గుంటూరు జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన మహిళ పేరు తిరుపతమ్మ. ఆమె తన భర్తతో కలిసి ఒక అపార్ట్‌మెంట్‌లో పనిమనిషిగా జీవనం సాగిస్తోంది.
Guntur Crime News: పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసి మహిళ ఆత్మహత్య.. గుంటూరులో ఘటన
Guntur Woman Suicide | పోలీసులు కేసు పేరుతో వేధిస్తున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసుకుని గుంటూరులో మహిళ ఆత్మహత్య చేసుకుంది. బాపట్ల జిల్లా కొల్లూరు పీఎస్‌లో రెండు గ్యాంగ్‌లు దాడి చేసుకున్నాయి.

- బంగారం అడిగి ఇవ్వలేదనే ఫిర్యాదుతో మహిళ ఆత్మహత్యాయత్నం.
- పోలీసుల వేధింపులతో సెల్ఫీ వీడియో తీసి పురుగుల మందు తాగింది.
- పోలీసు స్టేషన్‌లోనే మద్యం మత్తులో రెండు వర్గాల ఘర్షణ.
- ఘర్షణలో కానిస్టేబుళ్లు, సీఐ సహా పలువురికి గాయాలయ్యాయి.
Bapatla Crime News | గుంటూరు: ఓ కేసు విషయమై పోలీసులు స్టేషన్‌కు పిలిపించి వేధిస్తున్నారంటూ ఆరోపిస్తూ ఒక మహిళ సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుంటూరు జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. బాధితురాలిని తిరుపతమ్మగా గుర్తించారు. ఆమె తన భర్తతో కలిసి తెనాలి కొత్తపేటలోని ఒక అపార్ట్‌మెంట్‌లో పనిమనిషిగా జీవనం సాగిస్తోంది. అయితే, సదరు అపార్ట్‌మెంట్‌కు చెందిన ఒక మహిళ.. తిరుపతమ్మ తన వద్ద బంగారం అడిగి తీసుకొని తిరిగి ఇవ్వడం లేదంటూ ఇటీవల స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు తిరుపతమ్మను విచారణ నిమిత్తం స్టేషన్‌కు పిలిపించారు. ఈ క్రమంలో, అపార్ట్‌మెంట్‌లోని మహిళ తనపై బంగారం తీసుకున్నట్లు తప్పుడు ఫిర్యాదు చేసిందని, విచారణ పేరుతో స్టేషన్‌లో పోలీసులు తనను తీవ్రంగా వేధిస్తున్నారంటూ తిరుపతమ్మ ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసింది. అనంతరం మనస్తాపానికి గురై ఆమె పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతుండగా, ఉన్నతాధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read: Hit And Run In Hyderabad: హైదరాబాద్‌లో ఘోరం.. కారుతో ఢీకొట్టి లాయర్ దారుణ హత్య! అదే కారణమా !
మద్యం మత్తులో పీఎస్ ఆవరణలో గొడవ.. పోలీసులకు గాయాలు
బాపట్ల జిల్లా కొల్లూరు పోలీసు స్టేషన్‌లో మద్యం మత్తులో రెండు వర్గాలు తలపడటంతో స్టేషన్ ఆవరణ రణరంగంగా మారింది. వేమూరు రోడ్డులోని ఓ వైన్ షాప్ ఎదుట నూడిల్స్ వ్యాపారి ఉప్పు జానకీరామ్‌పై, కొండూరు సురేష్ అనే వ్యక్తి మద్యం సీసాతో తలపై కొట్టి దాడి చేశాడు. తీవ్ర గాయాలైన జానకీరామ్ ఫిర్యాదు కోసం కొల్లూరు పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న అతని మేనల్లుడు బాలు ఆవేశంతో సురేష్ నివసించే కాలనీకి వెళ్లి కత్తి చూపించి వార్నింగ్ ఇచ్చాడు.
తనకు కత్తి చూపించి వార్నింగ్ ఇవ్వడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన సురేష్ అర్ధరాత్రి 12 గంటల సమయంలో సుమారు 30 మంది అనుచరులతో కలిసి కొల్లూరు పోలీసు స్టేషన్‌పైకి దాడికి వచ్చాడు. స్టేషన్ లోపలే ఇరువర్గాలు కొట్టుకోవడంతో జానకీరామ్, అతని సోదరి, బావ, మేనల్లుడు బాలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ గొడవలో స్టేషన్ ముందు గది రక్తంతో తడిచిపోయింది. పీఎస్ లోపల కుర్చీలు, బల్లలు, కూలర్లను దుండగులు పూర్తిగా ధ్వంసం చేశారు.
ఈ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వేమూరు సీఐ వీరాంజనేయులు, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డుపై కూడా నిందితులు దాడి చేసి గాయపరిచారు. పీఎస్ బయట ఉన్న వాహనాన్ని తగలబెట్టేందుకు ప్రయత్నిస్తూ, వీడియో తీస్తున్న జర్నలిస్ట్ ఫోన్ లాక్కుని దాడికి యత్నించారు. చివరికి అదనపు బలగాలను రప్పించడంతో గంటన్నర తర్వాత ఎట్టకేలకు పరిస్థితి అదుపులోకి వచ్చింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించగా, డీఎస్పీ శ్రీనివాసరావు కొల్లూరు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పరిశీలించి బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని ప్రకటించారు.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Frequently Asked Questions
గుంటూరు జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన మహిళ ఎవరు?
తిరుపతమ్మ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏమిటి?
ఒక అపార్ట్‌మెంట్‌కు చెందిన మహిళ తన వద్ద బంగారం అడిగి తీసుకొని తిరిగి ఇవ్వడం లేదని ఫిర్యాదు చేసింది. ఈ విచారణ పేరుతో పోలీసులు తనను వేధిస్తున్నారని ఆమె ఆరోపించింది.
బాపట్ల జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్‌లో ఏం జరిగింది?
మద్యం మత్తులో రెండు వర్గాలు పోలీస్ స్టేషన్ ఆవరణలో గొడవ పడ్డాయి. ఈ క్రమంలో పోలీసులు, కొందరు వ్యక్తులు గాయపడ్డారు.
పోలీస్ స్టేషన్‌పై దాడికి పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
అదనపు బలగాలను రప్పించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. డీఎస్పీ శ్రీనివాసరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని ప్రకటించారు.
ట్రెండింగ్ వార్తలు























