Amaravati: అమరావతిలో కీలకమైన టవర్ల నిర్మాణానికి ఏజెన్సీలకు పనులు అప్పగింతకు ఆమోదం తెలిపింది ఏపీ ప్రభుత్వం. రాజధాని అమరావతిలో జీఏడీ టవర్‌తోపాటు టవర్లు 1,2,3,4 నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయింది..టెండర్లలో ఎల్1 గా నిలిచిన సంస్థలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది.
జీఏడీ టవర్ పనులను 882 కోట్లకు ఎన్ సీసీ సంస్ధ, HOD టవర్లు 1,2 టెండర్లను 1487 కోట్లకు షాపూర్జీ సంస్థ, టవర్లు 3, 4 పనులను ఎల్ అండ్ టీ సంస్థ 1303 కోట్లతో దక్కించుకుందన్నారు మంత్రి నారాయణ. మొత్తం 3673.44 కోట్లతో ఆ టవర్ల నిర్మాణ పనులను కూడా త్వరలో ఆయా కంపెనీలు ప్రారంభిస్తాయని మంత్రి తెలిపారు. పాలన సులభంగా ఉండాలనీ ప్రజలు పలుచోట్లకు తిరుగకుండా ప్రజాపరిపాలన సులువుగా ఉండేందుకై పరిపాలన అంతా ఒకేచోట ఉండేలా ఈ ఐదు టవర్ల నిర్మాణ పనులను చేపట్టడం జరిగిందన్నారు.
2014-19 మద్య కాలంలో రూపొందించిన డిజైన్ల ప్రకారమే ఈ టవర్ల నిర్మాణాల పనులు కొనసాగుతాయని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రానున్న మూడు సంవత్సరాల్లో అమరావతి కోర్ క్యాపిటల్ ప్రాంతంలోని అన్ని నిర్మాణాలను పూర్తి చేయడం జరుగుతుందని, రెండో దశ ల్యాండ్ పూలింగ్ కూడా పూర్తిచేసి అభివృద్ది పర్చడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
ఇంజినీర్ల కమిటీ సూచనల మేరకే ధరల నిర్ణయం
అమరావతి నిర్మాణంలో టెండర్ల ధరలు పెంచారని ప్రతిపక్ష వైసీపీ అనవసర ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు...22 మంది చీఫ్ ఇంజనీర్ల కమిటీ నిర్ణయం మేరకే ధరలు ఖరారు చేశామని స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధి చేసేందుకు సింగపూర్ ప్రభుత్వం గతంలో ముందుకొచ్చిందని అన్నారు.. అయితే తమ తప్పు లేకుండా గత ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెట్టిందని సింగపూర్ అధికారులు చెబుతున్నారని మంత్రి నారాయణ చెప్పారు