ఏపీలో రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. రాజధాని, జగన్ పాలన చుట్టూ జరుగుతున్న రాజకీయంలో ఎవరిది విజయం.. ఎవరిది వైఫల్యం అన్నదే ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. అందుకు కారణం కోర్టు తీర్పు. ఏపీ సిఎంగా జగన్ అధికారం అందుకున్నప్పటి నుంచి అధికార-విపక్షాల మధ్య రోజుకో రగడ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా మూడు రాజధానుల విషయంలో ఈ పోట్లాట చాలా దూరం వరకు వెళ్లింది.
ఈ రాజకీయ పోరులో ఎవరు విజేతగా నిలిచారు. ఎవరు దోషులుగా మారారు అన్నదే ప్రశ్న. విపక్షంలో ఉన్నప్పుడు అమరావతి రాజధానికి ఓకే అన్న వైసీపీ అధినేత జగన్ సిఎం అయ్యాక మూడు రాజధానులంటూ కొత్త స్వరాన్ని అందుకున్నారు. విశాఖని రాజధానిగా మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు, విపక్షాలన్నీ కోర్టులను ఆశ్రయించాయి. వేల సంఖ్యలో ఫిర్యాదులు విచారించిన హైకోర్టు ఓ తీర్పు వెల్లడించింది. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది.
రాజధాని విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అధికార-విపక్షాలు ఎవరి వాదన వాళ్లు వినిపిస్తున్నాయి. ఇది ప్రభుత్వ వైఫల్యమని విపక్షం అంటుంటే రాజధాని వికేంద్రీకరణలో గెలుపు తమదేనని వైసీపీ నేతలు అంటున్నారు. రాజధాని ఎక్కడ పెట్టాలి, నిర్మాణానికి ఎంత సమయం పడుతుందన్నది ప్రభుత్వ పరిధిలోనిదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే సీఆర్‌డీఏ చట్టం, ల్యాండ్ పూలింగ్ తదితర విషయాలపై ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు నిలదీసింది. హైకోర్టుని కర్నూలుకి తరలిస్తున్నారా లేదా అన్న దానిపై కూడా ప్రభుత్వం నుంచి స్పష్టత కోరింది ధర్మాసనం. ప్రస్తుతానికి అమరావతిలోనే ఉందన్న ప్రభుత్వ తరపు న్యాయవాది భవిష్యత్‌లో ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఉంటుందని వివరణ ఇచ్చారు. దీంతో తదుపరి విచారణని జనవరి 31కి వాయిదా వేసింది.
రాజధాని వికేంద్రీకరణ విషయంలో సుప్రీం వ్యాఖ్యలు కొన్ని జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండటంతో ఆపార్టీలో ఉత్సాహం నెలకొంది. విశాఖ రాజధాని కావడానికి ఉన్న అడ్డంకులు తొలిగిపోయినట్టేనని భావిస్తోన్న సర్కార్ అసెంబ్లీ సమావేశాల్లో మళ్లీ మూడు రాజధానుల బిల్లుని ప్రవేశపెట్టి ఆమోదించుకునేందుకు ప్లాన్ చేస్తోందని టాక్. అయితే రాజధాని విషయంలో సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చాకే ముందడుగు వేస్తుందన్న మరో వాదన కూడా బలంగా వినిపిస్తోంది.
రెండు రోజుల క్రితం ఇప్పటం గ్రామంలో రోడ్ల విస్తరణ విషయంలోనూ ప్రభుత్వానికే అనుకూలంగా హైకోర్టు తీర్పు నిచ్చింది. ఇది కూడా జగన్ ప్రభుత్వానికి ఊరటనిచ్చింది. ఇలా ముఖ్యమైన అంశాల్లో న్యాయస్థానాల నుంచి అనుకూలంగా ఏపీ ప్రభుత్వానికి తీర్పులు రావడంతో అధికార పక్షానిదే పై చేయి అన్న వాదన మొదలైంది.
అమరావతి రైతుల మహాపాదయాత్రకి బ్రేక్ పడింది. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో ఇక ఈ యాత్రలు ఉండవని అధికారపార్టీ చెబుతోంది. ఇంకా అయిపోలేదని... తీర్పును ఎవరి నచ్చినట్టు వాళ్లు అన్వయించుకుంటున్నారని విపక్షం వాదిస్తోంది. ఏమైనా సరై ఈ వరుస తీర్పులు విపక్షాలను కాస్త ఆలోచనలో పడేందని టాక్ వినిపిస్తోంది.
రాజధాని, ఇప్పటం విషయాల్లోనే కాదు ప్రభుత్వానికి సంబంధించిన జీవోలు, పథకాలన్నింటిపైనా విపక్షం వ్యతిరేకత వ్యక్తం చేయడంతోపాటు కోర్టులకు కూడా వెళ్లింది. కొన్ని విషయాల్లో విపక్షాలు, మరికొన్నింటిలో అధికారపక్షం పైచేయి సాధిస్తూ మాదేంటే మాదే గెలుపని సంబరాలు చేసుకుంటున్నాయి. ఈ వాదనలో ఎవరికి వారు గెలుపును పంచుకుంటున్నారే తప్ప ప్రజాభిప్రాయాన్ని మాత్రం ఎవరూ గుర్తించడం లేదన్న వాదన వినిపిస్తోంది.
ఈ రాజకీయరగడతో అసలు ఏపీకి రాజధాని ఎందుకని పార్టీలతో సంబంధం లేని వ్యక్తులు సెటైర్లు వేస్తున్నారు. రాజధాని అంశంపై సుప్రీంకోర్టు లోతైన విచారణ జరిపి తుది తీర్పు ఇస్తేనే గెలుపెవరిది అన్నది తేలుతుంది. అప్పటివరకు ఎవరి గోల వారిదే..ఎవరి తీరు వారిదే అన్నట్టు ఉంది ఏపీ రాజకీయం.