అమరావతి, మూడు రాజధానులపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌తోపాటు చాలా రాష్ట్రాల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది. కేసుల చట్రం నుంచి బయటపడి ఎప్పుడు విశాఖ నుంచి పాలన చేద్దామా అని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది. అమరావతి ప్రస్తావన వస్తే చాలా అధికార పార్టీ నాయకులు మూడు రాజధానుల స్వరాన్ని ఎత్తుకుంటున్నారు. 


ఈ పరిస్థితుల్లో అధికార పార్టీ నుంచే వ్యతిరేక స్వరాలు కూడా అప్పుడప్పుడు వినిపిస్తున్నాయి. అధికారిక కార్యక్రమంలోనే మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి లాంటి వారే ఒకటే రాజధాని అని చెప్పారు. ఇప్పుడు మరో ఎమ్మెల్యే అమరావతి మాత్రమే రాజధాని అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎప్పుడూ వివాదాలతో ట్రావెల్ చేసే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ ఈ కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. 


రాజధానుల వ్యవహరం వ్యవహరంపై ఇప్పటికే చర్చ జరుగుతున్న తరుణంలో అధికార పార్టికి చెందిన నేతలు చేస్తున్న కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతున్నాయి. అందులోనూ మైలవరం శాసన సభ్యుడు వసంత చేసిన కామెంట్స్ మరోసారి పొలిటికల్ సెక్టార్‌లో చర్చ మొదలైంది. మూడు రాజధానులు కాదు, అమరావతే రాజధాని అని వసంత అన్నారు. అంతే కాదు అది తన వ్యక్తిగత అభిప్రాయమని కూడా చెప్పారు. పార్టీ అభిప్రాయం వేరకొటి కావచ్చని కూడా అన్నారు. 


గతంలోనే రాజధాని అంశంపై వసంత కామెంట్స్ చేశారు. అప్పుడు కూడా ఆయన వ్యక్తిగతంగా అమరావతేకే జై అన్నారు. దీనిపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరగటంతో తరువాత ఆయన మరోసారి మీడియాతో మాట్లాడుతూ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. జగన్ నిర్ణయం మేరకు నడుచుకుంటానని అన్నారు. ఇప్పుడు మరోసారి అమరావతి రాజదాని అని వసంత వెల్లడించారు.


వరుస వివాదాల్లో వసంత....
ఇటీవల వసంత వరుసగా వివాదాల్లోకి చిక్కుకుంటున్నారు. జిల్లాకు చెందిన మంత్రి జోగి రమేష్‌తో వసంతకు విభేదాలు బహిర్గతం అయ్యాయి. పార్టీ పెద్దలు రాజీ చేసేందుకు ప్రయత్నించినప్పటికి వసంత, జోగి మధ్య వివాదం సమసిపోలేదు. దీంతో చివరగా జగన్‌తో వసంత సమావేశం అయ్యారు. అదే సమావేశంలో జగన్, వసంతకు హమీ ఇవ్వటంతోపాటుగా మైలవరంలో జోగిని జోక్యం చేసుకోవద్దని కూడ స్పష్టం చేశారు. 


వసంత తండ్రి మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు కూడ కమ్మ సామాజిక వర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. మైలవరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్‌కాంగ్రెస్ పార్టీ గ్రూపుల్లో సర్క్యూలేట్ అయ్యాయి ఆ కామెంట్స్. దీనిపై వసంత కూడా పదే పదే వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తన తండ్రి చేసిన వ్యాఖ్యలకు తనకు సంబందం లేదని వసంత కృష్ణప్రసాద్ వెల్లడించారు.


మైలవరం పరిస్దితులపై అంచనాలు...
మైలవరం నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులను స్థానిక గ్రూపు రాజకీయాలను క్లియర్ చేసి, అందరిని ఒకే తాటిపైకి తీసుకువచ్చేందుకు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర స్థాయి పరిశీలకుడు మర్రి రాజశేఖర్ వంటి నేతలు గతంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కూడా వసంత కృష్ణ ప్రసాద్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. తాను పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందిన తరవారు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జోగి రమేష్ జోక్యం దేనికని ప్రశ్నించారు. జోగి వైఖరి వలన నియోజకవర్గంలో పార్టీలో విభేదాలు వచ్చాయని, ఎమ్మెల్యేను కాదని మరో వ్యక్తి రాజకీయాలు చేయటంపై పార్టీ పెద్దలు కూడా సరైన రీతిలో స్పందించలేదనే అభిప్రాయాన్ని వసంత వ్యక్తం చేశారు.


అదును చూసుకుంటున్న టీడీపీ...
మైలవరం నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీ సీట్. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఈ నియోజకవర్గం నుంచే ఇప్పటికి తెలుగు దేశం పార్టీ బాధ్యతలను చూసుకుంటున్నారు. దేవినేని ఉమాను ఓడించేందుకే గత ఎన్నికల్లో జగన్ వ్యూహత్మకంగా వసంత కృష్ణ ప్రసాద్‌ను రంగంలోకి తీసుకువచ్చారు. జగన్ హవా రావటంతో మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్ విజయం సాధించారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు రావటంతో, తెలుగు దేశం కూడా టైం కోసం ఎదురు చూస్తోందని నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది.