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు తెలిపింది. ఎంపీ మాణిక్కం ఠాగూర్ మాట్లాడుతూ.. విభజన హామీలు ఇంకా నెరవేర్చలేదన్నారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా హామీ ఇంకా పెండింగ్ లో ఉందన్నారు.