జనసేన అధినేత పవన్ కల్యాణ్, పార్టీ పదో ఆవిర్బావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మచిలీపట్టణంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు పవన్ కల్యాణ్ తన ఎన్నికల ప్రచార వాహనం అయిన వారాహి వాహనంపై సభ వేదిక వద్దకు వెళ్ళేందుకు ప్లాన్ చేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వారాహి వాహనంపై సభకు బయలుదేరేలా పవన్ ముందుగా ప్లాన్ చేశారు. మంగళగిరి నుంచి విజయవాడకు జాతీయ రహాదారి మీదగా వచ్చిన పవన్ అక్కడ నుంచి విజయవాడ నగరంలోని బెంజిసర్కిల్ మీదగా పటమట, ఆటోనగర్, కానూరు, పెనమలూరు, కంకిపాడు మీదగా మచిలీపట్టణం సభావేదిక వద్దకు వెళ్ళందుకు ముందుగా రూట్ మ్యాప్ డిజైన్ చేశారు.


పోలీసులు ఆంక్షలు....


అయితే పవన్ సభకు అసలు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. అంతే కాదు పవన్ నిర్వహించే రోడ్ షో కు బెజవాడ పోలీసులు, కృష్మా జిల్లా పోలీసులు అనుమతి నిరాకరించారు. ఎవరైనా రోడ్ల మీదకు వచ్చి ర్యాలీలు చేస్తే, చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అంతే కాదు పార్టీకి చెందిన నాయకులకు పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై ,జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి వత్తాసుపలికిన పోలీసులు జనసేనపై ఆంక్షలు పెడుతున్నారని మండిపడ్డారు.


రూట్ మ్యాప్‌లో మార్పులు.....


పోలీసుల అభ్యంతరంతో పార్టీ ఆవిర్బావ సభకు వెళ్లేందుకు జనసేన అధినేత రూట్ మ్యాప్‌ను కూడా మార్పులు చేశారు. ముందుగా అనుకున్నట్లుగా మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీని రద్దు చేసుకున్నారు. పవన్ బస చేసిన నోవోటెల్ హోటల్ నుంచి బయల్దేరి, విజయవాడ శివారులో ఉన్న ఆటోనగర్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి వారాహి వాహనంపై ర్యాలి ప్రారంభిస్తారని పార్టి వర్గాలు ప్రకటించాయి. దీంతో విజయవాడ సిటిలో ట్రాఫిక్ కష్టాలు పూర్తిగా తప్పుతాయని పోలీసులతోపాటుగా వాహనచోదకులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. 


అసలే ఎండలు మండిపోతున్న తరుణంలో పవన్ రోడ్ షో అంటే,ట్రాఫిక్ కు చుక్కలు కనిపిస్తాయి. దీంతో పవన్ చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయంతో పోలీసులు హమయ్యా అంటూ రిలాక్స్ అయ్యారు.


జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కాసేపట్లో నోవాటెల్ హోటల్ నుంచి బయలుదేరుతారు, ఒంటిగంటకు ఆటోనగర్ ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడి నుంచి వారాహి వాహనం ద్వారా జనసేన ఆవిర్భావ సభ, మచిలీపట్నం బయలుదేరుతారు. తాడిగడప జంక్షన్, పోరంకి జంక్షన్, పెనమలూరు జంక్షన్, పామర్రు– గుడివాడ సెంటర్ (బైపాస్) గూడూరు సెంటర్ మీదుగా 5 గంటలకు మచిలీపట్నంలోని సభా ప్రాంగణానికి చేరుకుంటారని పార్టీ ప్రకటించింది.


విపరీతమై ఎండలు- ట్రాఫిక్ సమస్యలు 


బెజవాడ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఎండలు. అసలే వేసవి కాలం స్టార్టింగ్ కావటంతో ఎండలు మండిపోతున్నాయి. మిట్టమద్యాహ్నం సమయంలో ఎండ వేడి ఎక్కువ ఉన్న సమయంలో రోడ్ షో అంటే పార్టr నాయకులు, కార్యకర్తలకు, ట్రాఫిక్‌లో ఉన్న వారికి, అటు పోలీసులకు కూడా కష్టాలు తప్పవు. ఈ విషయాలన్నింటిని పరిగణంలోకి తీసుకొని, పార్టీ నాయకులు పవన్‌తో మాట్లాడి రోడ్ షోను కుదించినట్లుగా చెబుతున్నారు.