పూజల పేరుతో పరిచయం, ఆ తర్వాత డబ్బులు వసూలు.. తిరిగి ఇవ్వమంటే బెదిరింపులు. ఇది ఒక గురూజీ వ్యవహారం. డబ్బులు పొగొట్టుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. అయితే పోలీసులు మాత్రం డబ్బు వ్యవహారం వెలుగుచూడటంతో దాని చుట్టూనే కేసును దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గుంటూరు నగరంలోని శ్రీనివాసరావు తోటకు చెందిన అంజనా దేవి అనే మహిళ ఇంట్లో రెండు నెలల క్రితం దేవుడి ఫోటోలు కాలిపోయాయి. దీంతో ఆమెకు భయం వేసింది. ఇంట్లో దేవుడి ఫోటోలు కాలిపోవడంపై స్థానికలు తలో మాట చెప్పారు. ఇంతలో కొత్తపేటలో ఉండే గురూజీ నరసింహరావు వద్దకు వెళ్లాలని ఆమెకు సూచించారు. దీంతో ఆమె నరసింహరావు వద్దకు వెళ్లింది. అరిష్టం ఉందని చెప్పిన గురూజీ ఇరవై ఎనిమిది వేల రూపాయలు తీసుకొని రక్ష రేఖలు ఇచ్చాడు. ఇదే సమయంలో గురూజీ దగ్గరుండే శిష్యులు శివ, బాబ్జీ, మోహనరావు, క్రిష్ణ పరిచయం అయ్యారు. డబ్బులు కావాలంటూ ఆమెను ఆశ్రయించారు. అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం డబ్బులు తీసుకొన్నారు. బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి మరీ మహిళ డబ్బులు ఇచ్చింది. వాటిని తీసుకున్న గురూజీ శిష్య బ్రందం తర్వాత ఆమెకు కనిపించడం మానేశారు.
రెండు నెలల తర్వాత తన డబ్బులు తనకివ్వాలని మహిళ అడగటం మొదలు పెట్టింది. దీంతో గురూజీ శిష్య బ్రందం ఆమెను బెదిరిండం మొదలు పెట్టారు. లైంగిక వేధింపులు మొదలు పెట్టారు. ఎస్సీ ఎస్టీ కేసులు పెడతామని హెచ్చరించారు. దీంతో భయా భ్రాంతులకు గురైన మహిళ స్పందనలో పోలీసులను ఆశ్రయించింది.
మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నామని కొత్తపేట సీఐ అన్వర్ భాషా తెలిపారు. గురూజీ శిష్య బ్రందానికి డబ్బులిచ్చిన ఆధారాలు సేకరిస్తున్నామని అన్నారు. కేసులో ప్రధానంగా డబ్బులు తీసుకొని ఇవ్వకపోవటంపై ఆరోపణలు వచ్చాయని దానిపై ద్రుష్టి పెట్టామని అన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో లైంగిక వేధింపులు లేవని అన్నారు. అయితే, మహిళ పట్ల శిష్యులు అసభ్యకరంగా మాట్లాడినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.