Eluru News: వైఎస్ఆర్ సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి (Perni Nani) ఏలూరు జిల్లా కలెక్టర్‌కు మధ్య కాస్త వైరం ఉన్న సంగతి తెలిసిందే. పేర్ని నాని వర్సెస్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ (Prasanna Venkatesh IAS) అనేట్లుగా పరిస్థితి మారింది. తాజాగా జరిగిన జిల్లా పరిషత్ సమావేశానికి (ZP Meeting) మళ్లీ ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ గైర్హాజరయ్యారు. అయితే, కలెక్టర్ రాకపోవటం వల్ల పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా కలెక్టర్ రాకపోవటంతో ధర్నా చేస్తామని అప్పట్లో పేర్ని చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా చర్చనీయాంశం అయ్యాయి. తాజాగా మరోసారి కలెక్టర్ టార్గెట్ గా మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు చేశారు.
సర్వ సభ్య సమావేశం కన్నా వ్యవసాయ సలహా మండలి సమావేశం ఎక్కువయ్యిందా ఆయనకి అని కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ పై పేర్ని నాని మండిపడ్డారు. ఓట్లు వేసిన ప్రజలకు జవాబుదారీగా ఉండలేని అధికారులు ఎందుకని నిలదీశారు. వ్యవసాయ సలహా మండలి సమావేశం కంటే ముందే సర్వ సభ్య సమావేశం నిర్వహణపై నిర్ణయం తీసుకున్నారని మంత్రి చెప్పారు. అలాంటప్పుడు జడ్పీ సమావేశానికి రాకూడదనే ఈ సమావేశం కలెక్టర్ ఏర్పాటు చేశారా? అని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ సలహా మండలి సమావేశం పెట్టుకోమని సీఎంవో కార్యాలయం చెప్పిందని అనడం విచిత్రంగా ఉందని అన్నారు. సర్వ సభ్య సమావేశానికి వెళ్లొద్దని సీఎంవో చెప్పిందా? అని ప్రశ్నించారు. అత్యవసరం అయితే నిన్న రాత్రే సమావేశం పెట్టుకోవచ్చు కదా? అని తీవ్రస్థాయిలో ఎమ్మెల్యే పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత జులైలోనూ ఇలాంటి పరిణామమే
జూలై 19న ఉమ్మడి క్రిష్ణా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి ఆర్కే రోజా, జెడ్పీ ఛైర్ పర్సన్ ఉప్పాల హారిక, ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, కొత్త జిల్లాల కలెక్టర్లు, అధికారులు, ఇతరులు హాజరు అయ్యారు. గతంలో క్రిష్ణా జిల్లాలో ఉన్న కైకలూరు, నూజివీడు నియోజకవర్గాలు జిల్లాల విభజన తర్వాత ప్రస్తుతం ఏలూరు జిల్లాలో భాగంగా ఉన్నాయి. కాబట్టి ఉమ్మడి కృష్ణా జెడ్పీ సమావేశానికి ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కూడా హాజరు కావాల్సి ఉంది. గతంలోనూ ఆయన జెడ్పీ సర్వసభ్య సమావేశానికి హాజరు కాలేదు. దీంతో ఇవాళ్టి సమావేశానికి కూడా రాకపోవడంతో ఎమ్మెల్యే పేర్ని నాని అగ్రహం వ్యక్తం చేశారు.
తాడేపల్లికి వీరి పంచాయితీ
మాజీ మంత్రి పేర్ని నాని వర్సెస్ ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ వ్యవహారం గత జులైలో తాడేపల్లికి చేరింది. సెక్రెటరియేట్లో సీఎస్ జవహర్ రెడ్డి ని పేర్ని నాని కలిశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా జెడ్పీ సమావేశానికి ప్రసన్న వెంకటేశ్ రాకపోవడంపై పేర్ని నాని ఫిర్యాదు చేశారు. జిల్లాల విభజన అనంతరం ఉమ్మడి జిల్లా ప్రాతిపదికనే జరుగుతున్న జెడ్పీ సమావేశాలకు పలువురు కలెక్టర్లు హాజరు కావడం లేదని పేర్ని నాని చెప్పారు. ప్రసన్న వెంకటేశ్ తీరుకి వ్యతిరేకంగా సీఎం జగన్ ఇంటి వద్ద ధర్నా చేస్తానని మరోసారి ప్రకటించారు.
పేర్ని నాని తీరుపై కలెక్టర్ ఫిర్యాదు
అదే సమయంలో ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్.. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసుకు వెళ్లి.. పేర్ని నానితో వివాదం గురించి చెప్పారు. తాను ఏలూరు కలెక్టర్ గా ఉన్నందున ఉమ్మడి కృష్ణా జిల్లా జెడ్పీ సమావేశాలుకు వెళ్లాల్సిన అవసరం లేదని వివరణ ఇచ్చినట్లుగా చెప్పారు. అదే సమయంలో పేర్ని నాని సీఎస్ ను కలిసి కలెక్టర్ పై ఫిర్యాదు చేయడంతో.. కలెక్టర్ వర్సెస్ మాజీ మంత్రి మధ్య బయటకు తెలియని ఏదో వివాదం ఉందన్న అభిప్రాయం వినిపించింది.