పంట నష్టపోయిన రైతులకు ఉచితంగా వరి విత్తనాలు, రూ.20 వేలు ఆర్ధిక సహాయం వెంటనే అందజేయాలని తెలుగు దేశం  రైతు విభాగం నాయకులు డిమాండ్‌ చేశారు. ఇటీవల అధిక వర్షాల కారణంగా తాడేపల్లి మండలం, చిర్రావూరు గ్రామంలో నీట మునిగిన వరి, పసుపు  పంట పొలాలను తెలుగు దేశం  రైతు విభాగం నాయకులు, రైతులతో కలిసి పరిశీలించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నీటి మునిగిన పొలాల్లో నిరసన తెలియజేశారు. ఇప్పటికే ఎకరా వరి పంటకు రూ.10 వేలు ఖర్చు అయిందని, తిరిగి మరల వరి వేసుకోవాలంటే 20 రోజుల సమయం పడుతుందని, రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. పసుపు పంటకు రూ. 60 వేలు ఖర్చు అయిందని స్థానిక శాసన సభ్యుడు, అధికారులు కానీ ఇప్పటి వరకు పంటలను పరిశీలించలేదని రైతులు నాయకులు అన్నారు.  ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరారు.


ప్రభుత్వానిది నిర్లక్ష్యమే - టీడీపీ


తెలుగు దేశం పార్టీ రైతు విభాగం గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులు కళ్ళం రాజశేఖర్ రెడ్డి,  మాట్లాడుతూ.. అకాల వర్షాల వల్ల రైతులు పూర్తిగా నష్టపోయారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆర్కే, ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి యుద్ద ప్రాతిపదికన డ్రెయిన్‌లలో పూడికను తీయించాలని , ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే కొద్దిపాటి వర్షానికే పంటలు నీటి ముంపుకు గురవుతున్నాయన్నారు. ప్రభుత్వం తక్షణమే రైతులకు విత్తనాలు, రూ. 20 వేల ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.


తాడేపల్లి మండలంలో చిర్రావూరు, గుండిమెడ, ఇప్పటం గ్రామాలలో పంటలు నీట మునిగాయని అన్నారు. దీంతో రైతాంగానికి  తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంట పొలాలు ముంపుకు ప్రధాన కారణం నూతక్కి నుండి  చిర్రావూరు ప్రాతూరు మీదుగా తాడేపల్లి వరకు రోడ్డు కు ఇరు వైపులా ఉన్న డ్రైనేజీ కాలువలు రోడ్డు విస్తరణలో భాగంగా పూడుకుపోయాయని, వాటిని తిరిగి నిర్మించలేదన్నారు. దీని వలన వర్షపు నీరు అధికంగా చేరి, పొలాలు ముంపుకు  గురైనట్లు తెలిపారు. పంట పొలాల ఇరువైపులా ఉన్న మురుగు కాలువల పూడిక తీయించి, పంట పొలాలు ముంపుకు గురికాకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.  చిర్రావూరు  గ్రామంలోనే 300 ఎకరాలలో వరి, పసుపు పంట పూర్తిగా నీటి మునిగిపోతే ఎమ్మెల్యే ఇప్పటి వరకు స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. రైతుల పార్టీ అని చెప్పుకునే వైసీపీ రైతు సమస్యలను అసలు పట్టీంచుకోవడంలేదని ఆరోపించారు. 


టీడీపీ నిర్మించిందనే నిర్లక్ష్యం...


తెలుగు దేశం పార్టీ హయాంలో నిర్మించిన కారణంగానే కొండవీడు వాగును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేస్తోందని తెలుగుదేశం నాయకులు అన్నారు. కొండవీడు వాగు వద్ద గుర్రపు డెక్క పేరుకుపోవడంతో పొలాల్లోకి నీరు చేరి పంట ధ్వంసం అవుతుందన్నారు. నాలుగున్నరేళ్లల్లో ఏ గ్రామంలోనైనా పంట కాలువలు, మురుగు డ్రైనేజీలు బాగుచేశారా అని తెలుగు దేశం రైతు నాయకులు  ప్రశ్నించారు. కాలువలు, డ్రైనేజీల పూడిక తీయించి ఉంటే రైతాంగానికి ఇంత నష్టం వాటిల్లేది కాదన్నారు. నష్టపోయిన రైతులందరికీ నష్ట పరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.