ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
తిమ్మాపురం అండర్‌పాస్ వరదలో చిక్కుకున్న ముగ్గురు మహిళలను ప్రాణాలకు తెగించి కాపాడిన చిలకలూరిపేట సీఐ సుబ్బనాయుడి ధైర్యసాహసాలపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ముంచెత్తుతున్న వరద, మరోవైపు క్షణక్షణానికీ పెరుగుతున్న నీటి ఉధృతి మధ్య ముగ్గురు మహిళలు ఓ కారు పైకప్పుపై నిల్చుని ఉన్నారు. ప్రాణభయంతో ఆర్తనాదాలు చేస్తున్న ఆ మహిళలకు ఓ పోలీస్ అధికారి దేవుడిలా వచ్చి రక్షించారు. సమయానికి దేవుడిలా వచ్చావయ్యా అంటారు కదా. అలాంటి ఘటన గుంటూరు జిల్లా చిలకలూరిపేట పరిధిలోని తిమ్మాపురం అండర్‌పాస్ వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రూరల్ సీఐ బి. సుబ్బనాయుడు చూపిన సాహసం, సమయస్ఫూర్తి స్థానికులతో పాటు పలువురి ప్రాణాలను కాపాడి ప్రశంసలు అందుకుంటోంది.
భారీ వర్షాల ధాటికి తిమ్మాపురం అండర్‌పాస్ వంతెన కిందకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. అదే సమయంలో ఆ దారి నుంచి వెళ్తున్న ఓ కారు వరద నీటి ఉధృతికి చిక్కుకుపోయి మునిగిపోవడం ప్రారంభమైంది. ప్రమాదాన్ని గ్రహించిన కారులోని ముగ్గురు మహిళలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎలాగోలా కారు పైకప్పుపైకి ఎక్కి తమను కాపాడాలంటూ కేకలు వేశారు. సరిగ్గా ఆ సమయంలో అటుగా వెళ్తున్న రూరల్ సీఐ బి. సుబ్బనాయుడు ఆ పరిస్థితిని గమనించారు.

సమయాన్ని వృథా చేయకుండా, తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆ మహిళల ప్రాణాలు కాపాడేందుకు సీఐ సుబ్బనాయుడు వెంటనే రంగంలోకి దిగారు. తీవ్రంగా ప్రవహిస్తున్న వరద నీటిలోకి దిగి ఎంతో చాకచక్యంతో, ధైర్యంతో ఆ ముగ్గురు మహిళలను ఒక్కొక్కరిగా సురక్షితంగా బయటకు తీసుకొచ్చి ఒడ్డుకు చేర్చారు. మరికొందరి సాయంతో సీఐ ధైర్యంగా వ్యవహరించి ముగ్గురి ప్రాణాలు కాపాడంపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. తమను ప్రాణాపాయం నుంచి తమను కాపాడిన సీఐకి కృతజ్ఞతలు తెలిపారు. సరైన సమయంలో స్పందించి ప్రాణదాతగా నిలిచిన సీఐ సుబ్బనాయుడి ధైర్యసాహసాలను స్థానికులతో పాటు ఉన్నతాధికారులు కొనియాడారు.
ట్రెండింగ్ వార్తలు























