Janasena Latest News: జనసేన పార్టీలో విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. పర్యావరణ పరిరక్షణ మంత్రిగా ఉన్న పవన్ కల్యాణ్ శాఖపైనే పోరాడుతున్నారు జనసేనకు చెందిన కీలక నేత బొలిశెట్టి సత్యనారాయణ. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి, పవన్ కల్యాణ్‌కు చెడ్డ పేరు రాకూడదని ఆయన పార్టీ పదవుల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఇదే ఇప్పుడు కూటమిలో ముఖ్యంగా జనసేనలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న అంశం.
జనసేన పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ తన పార్టీ పదవులకు స్వచ్ఛందంగా విరామం ప్రకటించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం కాకుండా తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం పదవుల నుంచి తప్పుకోవడం రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది. పదవులకు తాత్కాలిక విరామం తీసుకుంటున్న పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
బొలిశెట్టి సత్యనారాయణ చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్‌లో పర్యావరణ సమస్యలపై పోరాటం చేస్తున్నారు. రాష్ట్రంలో పెరిగి పోతున్న కాలుష్యానికి వ్యతిరేకంగా 2020లో నాటి ప్రభుత్వంపై కోర్టులో కేసు వేశారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న జనసేన తరఫున ఆయన చేసిన ఈ పోరాటాన్ని నాడు పార్టీ కూడా ప్రోత్సహించింది. అయితే రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇందులో జనసేన పార్టీ అత్యంత కీలక భాగస్వామిగా కొనసాగుతోంది.
బొలిశెట్టి సత్యనారాయణ తన లేఖలో ప్రధానంగా ప్రస్తావించిన అంశం కాన్‌ఫ్లిక్‌ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ప్రస్తుతం జనసేన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. అంతేకాకుండా పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్వయంగా రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నారు. తాను గతంలో వేసిన కాలుష్యం వ్యతిరేక కేసు ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన గుర్తించారు.
ప్రభుత్వంపై కేసు వేసిన వ్యక్తిగా అదే అధికార కూటమిలో కీలక పదవిలో ఉండటం వల్ల న్యాయపోరాటం నీరుగారిపోయే ప్రమాదం ఉందని లేదా రాజకీయ కారణాల వల్ల ఆ పోరాటం ప్రభావితం కాకూడదని ఆయన భావించారు. అందుకే స్వచ్ఛమైన నీరు, గాలి కోసం తాను చేస్తున్న పోరాటంలో ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు తావు లేకుండా ఉండేందుకు పదవుల నుంచి తప్పుకుంటున్నట్టు స్పష్టం చేశారు.
ఈ నిర్ణయం వల్ల జనసేన పార్టీకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకే బొలిశెట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వంపై కేసు వేసిన వ్యక్తిగా అధికార కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న జనసేన పార్టీకి ఎలాంటి నష్టం జరగకుండా చూసుకోవడం తన బాధ్యతని ఆయన పవన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. పదవుల నుంచి తాత్కాలికంగా తప్పుకున్నా, సామాజిక సేవలో వెనుకడుగు వేయబోనని బొలిశెట్టి స్పష్టం చేశారు. ఇకపై తన పూర్తి సమయాన్ని పర్యావరణ పరిరక్షణకు కేటాయించనున్నట్టు వెల్లడించారు.
ఇప్పుడు తాను తీసుకున్న నిర్ణయం జనసేన పార్టీకి దూరం కావడానికి కాదని ఆయన స్పష్టత ఇచ్చారు. ఇది కేవలం పార్టీ పదవుల నుంచి తీసుకున్న తాత్కాలిక విరామం మాత్రమేనని రాజీనామా కాదని ఆయన వివరించారు. జనసేన సిద్ధాంతాలకు తాను ఎప్పుడూ కట్టుబడి ఉంటానని, పర్యావరణపరంగా తాను కోరుకుంటున్న న్యాయపరమైన పరిష్కారం లభించిన తర్వాత పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే మళ్లీ బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని లేఖలో తెలిపారు.
