Chandra Babu Naidu: 52 రోజులుగా రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు మరికొన్ని గంటల్లో విడుదలకానున్నారు. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌తో ఆయన స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేసులో కాస్త ఊరట లభించింది. బెయిల్ ప్రక్రియ పూర్తైతే ఆయన సాయంత్రానికి విడుదల కానున్నారు. 


చంద్రబాబుకు బెయిల్ రావడంపై వైసీపీ లీడర్లు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ఇలా సెటైరిక్‌ కామెంట్స్‌ ఎక్కువ చేసే అంబటి రాంబాబు తన ఎక్స్‌ అకౌంట్‌లో సీరియస్ కామెంట్స్ చేశారు. చంద్రబాబుకు బెయిల్ వచ్చింది నిజం గెలిచి కాదని... కళ్ళు కనిపించడం లేదు అని మధ్యంతర బెయిల్ వచ్చిందని కామెంట్‌ చేశారు. 






అంబటి రాంబాబు చేసిన కామెంట్స్‌పై నెటిజన్లు కూడా అదే స్థాయిలో సెటైర్లు వేస్తున్నారు. ఆయనపై పరుషపదజాలంతో విరుచుకుపడుతున్నారు. ఆయనపై ఉన్న ఆరోపణలన్నీ తవ్వి తీస్తున్నారు. జగన్ బెయిల్ విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. ఇలా నిమిషాల వ్యవధిలోనే ఈ ట్వీట్ వైరల్‌గా మారిపోయింది. 


చంద్రబాబు నాయుడికి సంపూర్ణ ఆరోగ్యం కలగాలి 
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడుకి మధ్యంతర బెయిల్ లభించడం సంతోషకరమైన విషయమన్నారు పవన్ కల్యాణ్‌. సంపూర్ణ ఆరోగ్యంతో ఉత్సాహంతో ప్రజా సేవకు పునరంకితం కావాలని ఆకాంక్షించారు. చంద్రబాబు అనుభవం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరమన్నారు. చంద్రబాబు నాయుడు విడుదల కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారని.... అందరం ఆయన్ని స్వాగతిద్దామన్నారు.  


మధ్యంతరం బెయిల్ రావడం మంచిదే :  ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంపై ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు బెయిల్ రావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానాన్ని తాము తప్పు పట్టామని తెలిపారు. నోటీసులివ్వకుండా, విచారణ జరపకుండా అరెస్ట్ చేసిన విధానాన్ని గతంలోనే తప్పు పట్టామని చెప్పుకొచ్చారు. ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేకుండానే అరెస్ట్ చేసిన విధానం కరెక్ట్ కాదన్నారు. మధ్యంతరం బెయిల్ రావడం మంచిదే అని పురందేశ్వరి పేర్కొన్నారు.