పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలను కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను సీఎం జగన్ అభ్యర్థించారు. ఢిల్లీలో ఉన్న జగన్... నిన్న రాత్రి కేంద్రమంత్రి అమిత్‌షాతో సమావేశమయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు వీరి భేటీ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రానికి చెందిన పలు సమస్యలను అమిత్‌షా దృష్టికి జగన్ తీసుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు త్వరగా ఆమోదం తెలపాలని రిక్వస్ట్ చేశారు. ఏపీ,తెలంగాణ మధ్య పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి చొరవచూపాలన్నారు. విభజన చట్టంలోని 9,10 షెడ్యూల్‌లో పొందపరిచిన ఆస్తుల విభజన, తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలను కూడా వచ్చేలా ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
సీతారామన్‌తో సమావేశం
నీతి ఆయోగ్ మీటింగ్‌లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కూడా కలిశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించారు. ఆమెతో సుమారు 40నిమిషాలు సమావేశమయ్యారు. నాడు నేడు పథకం, ఆరగ్యరంగాల్లో చేస్తున్న ఖర్చును క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్‌గా భావించి సాయం చేయాలని ఆమెను రిక్వస్ట్ చేశారు. ఇదే విషయాన్ని కేంద్ర బడ్జెట్‌లో పెట్టినట్టు ఆమెకు గుర్తు చేశారు. విద్య, వైద్య రంగంలో తీసుకొచ్చిన మార్పులు గురించి ఆమెకు వివరించారు. తొలి దశలో 15వేలకుపైగా స్కూళ్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. వైద్య రంగంలో కూడా నాడు నేడు కింద ఆసుపత్రులు పునర్‌నిర్మస్తున్నామని పేర్కొన్నారు. రెండు రంగాలపై వేల కోట్లు ఖర్చు పెట్టామన్నారు సీఎం జగన్. వాటిని క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్‌గా భావించి సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
గత ప్రభుత్వం చేసిన తప్పులు కారణంగా ఇప్పుడు రుణ పరిమితి విధించారని వాటిలో సడలింపు ఇవ్వాలని నిర్మలా సీతారామన్‌ను జగన్ కోరారు. విభజన తర్వాత తెలంగాణకు ఏపీ విద్యుత్ సరఫరా చేసిందని దీనికి 6,756.92 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని ఆ బకాయిలు వచ్చేలా చూడాలన్నారు.
జలవనరుల మంత్రితో భేటీ
కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కూడా సీఎం జగన్ కలిశారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలు ఆమోదించాలని అభ్యర్థించారు. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న నిధులు కూడా విడుదల చేయాలని కోరారు. వీళ్ల భేటీ కూడా సుమారు 30 నిమిషాలు సాగింది.