అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్ కేసులో మాజీ మంత్రి నారాయణకు ఊరట లభించింది. ఆయన బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆయన దర్యాప్తునకు సహకరించకపోతే కింది స్థాయి కోర్టులను ఆశ్రయించాలని సూచించింది. కేసు విచారణకు ముందస్తు బెయిుల్ అడ్డంకి కాకూడదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
అమరావతి రింగ్‌రోడ్డు, అలైన్‌మెంట్, భూసేకరణలో మంత్రిగా ఉన్నప్పుడు నారాయణ అక్రమాలకు పాల్పడ్డారని ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో అరెస్టులు లేకుండా నిరోధించాలని ఆయన హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అప్పట్లోనే దీనిపై ప్రభుత్వం తన వాదన వినిపించింది. అయినా సరే మాజీ మంత్రి నారాయణకు ముందస్తు బెయిల్ ఇస్తూ హైకోర్టు అప్పట్లో తీర్పు వెల్లడించింది.
ముందస్తు బెయిల్‌లో ఉన్న మాజీ మంత్రి నారాయణ... కేసులో దర్యాప్తునకు సహకరించడం లేదని ప్రభుత్వం వాదిస్తోంది. అందుకే ఆయన బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ గవాయ్, జస్టిస్ నాగరత్న ధర్మాసనం బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ తోసిపుచ్చింది.
ఈ సందర్భంగా కీలక కామెంట్స్ చేసినట్టు తెలుస్తోంది. ప్రతికార రాజకీయాల్లోకి కోర్టులను లాగొద్దని వ్యాఖ్యానించినట్టు సమాచారం. దర్యాప్తునకు సహకరించకపోతే సంబంధిత కోర్టుకు వెళ్లాలని సూచించింది. అప్పటికీ కేసు దర్యాప్తునకు మాజీ మంత్రి నారాయణ సహకరించపోతే బెయిల్ రద్దు చేయాలని తమను ఆశ్రయించాలని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ముందస్తు బెయిల్ తీర్పుతో దర్యాప్తుపై ప్రభావం పడకూడదని అభిప్రాయపడింది.