అర్నబ్, మురసు తుఫానుల వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం, ప్రజలకు కలిగిన ఇబ్బందులు, చేపట్టిన సహాయక చర్యలను వివరిస్తూ ఆర్థిక సహాయం కోరుతూ సీఎం చంద్రబాబు లేఖ రాశారు.
CM Chandrababu: వరుస తుఫాన్లతో భారీగా నష్టం.. సాయం చేయాలంటూ కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ
అర్నబ్, మురసు తుఫాన్ల పంట, ఆస్తి నష్టాల నుంచి రాష్ట్రాన్ని ఆదుకోవడానికి తక్షణమే ఆర్థిక సాయం అందించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖ రాశారు.

- చంద్రబాబు అర్నబ్, మురసు తుఫాన్ల నష్టంపై అమిత్ షాకు లేఖ.
- అమిత్ షా ఫోన్ చేసి, రూ.343.95 కోట్ల నష్టంపై ఆరా.
- వ్యవసాయ రంగంలో 94% నష్టం; 12,230 మంది తరలింపు.
- కేంద్ర బృందానికి కృతజ్ఞతలు, తక్షణ ఆర్థిక సాయం కోరిన సీఎం.
అమరావతి: అర్నబ్, మురసు తుఫాన్ల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. తుఫాను కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సంభవించిన పంట, ఆస్తి నష్టంతో పాటు ప్రజలకు కలిగిన ఇబ్బందులు, కూటమి ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను వివరిస్తూ కేంద్ర మంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రానికి అవసరమైన ఆర్థిక సాయాన్ని తక్షణమే అందించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.
మురసు తుఫాను ప్రభావం పై సీఎం చంద్రబాబుకు కేంద్ర మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. రాష్ట్రంలో తుఫాను పరిస్థితులు, జరిగిన నష్టం, సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కేంద్ర మంత్రికి చంద్రబాబు వివరించారు. ఒకే రోజు రెండుసార్లు అమిత్ షాతో ఫోన్‌లో మాట్లాడిన సీఎం చంద్రబాబు, వరుస తుఫాన్ల కారణంగా ఏపీకి జరిగిన నష్టాన్ని వివరించారు. అర్నబ్ తుఫాను ప్రభావం నుంచి రాష్ట్రం పూర్తిగా కోలుకోకముందే మురసు తుఫాను కారణంగా పరిస్థితులు మరింత క్లిష్టంగా మారాయని చంద్రబాబు వివరించారు.
రూ.343.95 కోట్ల మేర ప్రాథమిక నష్టం
మురసు తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని 8 శాఖలకు సంబంధించి ప్రాథమికంగా రూ.343.95 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు కేంద్ర హోంమంత్రికి ఆయన వివరించారు. ఇందులో దాదాపు 94 శాతం నష్టం వ్యవసాయ రంగంలోనే ఉందన్నారు. ఏపీలోని ఏడు జిల్లాల్లో 465 గ్రామాల పరిధిలో 50,473 హెక్టార్లలో పంటలు దెబ్బ తిన్నాయని, 69,828 మంది రైతులు ప్రభావితమయ్యారని తెలిపారు. వీటిలో 45,900 హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లిందని, వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రాథమికంగా రూ.324.22 కోట్ల నష్టం అంచనా వేసినట్లు తెలిపారు.
ముఖ్యంగా బాపట్ల, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పంట నష్టం అధికంగా ఉందని, ఉద్యాన పంటలు సైతం దెబ్బతిన్నాయని వివరించారు. తుఫాను ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ, అత్యవసర కార్యకలాపాల కేంద్రాలను అప్రమత్తం చేసినట్లు సీఎం చంద్రబాబు వివరించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక, పునరావాస చర్యల కోసం 11 ఎస్‌డీఆర్ఎఫ్, 13 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ముందుగానే సిద్ధం చేశామన్నారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో 480 పాఠశాలలను పునరావాస కేంద్రాలుగా ఏర్పాటు చేశామని, ఇప్పటివరకు 12,230 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొన్నారు.
కేంద్రానికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు
తుఫాను నష్టాన్ని పరిశీలించి, అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని పంపినందుకు అమిత్ షాకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న అనంతరం పంటలు, ఇళ్లు, రోడ్లు, విద్యుత్, సాగునీటి వనరులకు జరిగిన నష్టంపై అంచనాలు రూపొందించి పూర్తి స్థాయి నివేదికను కేంద్రానికి సమర్పిస్తామని తెలిపారు. వరుస తుఫాన్ల కారణంగా రాష్ట్రంపై పడిన ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం తగిన సహాయం అందించాలని కేంద్రానికి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు అవసరమైన సహకారం అందించాలని కోరారు. ఏపీలో తుఫాను ప్రభావం కొనసాగుతున్న పరిస్థితుల్లో జరిగిన నష్టాలపై సమగ్ర అంచనాలు రూపొందించే ప్రక్రియను పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన వెంటనే చేపడతామని సీఎం చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు.
Frequently Asked Questions
ఏపీ సీఎం చంద్రబాబు అమిత్ షాకు ఎందుకు లేఖ రాశారు?
మురసు తుఫాను కారణంగా ప్రాథమికంగా ఎంత నష్టం వాటిల్లింది?
మురసు తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని 8 శాఖలకు సంబంధించి ప్రాథికంగా రూ.343.95 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఇందులో 94% వ్యవసాయ రంగంలోనే ఉంది.
తుఫాను వల్ల ఏ రంగానికి అత్యధిక నష్టం వాటిల్లింది?
తుఫాను ప్రభావంతో వ్యవసాయ రంగానికి అత్యధిక నష్టం వాటిల్లింది. ప్రాథమికంగా రూ.324.22 కోట్ల నష్టం అంచనా వేయబడింది, ఇందులో వరి పంటకు ఎక్కువ నష్టం జరిగింది.
తుఫానుల కారణంగా ఎంతమంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు?
తుఫాను ప్రభావిత జిల్లాల్లో 480 పాఠశాలలను పునరావాస కేంద్రాలుగా ఏర్పాటు చేసి, ఇప్పటివరకు 12,230 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ట్రెండింగ్ వార్తలు























