ఏపీ ప్రభుత్వానికి రాజధాని రైతులు షాకిచ్చారు. అసెంబ్లీకి వెళ్లే కరకట్ట ప్రక్కన ఏపీ సిఆర్డిఏ కు వ్యతిరేకంగా అన్నదాతలు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. తమ పొలాల పై తమకే హక్కు లేకుండా చేస్తున్న ఏపీ సి ఆర్ డి ఏ సంస్థ వైఖరిని ఖండిస్తున్నాము అంటూ ఉండవల్లి రైతులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సి ఆర్ డి ఏ తీరును వ్యతిరేకిస్తూ ఉండవల్లి రైతులు ఆందోళనకు దిగారు. రహదారి విస్తీర్ణం పేరుతో నష్టపరిహారంతో సంబంధం లేకుండా మీ పొలాలని మేము తీసుకున్నాం అని సి ఆర్ డి ఏ అధికారులు రైతులకి నోటీసులు ఇవ్వడంతోరైతులు ఆందోళన చెందుతున్నారు. 


మీ పొలాలకు మీకు సంబంధం లేదు అంటూ నోటీసులు ఇవ్వటం దుర్మార్గమైన చర్య అని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. VRO రాణి ఇప్పటికే పలువురు రైతులకు ఫోన్లు చేసి మీ ఆర్థిక పరిస్థితి ఏమిటి మీ కులం ఏమిటి అని పదే పదే ప్రశ్నిస్తున్నారని వాపోయారు. రహదారికి మేము వ్యతిరేకం కాదు, నష్టపరిహారం చెల్లిస్తే మేము ఎలాంటి అడ్డంకులు తెలపాము అని రైతులు మరోసారి స్పష్టం చేశారు. 


భూములను ప్రభుత్వం అమ్మాలంటే ఒక న్యాయం, రైతు దగ్గర తీసుకోవాలంటే మరో న్యాయమా అని ఉండవల్ల రైతులు ప్రశ్నిస్తున్నారు. 9 సంవత్సరాల నుంచి మమ్మల్ని అనేక ఇబ్బందులు పెడుతున్నారు మాకు సరైన నష్టపరిహారం ఇచ్చే దాకా మా పొలాలు ఇచ్చే ప్రసక్తే లేదని బాధిత రైతులు తేల్చి చెప్పారు.  


రైతులకు సరైన నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఫ్లెక్సీలతో నిరసన తెలిపారు. తొమ్మిదేళ్ల నుంచి రైతులు కష్టాలు పడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. 9 ఏళ్ల నుంచి తమకు ప్రశాంతత లేదని, మరోవైపు భూమిపై హక్కు కోల్పోతున్నామని చెప్పారు. ఓ మహిళా రైతు మీడియాతో మాట్లాడుతూ.. రైతులు ఎలా ఉన్నారు, తింటున్నారా లేదా అని కూడా పట్టించుకోవడం లేదన్నారు. అర ఎకరం పొలం ఉంటే, దానిపై పది మంది బతుకుతున్నామని చెప్పారు. తమకు సంబంధించిన ఆస్తిపై తమకు హక్కు లేదని ప్రభుత్వం, అధికారులు చెప్పడం సరికాదన్నారు. ప్రభుత్వం భూములు తీసుకున్నా, విక్రయించిన అందుకు తగ్గట్లుగా ధరలు నిర్ణయించుకుంటారని, కానీ రైతులకు మాత్రం వేరే న్యాయమా అని ఆమె ప్రశ్నించారు. 


తాము పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కడం పక్కనపెడితే, తమ భూమిలోనే పరాయి వాళ్లను చేస్తున్నారని ఆరోపించారు. మేం రైతుల కోసమే ఉన్నామని ప్రభుత్వాలు చెబుతాయి, కానీ న్యాయం చేయడం లేదని మహిళా రైతు వాపోయారు. ఉన్న కొంచెం పొలం మీరు తీసేసుకుంటే ఎలా బతకాలో తెలియడం లేదన్నారు. అందుకే గజానికి 20 వేల చొప్పున ప్యాకేజీ ఇచ్చి భూములు తీసుకోవాలని కోరారు. ఇలా ఇచ్చిన తమకు భవిష్యత్తులో బతుకుదెరువు ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు.


కులం వివరాలు అడుగుతున్నారు..
వీఆర్వో రాణి తమకు ఫోన్ చేసి రైతుల భూమి వివరాలు అడగటానికి బదులుగా కులం వివరాలు అడిగి తెలుసుకుంటున్నారని మరో రైతు తెలిపారు. రైతులకు న్యాయం చేయాలని ఉంటే సరైన ప్యాకేజీ, తమ భూమికి ధర ఇచ్చి డెవలప్ మెంట్ కోసం భూములు తీసుకోవాలని కోరారు. కానీ అసలు విషయాన్ని పక్కనపెట్టి మా కులం వివరాలు, మా ఆర్థిక పరిస్థితి లాంటివి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని అధికారులపై ఆరోపణలు చేశారు.