TDP Mahanadu 2026: నేటి నుంచి 2 రోజులపాటు టీడీపీ మహానాడు.. ఈసారి అజెండా, తీర్మానాలు, ప్రత్యేకతలు ఇవే
Chandrababu Mahanadu | తెలుగుదేశం పార్టీకి ఎంతో కీలకమైన మహానాడు కార్యక్రమం హైబ్రిడ్ మోడల్‌లో రెండు రోజులపాటు నిర్వహిస్తున్నారు. దాదాపు 20 తీర్మానాలను ప్రవేశపెడుతున్నారని సమాచారం.

TDP Mahanadu | అమరావతి: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) పార్టీకి ఎంతో కీలకమైన వేడుక మహానాడు నేటి నుంచి 2 రోజులపాటు నిర్వహిస్తున్నారు. పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారకరామారావు (Sr NTR) హయాం నుంచే ఈ సదస్సుకు అత్యంత ప్రాధాన్యత ఉంది. 44 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న టీడీపీకి, మహానాడు వేదికగా గతాన్ని నెమరువేసుకోవడం, ప్రస్తు పరిస్థితులపై చర్చించడం, భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవడం ఒక సాంప్రదాయంగా వస్తోంది. ఇక్కడ తీసుకునే నిర్ణయాలు పార్టీనే కాకుండా రాష్ట్ర రాజకీయాలను సైతం ప్రభావితం చేస్తుండటంతో, రాజకీయ వర్గాల్లోనూ, సామాన్య ప్రజల్లోనూ దీనిపై ఎప్పుడూ ఆసక్తి నెలకొంటుంది. ఈ క్రమంలో 2026 మహానాడు బుధవారం, గురువారాల్లో రెండు రోజుల పాటు హైబ్రిడ్ మోడల్‌లో వైభవంగా జరగనుంది.
2 రోజుల అజెండా.. చర్చలు, తీర్మానాలు, ఎన్నికల రోడ్‌మ్యాప్
ఈ ఏడాది మహానాడును స్త్రీ శక్తి థీమ్‌తో నిర్వహిస్తున్నారు. దీంతో సదస్సులోని ప్రసంగాలు మహిళా సాధికారత చుట్టూనే సాగనున్నాయి. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో మొత్తం 20 తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 10, తెలంగాణ 4, అండమాన్‌కు 1 తీర్మానంతో పాటు 4 ఉమ్మడి తీర్మానాలు, చివరగా అత్యంత కీలకమైన రాజకీయ తీర్మానం ఉండనున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కావస్తున్న సమయంలో, స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేయడంతో పాటు తదుపరి సార్వత్రిక ఎన్నికలకు రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసేలా అధినాయకత్వం దిశా నిర్దేశం చేయనుంది.
తొలి రోజు, రెండో రోజు కార్యక్రమాల వివరాలు
మహానాడు మొదటి రోజున పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయం 9.40 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని, జెండా ఆవిష్కరణ చేసి ఎన్టీఆర్‌కు, పార్టీ అమరవీరులకు నివాళులర్పిస్తారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రారంభ ఉపన్యాసం అనంతరం పార్టీ పద్దుల వివరాలను వెల్లడిస్తారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కీలక అంశాలపై ప్రసంగించనున్నారు. రెండవ రోజు (మే 28న) ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఆయనకు నివాళులర్పించి.. తెలుగుజాతి ఖ్యాతి, కేంద్ర ప్రభుత్వ సాయం, సంపద సృష్టి, శాంతిభద్రతలు వంటి పలు అంశాలపై చర్చించి తీర్మానాలు ఆమోదిస్తారు. చంద్రబాబు ముగింపు ప్రసంగంతో ఈ సదస్సు ముగుస్తుంది.
2026 మహానాడు ప్రత్యేకతలు
నారా లోకేష్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో ఆయన ప్రసంగంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మరోవైపు, ఈసారి మహానాడును సరికొత్తగా ప్రత్యక్షంగా ఆఫీసులో, వర్చువల్ (హైబ్రిడ్) పద్ధతిలో జిల్లాల్లో నిర్వహిస్తున్నారు. పశ్చిమాసియా యుద్ధ పరిణామాలతో దేశంలో ఇంధన పొదుపు పాటించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునకు మద్దతుగా, తొలుత అనుకున్న నెల్లూరు వేదికను ఇలా మార్చారు. పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీ సభ్యులు మాత్రమే టీడీపీ కేంద్ర కార్యాలయం నుండి భౌతికంగా పాల్గొంటుండగా, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు తమ ప్రాంతాల నుండి వర్చువల్ విధానంలో హాజరవుతున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 1,800కు పైగా క్లస్టర్లలో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
ట్రెండింగ్ వార్తలు























