ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేకెత్తించిన చైతన్య రథం చిత్రం రి రిలీజ్ అవుతోంది. ప్రస్తుత రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారటం, మరోవైపున వంగవీటి జయంతి రోజునే మరోసారి ఈ చిత్రాని రిలీజ్ చేస్తుండటం చర్చకు దారితీస్తోంది. వంగవీటి మోహన రంగా పేరు ఇప్పటికీ రాజకీయంగా హాట్ టాపిక్. వంగవీటి మోహన రంగా జీవిత చరిత్రను ఆధారంగా చేసుకొని ఆయన బతికి ఉండగానే ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయనే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను కూడా అందించారని, షూటింగ్ స్పాట్‌లో కూడా చాలా సేపు గడిపేవారని చెబుతున్నారు. 


సీనియర్ నటుడు భానుచందర్, శరత్ బాబు నటించిన చైతన్య రథం ఆనాటి పరిస్థితులను తెర మీద చూపించేందుకు ప్రయత్నించారు. అయితే ఈ చిత్రం 1987 చిత్రం రిలీజ్ కాగా, ఆ తరువాత 1988లో వంగవీటి మోహన రంగా బెజవాడలో దారుణంగా హత్యకు గురయ్యారు. ఆయన హత్య ఘటనతో తెలుగు రాష్ట్రాలన్నీ అట్టుడికిపోయాయి. వంద రోజుల పాటు బెజవాడలో కర్ఫ్యూ విధించారు. 


వంగవీటి రంగా భార్యే నిర్మాత...
1987లో రిలీజ్ అయిన ఈ చిత్రం రాధా మిత్ర మండలి మూవీస్ బ్యానర్ పై విడుదల అయ్యింది. రామ రాజ్యమా పేరుతో తీసిన సాంగ్ సినిమాలో కీలకంగా మారిందని అప్పట్లో టాక్. ధవళ సత్యం దర్శకత్వం వహించగా వంగవీటి మోహన రంగా భార్య రత్నకుమారి నిర్మాతగా ఉన్నారు. జె.వి. రాఘవులు సంగీతాన్ని సమకూర్చారు. జాలాది రాజారావు, మైలవరపు గోపి, ఇంద్రగంంటి శ్రీకాంత్ శర్మ సాహిత్యాన్ని అందించారు. 


వివాదానికి తెరతీసిన  సాంగ్ ఇదే...
అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా ఈ సినిమాను తీశారని ప్రచారం. అందులో ఉన్న రామ రాజ్యం సాంగ్‌పై ఇప్పటికీ వివాదం ఉంది. ఎన్టీఆర్ పాలనను రామరాజ్యంతో పోల్చి మాట్లాడేవారు. అయితే రామ రాజ్యం పేరు మీద నడిచే సాంగ్‌లో అప్పటి సర్కార్ అక్రమాలు, దందాలపై విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టడం ప్రభుత్వ పెద్దలకు ఇబ్బందిగా మారిందని అంటున్నారు. అయితే సినిమా రిలీజ్ అయిన మరుసటి ఏడాది వంగవీటి మోహనరంగా దారుణంగా హత్యకు గురయ్యారు.


ప్రింట్లు దహనం 
వంగవీటి మోహన రంగా జీవిత చరిత్ర ఆధారంగా నిర్మితమైన చైతన్యరథం, చిత్రం రిలీజ్ తరువాత రాజకీయాల్లో భారీగా మార్పులు వచ్చాయని చాలా మందిలో టాక్ నడిచింది. ఆ తరువాత ఏడాది రంగా హత్యకు గురి కావటంతో అనేక చోట్ల అల్లర్లు చెలరేగాయి. ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులు అగ్నికి ఆహుతయ్యాయి. రంగా హత్య సమయంలో అప్పట్లో డి డి న్యూస్ ఛానల్‌తో పాటుగా, బీబీసీ వంటి ఛానల్స్‌లో రామ రాజ్యం పాటను ప్లే చేసి, వంగవీటి రంగా హత్యకు సంబంధించిన కారణాలపై విశ్లేషణ జరిపినట్లుగా చెబుతున్నారు. దీంతో అప్పుడే చైతన్య రథం చిత్రానికి సంబంధించిన అన్ని ప్రింట్లను పూర్తిగా దగ్ధం చేశారని, వాటికి సంబంధించిన ఆధారాలను బయటకు రాకుండా చేశారని అంటున్నారు. 


ఈ చిత్రాన్ని మొదట అమెరికా కేంద్రంగా డెట్రాయిట్‌లో రిలీజ్ చేయనున్నారు. ఆ తరువాత కొద్ది రోజులకు అంటే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.