Minister Kolusu Parthasarathy News: రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రిగా కొలుసు పార్థసారధి శుక్రవారం (జూన్ 14) రాత్రి 8 గంటల సమయంలో బాధ్యతలు చేపట్టారు. అమరావతి సచివాలయం ఐదో బ్లాక్ గ్రౌండ్ ప్లోర్లోని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఛాంబరులో రాష్ట్ర మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా భాద్యతలు చేపట్టేందుకు సతీసమేతంగా రాష్ట్ర సచివాలయానికి వచ్చిన ఆయనకు గృహ నిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖల అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. పండితుల వేదమంత్రాల మధ్య తమ సీటులో కూర్చొని మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ప్రత్యేక కార్యదర్శి బి.మహ్మద్ దివాన్ మైదీన్, పాఠశాల మౌలిక వసతుల అభివృద్ధి కమిషనర్ కాటమనేని భాస్కర్, రాష్ట్ర సమాచార & పౌర సంబంధాల శాఖ అదనపు సంచాలకులు ఎల్. స్వర్ణలత, జాయింట్ డైరెక్టర్లు పి.కిరణ్ కుమార్, టి. కస్తూరీబాయి, ఐ.సూర్యచంద్రరావు, ఛీప్ ఇన్పర్మేషన్ ఇంజనీరు మధుసూధనరావు, రీజనల్ ఇన్పర్మేషన్ ఇంజనీర్లు కృష్ణారెడ్డి, నాగరాజు తదితరులతో పాటు పలువురు అధికారులు, అనధికారులు మంత్రికి పుష్పగుచ్చాలు అందజేస్తూ అభినందనలు తెలిపారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార & పౌర సంబంధాలా శాఖ మంత్రిగా తనకు బాధ్యతలు అప్పగించింనందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ కు, మానవ వనరుల అభివృద్ది, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని నిరుపేదలు అందరికీ శాశ్వత ప్రాతిపదికన గృహ వసతి కల్పించేందుకు కేంద్ర, రాష్ట్రాల నిధులను భారీ ఎత్తున రాబట్టేందకు అన్ని విధాలుగా కృషి చేస్తామన్నారు.
గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా నిలిపివేసిన దాదాపు 13.80 లక్షల గృహాలను పూర్తి చేస్తామని అన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని హౌసింగ్ కాలనీల్లో అమృత్, ఎన్.ఆర్.ఇ.జి.ఎస్. పథకాల కింద పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు. గృహ నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పనపై ఎప్పటి కప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ పనులను వేగవంతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖ అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.