Amanchi Snake Bite: బాపట్ల: చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ పాము కాటుకు గురయ్యారు. బాపట్ల జిల్లా పర్చూరు వైసీపీ నేత ఆమంచి కృష్ణ మోహన్ పొట్టిసుబ్బయ్యపాలెంలో వాకింగ్ చేస్తుండగా ఆయనను పాము కాటేసింది. పందిళ్లపల్లి అక్వా నర్సరి వద్ద సొంత రొయ్యల ఫ్యాక్టరీలో ఉండగానే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇది గమనించిన ఆయన అనుచరలు ఆమంచిని చీరాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. డాక్టర్ల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం ఆమంచి కృష్ణ మోహన్ విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైసీపీ నేత ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. 6 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచినట్లు వైద్యులు ప్రకటించారు.
నేడు సైతం కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న ఆమంచి..
ఈరోజు (జులై 17న) పర్చూరు మండలం కొత్తపాలెం గ్రామంలో చెరుకూరు గ్రామ సచివాలయాల 2 పరిధిలో జరగిన "జగనన్న సురక్ష" కార్యక్రమంలో వైసీపీ నేత, చీరాల మాజీ శాసనసభ్యుడు, పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలలో ఆమంచితో పాటు చెరుకూరు సర్పంచ్ పేరం సుబ్బారావు, కొత్తపాలెం గ్రామ సర్పంచ్ పాలపర్తి సంపూర్ణమ్మ, పార్టీ మండల కన్వీనర్లు, మండల జెసిఎస్ కన్వీనర్లు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులు, పర్చూర్ మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, కొత్తపాలెం గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అయితే అనంతరం పాముకాటుకు గురయ్యారని తెలియగానే వైసీపీ నేతలు, ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు.
ఆమంచి కృష్ణ మోహన్ కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాల్లోకి వచ్చారు. ఈ క్రమంలో 2000లో వేటపాలెం మండలం నుంచి ZPTC సభ్యునిగా ఎన్నికయ్యారు. అంచెలంచెలుగా ఎదిగిన ఆమంచి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో అదే స్థానం నుంచి మరోసారి విజయం సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 ఫిబ్రవరిలో టీడీపీని వీడి జగన్ పార్టీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. నియోజకవర్గంలో యాక్టివ్ గా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial