AP speaker Ayyanna Patrudu | అమరావతి: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన నిర్వహించిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సెషన్ నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రేపు (ఫిబ్రవరి 12) గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభమవుతుంది. ఈ 14న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మార్చి 7 వరకు 17 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఒకవేళ చర్చించాల్సిన అంశాలు ఎక్కువగా ఉంటే, అవసరమైతే సమావేశాలను మరికొన్ని రోజులు పొడిగించే అవకాశం ఉందని అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. మొత్తం పదిహేడు రోజుల పాటు శాసనసభ కార్యకలాపాలు సాగనున్నాయి.

Continues below advertisement

 ఈ నెల 14న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. మహా శివరాత్రి పండుగను దృష్టిలో ఉంచుకుని, పండుగ మరుసటి రోజైన 16వ తేదీన సభకు సెలవు ప్రకటించారు. తిరిగి ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు సభ నిరంతరాయంగా కొనసాగుతుంది. ఫిబ్రవరి 21, 22 తేదీల్లో వీకెండ్ సెలవులు ఉంటాయి. ఫిబ్రవరి 17, 18 తేదీల్లో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సభ్యుల మధ్య సుదీర్ఘ చర్చ జరగనుంది. ఈ 18వ తేదీన రాష్ట్ర బడ్జెట్‌పై జరిగిన చర్చకు ఆర్థిక మంత్రి సమాధానం ఇవ్వనున్నారు. పరిపాలనలో పారదర్శకత, ప్రజల అవసరాలే ప్రాతిపదికగా ఈ సమావేశాల అజెండాను రూపొందించారు. 

ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు నాలుగు రోజుల పాటు బడ్జెట్ అంశాలపై, ఇతర ప్రజా సమస్యలపై చర్చలు జరుగుతాయి. ఫిబ్రవరి 28, మార్చి 1 తేదీల్లో సభకు విరామం ఉంటుంది. మార్చి 2 నుంచి 7 వరకు చివరి విడత సమావేశాలు నిర్వహిస్తారు. ఈ విడతలో భాగంగా మార్చి 5, 6, 7 తేదీల్లో ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా క్రీడా పోటీలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Continues below advertisement

అసెంబ్లీలో నిరసనకు దిగి సభ నుంచి వైసీపీ వాకౌట్

ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే తీవ్ర గందరగోళం నెలకొంది. గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి తన ప్రసంగాన్ని కొనసాగిస్తుండగా, వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సభ నుండి వాకౌట్ చేశారు. గవర్నర్ తన ప్రసంగంలో గత ప్రభుత్వం అనుసరించిన విధానాలను విమర్శించడం, వ్యవస్థల నిర్వీర్యం గురించి ప్రస్తావించడాన్ని ప్రతిపక్ష సభ్యులు తప్పుబట్టారు. ఇది కేవలం రాజకీయ ప్రసంగంలా ఉందని ఆరోపిస్తూ సభ మధ్యలోనే నిష్క్రమించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయవద్దని, తమను ప్రతిపక్ష పార్టీగా గుర్తించి జగన్ కు ప్రతిపక్షనేత హోదా ఇవ్వాలని డిమాండ్ చేసిన తరువాత సభ నుంచి వాకౌట్ చేశారు.

సభ వెలుపల వైసీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం గవర్నర్ నోట అబద్ధాలు చెప్పిస్తోందని నినాదాలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి కంటే గత పాలనపై బురద చల్లడమే లక్ష్యంగా ఈ ప్రసంగిస్తున్నారని విమర్శించారు. వైసీపీ సభ్యుల నినాదాల మధ్యే గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. రాజకీయాలకు అసెంబ్లీని కేంద్రంగా వాడుకుంటున్నారని జగన్ మండిపడ్డారు.