Swarnandhra centers : స్వర్ణాంధ్ర కేంద్రాలుగా సచివాలయాలు- పేర్లు మార్చే యోచనలో ఏపీ ప్రభుత్వం !
Swarnandhra centers :ఆంధ్రప్రదేశ్‌లో మరో మార్పు దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. విజన్ 2047కి అనుగుణంగా సచివాలయాలను తీర్చిదిద్దేందుకు వాటికి స్వర్ణాంధ్ర కేంద్రాలుగా మార్చనున్నారు.

Swarnandhra centers :ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వార్డు, గ్రామ సచివాలయాల పేర్లు మార్చి మరింత ఆధునీకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. దీని కేంద్రంగా రాజకీయం చేసేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోందని అందుకే చెక్ పెట్టాలని ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో వస్తోంది. మరింత వేగవంతంగా ప్రజలకు సేవలు అందేందుకు చేసే ప్రయత్నాల్లో భాగంగానే ఈ చర్యలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోలేదని, ఈ ఆలోచన గురించి నాయకుల అభిప్రాయాలు తీసుకుంటున్నట్టు సమాచారం.
2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు. అందులో లక్షకుపైగా ఉద్యోగాలు నియమించారు. దీని కేంద్రంగానే ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వానికి కావాల్సిన డేటాను, ఇతర వివరాలను సేకరించడం మొదలు పెట్టారు. విపత్తుల టైంలో కూడా ఈ సచివాలయాలు చాలా ఉపయోగపడ్డాయి. అయితే ఇప్పుడు వీటినే తమ రాజకీయ మనుగడకు వైసీపీ వాడుకుంటోందని కూటమి ప్రభుత్వ పెద్దల ఆరోపణ. ఏ పార్టీలు అధికారంలోకి వచ్చిన కొన్నింటిని కంటిన్యూ చేయడం సర్వసాధారణం, అయితే ఆ విషయాన్ని పట్టించుకోకుండా సచివాలయాలు తమ బ్రాండ్‌గా ప్రచారం చేసుకోవడం కూటమి నేతలకు నచ్చడం లేదు.
సమస్య ఎక్కడ మొదలైంది
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏ పని చేసినా సచివాలయాలు ఏర్పాటు చేయడంతోనే పని సులభమైందని, ఆ విషయంలో క్రెడిట్ తమదేనంటూ వైసీపీ ప్రచారం చేసుకుటోంది. మొన్నటికి మొన్న తుపాను హెచ్చరికలు తెలియజేస్తూ సచివాలయంలో మైకులు పెడితే నాడు విమర్శలు చేశారని నేడు అవే ఉపయోగపడుతున్నాయని ప్రచారం చేశారు. విజన్ అంటే తమదేనంటూ చెప్పుకొచ్చారు వైసీపీ నేతలు. ప్రతి పని వెనుక సచివాలయం ఉందని ఊదరగొడుతున్నారు.
దీనికి తోడు సచివాలయంలో ఉన్న సిబ్బందికి చేసే పనుల్లో కూడా చాలా వ్యత్సాసం ఉంటోంది. కొందరికి పని భారం ఎక్కువగా ఉంటోంది. మరికొందరికి అసలే పని ఉండటం లేదు. వాటిని బ్యాలెన్స్ చేసేందుకు కూడా కొత్త జాబ్ సిద్ధం చేయనున్నారు. మారుతున్న పాలనకు అనుగుణంగా వారిని, సచివాలయాలను సిద్ధం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇలా అన్ని విభాగాల్లో వారిని మరింతగా ప్రజలకు చేరువ చేయడంతోపాటు పేరు కూడా మార్చేందుకు రెడీ అయ్యింది. స్వర్ణాంధ్ర 2047లో పెట్టుకున్న లక్ష్యాలకు తగ్గట్టుగానే మార్పులు చేర్పులు చేయనున్నారు. అందుకే వాటికి స్వర్ణాంధ్ర కేంద్రాలు లేదా స్వర్ణాంధ్ర సెంటర్‌లుగా పేరు పెట్టనున్నారు.





















