Bolla Brahma Naidu: ఆడవాళ్లంతా తాగుబోతులే.. నకిలీ మద్యంపై నిరసనలో నోరుజారిన మాజీ ఎమ్మెల్యే !
Vinukonda News | నకిలీ మద్యంపై నిరసనలో వినుకొండ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు పాల్గొన్నారు. ప్రభుత్వమే వైన్ షాపులు నిర్వహించి, కల్తీ మద్యాన్ని నివారించాలని కోరారు.

వినుకొండ: పల్నాడు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు (Bolla Brahma Naidu) మహిళలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వైసీపీ పిలుపు మేరకు ఎక్సైజ్ కార్యాలయం వద్ద సోమవారం నిర్వహించిన ధర్నా సందర్భంగా బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడారు. ‘ఆడవాళ్లందరూ మందు తాగుతున్నారు. తమ అసలు ప్రవర్తనను ప్రజలకు చూపిస్తున్నారు. ప్రజలు కూడా ఈ పరిస్థితిని అర్థం చేసుకుంటున్నారు’ అని అన్నారు.
నకిలీ మద్యానికి నిరసనగా ర్యాలీ
మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మహిళలను తాగుబోతులుగా అభివర్ణించి వారిని కించపరిచారంటూ బొల్లాపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వినుకొండలో నకిలీ మద్యంపై వైసీపీ శ్రేణులు కదందొక్కాయి. ఏపీలో నకిలీ మద్యాన్ని అరికట్టాలంటూ బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేశారు. వినుకొండలో కల్తీ మద్యం ఉండకూడదని ఆయన ఇచ్చిన పిలుపుమేరకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. మహిళలు తాగుబోతులంటూ చేసిన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నారు.
పల్నాడు జిల్లా.
— Jagananna Connects (@JaganannaCNCTS) October 13, 2025
వినుకొండలో నకిలీ మద్యంపై కదంతొక్కిన ప్రజలు
నకిలీ మద్యాన్ని అరికట్టాలంటూ బొల్లా బ్రహ్మనాయుడు గారి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
వినుకొండలో కల్తీ మద్యంపై మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన… pic.twitter.com/61EnOLqLVf
నకిలీ మద్యంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరు బాట ''నారా వారి సారా వద్దు, నకిలీ మద్యం తో ప్రజల ప్రాణాలు తీయవద్దు అంటూ నినాదాలతో వినుకొండలో కార్యక్రమం సాగింది. రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని అరికట్టాలని వైసీపీ PAC మెంబర్ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు వినుకొండ లోని వైసీపీ కార్యాలయం నుండి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వరకు నిరసన ర్యాలీ కొనసాగింది. కల్తీ మద్యంపై సీబీఐ విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు కల్తీ మద్యం తయారు చేస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్న కూటమి ప్రభుత్వంపై సీబీఐ విచారణ జరిపించాలని ఎక్సైజ్ సీఐ కి, ఎస్సైకి వినతి పత్రం అందించారు.
అనంతరం బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. కూటమి నాయకులు తమ జేబులు నింపుకునేందుకు నకిలీ మద్యాన్ని తయారు చేస్తూ చాలామంది ప్రాణాలను బలిగొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తమకు అనుకూల ప్రైవేట్ వ్యక్తులకు మద్యం తయారు చేయడానికి పర్మిషన్ ఇచ్చింది.. నకిలీ మద్యం తయారుచేసిన వాళ్లపైన ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. చంద్రబాబు నాయుడు నకిలీ మద్యం కుంభకోణం పైన దర్యాప్తు చేయడానికి తమకు అనుకూలంగా ఉండే సిట్ అధికారులను నియమించారు. మేము సిట్ అధికారులతో కాకుండా సీబీఐ కు ఇచ్చి దర్యాప్తు చేయాలన్నదే మా డిమాండ్. నకిలీ మద్యం కేసును సీబీఐకి ఇస్తే మాత్రమే కల్తీ మద్యం తాగి చనిపోయిన కుటుంబాలకు న్యాయం జరుగుతుంది.
ప్రభుత్వమే వైన్ షాపులు నడపాలి..
మా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వైన్ షాపులను ప్రభుత్వమే నడిపి ఎటువంటి కల్తి లేకుండా చేసింది. వెంటనే సీబీఐ విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. నకిలీ మద్యం వల్ల చనిపోయిన వారిని గుర్తించి వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. వైన్ షాపుల కేటాయింపులో జరిగిన అవకతవకలను గుర్తించి లైసెన్సులు రద్దుచేసి మద్యం షాపులు మళ్లీ ప్రభుత్వాలే నిర్వహించేలా చర్యలు చేపట్టాలని’ బ్రహ్మనాయుడు డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్, జడ్పీటీసీ,ఎంపీపీ, సర్పంచ్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు,తాలూకా కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు,వైస్ ఎంపీపీ లు ఎంపీటీసీలు, కో కన్వీనర్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.






















