ఏపీలోని ఎస్సీ హాస్టళ్లలో క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకోవడానికి డిప్యుటీ డైరెక్టర్లు తప్పనిసరిగా హాస్టళ్లను సందర్శించాలని, వాటిలోని సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున ఆదేశించారు. తాను కూడా త్వరలోనే హాస్టళ్లను సందర్శించి అక్కడి పరిస్థితులు పరిశీలిస్తామని, అధికారుల నిర్లక్ష్యం కారణంగా హాస్టళ్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్లు తన దృష్టికి వస్తే అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రాష్ట్ర సచివాలయంలో జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారులు (డీడీ)లతో రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు మేరుగ నాగార్జు. ఈ సందర్భంగానే నాగార్జున మాట్లాడుతూ... హాస్టళ్లలో సమస్యలు పెరిగిపోవడానికి వాటికి సంబంధించిన వార్డెన్లు హాస్టళ్లలోనే ఉండకపోవడం ప్రధాన కారణమని చెప్పారు. పిల్లలు భోజనం చేస్తున్న సమయంలో వార్డెన్లు అక్కడే ఉంటే వారికి పిల్లల సమస్యలు అర్థమౌతాయని అభిప్రాయపడ్డారు. వార్డెన్లు హాస్టళ్లలోనే ఉండేలా చూడటంతోపాటు ప్రతి నెలా డీడీలు తప్పనిసరిగా హాస్టళ్లను సందర్శించి వాటి స్థితిగతులను స్వయంగా తెలుసుకోవాలని ఆదేశించారు. చిన్న పిల్లలు. పేద పిల్లలు ఎక్కువగా ఉండే హాస్టళ్లపై డీడీలు దృష్టిని కేంద్రీకరించాలని కోరారు. హాస్టళ్లపై పర్యవేక్షణ పెంచడం ద్వారా క్షేత్రస్థాయిలోని పరిస్థితులు తెలుసుకోవాలని సూచించారు.
వార్డెన్లు ఉదయం నుంచి రాత్రి దాకా పిల్లల రాకపోకలను గమనించాలని, పిల్లల సమస్యలు పరిష్కరించడానికి తమ వంతుగా చర్యలు తీసుకోవాలని నాగార్జున ఆదేశించారు. పిల్లల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వార్డెన్లపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. దీనిలో భాగంగానే రాష్ట్రంలో ఉన్న 1015 ఎస్సీ హాస్టళ్లలో 500 హాస్టళ్లను నాడు-నేడు పథకం మొదటి విడతలో భాగంగా అవసరమైన మరమ్మత్తులు చేసి మెరుగులు దిద్దడం జరుగుతుందని చెప్పారు. మూడు ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన అధికారులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నారని తెలిపారు.
జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాల అమలు తీరును సమీక్షిస్తూ, అర్హత కలిగిన ప్రతి విద్యార్థికీ ఈ పథకాల్లో ఆర్థిక సాయం అందేలా చూడాలని కోరారు నాగార్జున. సాంకేతిక కారణాలతో సాయం అందని వారి సమస్యలు పరిష్కరించి సాయం అందించడానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద బాధితులైన ఎస్సీలకు రూ.85 వేల నుంచి రూ.8.25 లక్షల దాకా ఆర్థిక సాయాన్ని అందించడం జరుగుతోందని ఈ పథకంలో భాగంగా 2051 మందికి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామని తెలిపారు.
హత్యలకు గురైన ఎస్సీల వారసులకు ఉద్యోగాలు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నామని, ఈ ప్రక్రియ వేగవంతం అయ్యేలా చూడాలని నాగార్జున అధికారులను కోరారు. జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుల నియామకాలను పూర్తి చేసి అన్ని జిల్లాల్లో సకాలంలో సమావేశాలను నిర్వహించాలని కూడా ఆదేశాలను జారీ చేశారు. 17 లక్షల ఎస్సీ కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందించడం జరుగుతోందన్నారు. చర్మకారులు, డప్పు కళాకారులలో 53 వేల మందికి ప్రస్తుతం నెలకు రూ.3 వేల చొప్పున పింఛన్ అందిస్తున్నామన్నారు. కొత్త వారికి చర్మకార, డప్పు కళాకారుల పింఛన్లు మంజూరు చేసే ప్రక్రియను సులభతరం చేసి, వేగవంతం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాలను కూడా నాగార్జున సమీక్షించి అధికారులకు సూచనలు ఇచ్చారు.