వెంటపడండి.. ఆలస్యం చేయొద్దు. పనులు పూర్తయ్యే వరకు విశ్రమించొద్దంటున్నారు సీఎం జగన్. ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్ నిర్వహించిన ఆయన.. గడువులోపు ప్రాజెక్టులు పూర్తి చేయాలని సూచించారు.
తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్(Jagan) ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. పోలవరం (Polavaram) సహా చాలా ప్రాజెక్టులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టుల వారీగా ఇప్పటివరకూ జరిగిన పనులు, భవిష్యత్తులో పూర్తిచేయాల్సిన పనులపైనా విస్తృతంగా చర్చించారు. ప్రాజెక్టుల వారీగా లక్ష్యాలు నిర్దేశించారు సీఎం జగన్. అనుకున్న గడువులోగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
వెంటపడండి మరీ పనులు చేయండి
పోలవరంలో దిగువ కాఫర్ డ్యాం, ఈసీఆర్‌ఎఫ్‌డ్యాంలకు సంబంధించిన పలు అంశాలపై సీఎంతో జరిగిన సమీక్ష సమావేశంలో చర్చ జరిగింది. డౌన్ స్ట్రీం కాఫర్ డ్యాంకు సంబంధించి అన్ని డిజైన్లూ వచ్చాయని, జులై 31 కల్లా పని పూర్తవుతుందని తెలిపారు అధికారులు. ఈసీఆర్‌ఎఫ్ డ్యాంకు సంబంధించి డిజైన్లు కూడా త్వరలో ఖరారవుతాయని వివరాలు అందించారు. వీలైనంత త్వరగా డిజైన్లు తెప్పించుకోవాలన్న సీఎం ... వెంటపడి మరీ పనులు చేయించుకోవాలని అధికారులకు తెలిపారు.
ఆర్ అండ్ ఆర్‌పై దృష్టి
పోలవరం ఆర్ అండ్ ఆర్‌పైన ప్రత్యేక దృష్టిపెట్టినట్టు పేర్కొన్నారు అధికారులు. ప్రాధాన్యతా క్రమంలో కుటుంబాలను తరలిస్తున్నామన్నారు అధికారులు. మొదటి ప్రాధాన్యత కింద తరలించాలనుకున్న వారిని ఆగస్టుకల్లా తరలించేలా తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నిర్దేశించుకున్న 20946 కుటుంబాల్లో ఇప్పటికే 7962 మందిని తరలించినట్టు వెల్లడించారు. మిగిలిన వారిలో 3228 మంది ఓటీఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారని, మిగిలిన 9756 మందిని తరలించాల్సి ఉందని పేర్కొన్నారు.
వీరిని త్వరగా పునరావాసం కల్పించాలని సూచించారు సీఎం. డీబీటీ పద్ధతుల్లో ఆర్ అండ్ ఆర్ కింద ప్యాకేజీలు చెల్లించాలన్నారు.
గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ
నెల్లూరు బ్యారేజీపనులు పూర్తిచేసి మే 15 నాటికి ప్రారంభోత్సవానికి సిద్ధంచేస్తున్నట్టు అధికారులు చెప్పారు. సంగం బ్యారేజీ పనులు కూడా దాదాపుగా పూర్తి కావొచ్చాయన్నారు. మే 15 నాటికి ఓపెనింగ్‌కు రెడీ అవుతున్నట్టు వెల్లడించారు. సంగం బ్యారేజికి మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజిగా నోటిఫై చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. అవుకు టన్నెల్–2లో మిగిలిపోయిన పనులు కేవలం 77.5 మీటర్లను ఈ సీజన్‌లో పూర్తి కాబోతున్నట్టు వెల్లడించారు అధికారులు. 120 రోజుల్లో పనులు పూర్తిచేసేలా ప్రణాళిక వేశామన్నారు. లైనింగ్ సహా ఆగస్టుకల్లా పనులు పూర్తయ్యేలా అన్నిరకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారు.
టార్గెట్ 2023
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి టన్నెల్–2 పనులపై సీఎం ఆరా తీశారు. నెలకు 400 మీటర్ల మేర పనులు చేస్తున్నామన్న అధికారులు... ఇది మరింతగా పెంచి 500 మీటర్ల వరకూ టన్నెల్ తవ్వకం పనులు చేస్తామన్నారు. టన్నెల్ 1 ద్వారా సెప్టెంబర్ నెలలో నీటి సరఫరా ప్రారంభోత్సవానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం. 2023 నాటికి టన్నెల్ –2 సహా అన్నిరకాల పనులు పూర్తి చేసి నీళ్లు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు అధికారులు.
వెలిగొండ ప్రాజెక్టుకు టెండర్లు
వంశధార – నాగావళి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అధికారులు చెబితే అక్టోబరు నాటికి పూర్తయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. వెలిగొండ ప్రాజెక్టు కింద ఉదయగిరి, బద్వేలు ప్రాంతాలకు నీటిని అందించడానికి టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారు. వంశధార నదిపై గొట్టా బ్యారేజి వద్ద నీటిని లిఫ్ట్ చేసి హిరమండలం రిజర్వాయర్‌లోకి పంపింగ్‌కు సంబంధించిన ప్రణాళికలు రూపొందిచాలని సూచించారు.
ఒడిశాకు ప్రయోజనం
వంశధారపై నేరడి వద్ద బ్యారేజీకి సన్నాహాలపై కూడా సీఎం సమీక్షించారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం దాదాపుగా ఏపీనే భరిస్తోందని, బ్యారేజీ నిర్మాణం చేస్తే ఒడిశా కూడా సగం నీటిని వాడుకునే అవకాశం ఉందన్నారు సీఎం. ఇరు రాష్ట్రాలకూ ఇది ప్రయోజనకరమన్న సీఎం... వీలైనంత త్వరగా నేరడి పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
తారకరామ తీర్థసాగర్ త్వరలో ఓపెనింగ్
తోటపల్లి బ్యారేజీ, గజపతినగరం బ్రాంచి కెనాల్, తారరామ తీర్థసాగర్, మహేంద్ర తనయ ఆఫ్‌షోర్ ప్రాజెక్టు పనులు అడిగి తెలుసుకున్నారు సీఎం జగన్. తోటపల్లి ప్రాజెక్టు కింద అన్ని పనులనూ వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. గజపతినగరం బ్రాంచ్ కెనాల్ కింద పనులనూ వేగవంతం చేయాలన్నారు. ఆర్ధికశాఖ అనుమతులు తీసుకుని టెండర్లు పిలవాలని సూచించారు. తారకరామ తీర్థసాగర్‌లో రిజర్వాయర్ పనులు పూర్తికావొచ్చాయన్న అధికారులు... మిగిలిన పనులు వెంటనే టెండర్లు పిలుస్తామన్నారు. సారిపల్లి గ్రామంలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇవ్వాలని సీఎం ఆదేశించారు.
మహేంద్ర తనయ ప్రాజెక్టు పూర్తిచేయడానికి తదేక దృష్టిపెట్టాలన్న సీఎం... ఆర్ధికశాఖ అనుమతులు తీసుకుని టెండర్లు పిలవాలని ఆదేశించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టాలన్నారు. మెయిన్ కెనాల్‌ను శ్రీకాకుళం వరకూ తీసుకెళ్లాలని సూచించార. దీనికి సంబంధించిన భూ సేకరణ తదితర అంశాలు త్వరగా పూర్చి చేయాలన్నారు.