టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ పిటిషన్ పై విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాయిదా వేసింది. తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ మాజీ మంత్రి సత్యనారాయణ మూర్తి ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పిటిషన తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ రెండు కేసుల్లో 41ఏ నోటీసులు ఇచ్చారంటూ కోర్టుకు వివరించారు.


నోటీసులు ఇచ్చి ఇలా అరెస్టు చేస్తారంటూ పిటీషనర్ తరపు న్యాయవాది వాదించారు. తాము ఇలాంటి నోటీసులు ఇవ్వలేదని ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పోలీసుల విధానంపై వివరాలతో కూడిన కౌంటర్ వేయాలని పిటీషనర్ ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. 


ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజాపై బండారు సత్యనారాయణ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బడి మంజుల ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో బండారు సత్యనారాయణ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ దూషించారంటూ గుంటూరులోని అరండల్ పేట ఎస్సై నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు పై ఆ పోలీస్ స్టేషన్లో నమోదైన మరో కేసులో బండారు నారాయణమూర్తికి సీఆర్పిసీ 41ఏ కింద నోటీసులు ఇచ్చారు. అయితే ఆయనను అరెస్టు చేసే క్రమంలో పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది.


పోలీసుల తీరు సరికాదు
బండారు సత్యనారాయణ ని అరెస్టు చేసిన పోలీసుల తీరు సరికాదని టీడీపీ నేతలు ఆరోపించారు. మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు తొలుత ప్రయత్నించారు. అయితే బండారు సత్యనారాయణ మూర్తి తన ఇంటి తలుపులు తెరవకపోవడంతో పోలీసులు హడావిడి చేశారని ఆరోపణలు వచ్చాయి.


చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నిరాహార దీక్ష చేస్తున్న బండారు సత్యనారాయణకు వైద్య పరీక్షలు చేయించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. ఆయన ఇంటికి తీసుకొచ్చిన ప్రైవేట్ అంబులెన్స్‌ను పోలీసులు అడ్డుకున్నారని పలువురు టీడీపీ నేతలు ఆరోపించారు. అయితే టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగడంతో తమకు ఇష్టం వచ్చిన రీతిలో వారిని చిదరగొట్టినట్లు విమర్శలు వచ్చాయి. చివరకు టీడీపీ నేత ఇంటి తలుపులు బద్దలు కొట్టి నోటీసులు అందజేశారు. 41ఏ కింద పోలీసులు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు.  


కాగా మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్ చేశారు. ధైర్యంగా ఉండాలని.. పోరాటాన్ని కొనసాగించాలని లోకేష్ చెప్పారు. అక్రమ కేసులు పెట్టే పోలీసులు భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని లోకేష్ హెచ్చరించారు. వైసీపీ తొత్తుల్లా వ్యవహరించే ప్రతి అధికారి వివరాలు నమోదు చేయాలని బండారు సత్యనారాయణమూర్తికి సూచించారు. ప్రతిపక్షాలే లక్ష్యంగా కక్ష సాధింపులకు దిగడం కొందరు పోలీసులకు పరిపాటిగా మారిందని లోకేష్ మండిపడ్డారు. బూతుల మంత్రులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని పోలీసులను నిలదీశారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తన పోరాటం ఆపేది లేదని లోకేష్‌కు బండారు సత్యనారాయణ మూర్తి స్పష్టం చేశారు.