జనసేనాని పవన్ కల్యాణ్‌కు అడుగడుగునా అడ్డంకులు సృష్టించిన పోలీసులు...చివరికి మూడు వాహనాలతో పవన్ కల్యాణ్ విజయవాడ వెళ్లేందుకు అనుమతించారు. అర్ధరాత్రి తర్వాత తన కాన్వాయ్‌తో విజయవాడ చేరుకున్నారు పవన్ కల్యాణ్.
మంగళగిరి కార్యాలయానికి వెళ్లి తీరుతానని జనసేనాని భీష్మించుకొని కూర్చోవడంతో కొద్దిసేపు అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితులు విషమించకుండా పోలీసు సెక్యూరిటీ మధ్య మంగళగిరి కార్యాలయానికి ఆయన్ని తరలించారు. ఆయనకు దారిపొడవునా రక్షణ వలయంగా జనసైనికులు, వీర మహిళలు ఉన్నారు.
ఏపీకి వస్తున్న తనను పోలీసులు అడ్డుకోవడంతో పవన్ నిరసనకు దిగారు. ఓసారి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అంతలోనే రోడ్డుపై పడుకుని పోలీసుల తీరును వ్యతిరేకించారు. మరోసారి నడుచుకుంటూ వెళ్లేందుకు కూడా యత్నించారు. మొదట పవన్ ను అదుపులోకి తీసుకోవాలని చూడగా, చివరికి ఆయనను విజయవాడ వెళ్లేందుకు అనుమతించారు. మూడు వాహనాలతో పవన్‌ను తీసుకొచ్చారు.
ఏపీ పోలీసుల రిక్వెస్ట్ మేరకు గన్నవరం వెళ్లాల్సిన పవన్ స్పెషల్ ఫ్లైట్‌ను బేగంపేట ఎయిర్ పోర్టులో టేకాఫ్‌నకు అనుమతించలేదు. ప్రత్యేక విమానంలో పవన్ ఏపీకి వెళ్లాల్సి ఉంది. అయితే బేగంపేట ఎయిర్ పోర్టుకు వెళ్లిన పవన్ కు అధికారులు షాకిచ్చారు. దాంతో హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు బయలుదేరారు పవన్. కానీ పవన్ రాకను ముందే ఊహించిన ఏపీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఏపీకి ఎంటర్ అయిన పవన్ వాహనాన్ని ఎన్టీఆర్ జిల్లా గరికపాడు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. తనను పోలీసులు అడ్డుకోవడంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగ్గయ్య పేటలో ఉద్రిక్తత..
ఏపీకి రావాలంటే పాస్ పోర్ట్, వీసాలు ఏమైనా కావాలా అంటూ పోలీసులపై పవన్ మండిపడ్డారు. జనసేనానిని అడ్డుకోవద్దంటూ జన సైనికులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దాంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పవన్ ను విమానంలో ఏపీకి రాకుండా ఎయిర్ పోర్టు అధికారుల సహకారంతో చివరి నిమిషంలో కృష్ణా జిల్లా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో రోడ్డు మార్గంలోనైనా సరే విజయవాడకు చేరుకుని ఆదివారం పార్టీ నేతలతో సమావేశం కావాలని భావించారు.
జనసేనాని పవన్ కల్యాణ్...సీఎం జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. క్రిమినల్ చేతిలో అధికారం ఉండడం దురదృష్టకరమన్న ఆయన... తాను క్రిమినల్ కావడంతో అందరూ క్రిమినల్ అవ్వాలని కోరుకుంటారంటూ మండిపడ్డారు. బెయిల్ మీద ఉన్న సీఎం జగన్... జైలు గురించే ఆలోచిస్తారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. క్రిమినలైన జగన్... విదేశాలకు వెళ్లాలన్నా కోర్టు అనుమతి తీసుకోవాల్సిందేనన్నారు. రౌడీలు, గూండాలకు అధికారం ఇస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు పవన్. ప్రత్యేక విమానంలో వెళ్తానంటే అనుమతి ఇవ్వలేదని...కారులో వెళ్తామంటే అనుమతి ఇవ్వలేదని మండిపడ్డారు. విశాఖలో కూడా ఇలాగే చేశారని.. దోపిడీ చేసే వారికి అధికారం ఇస్తే ఇలాగే ఉంటుందన్నారు.