Amaravati Inner Ring Road Case | హైదరాబాద్: మంగళగిరి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి (RK)కి ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు షాక్ ఇచ్చారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు నోటీసులు అందజేశారు. అమరావతి రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు (IRR) అలైన్‌మెంట్ కుంభకోణం కేసులో భాగంగా, విజయవాడలోని ఏసీబీ కోర్టుకు హాజరై తన వాదనలను వినిపించాలని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నెల 27వ తేదీన కోర్టుకు హాజరు కావాలని అధికారులు స్పష్టం చేయడంతో, ఆ రోజు ఆర్కే కోర్టుకు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది.
కేసు బ్యాగ్రౌండ్ ఇదే..గత వైసిపి ప్రభుత్వ హయాంలో మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు నమోదైంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, పి. నారాయణ, కొంతమంది పారిశ్రామికవేత్తలు తమకు అనుకూలమైన వారి భూముల విలువ పెంచేలా రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ను మార్చారని ఆర్కే ఆరోపించారు. ఒకవేళ ఆయన హాజరుకాకపోతే, కేసు విచారణలో తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు సంకేతాలిచ్చారు. ఈ కేసులో ప్రధానంగా అలైన్‌మెంట్ మార్పు ద్వారా సుమారు 400 ఎకరాల భూమికి సంబంధించిన లావాదేవీల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి.
అయితే, రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ కేసు విచారణలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఏసీబీ అధికారులు ఆయనకు నోటీసులు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఈ కేసులో గతంలో సీఐడీ (CID) సుదీర్ఘ విచారణ చేపట్టింది. ఇప్పుడు ఏసీబీ కోర్టు ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తుండటంతో, ఫిర్యాదుదారుడిగా లేదా సాక్షిగా ఆళ్ల రామకృష్ణారెడ్డి వాంగ్మూలం ఈ కేసులో కీలకంగా మారనుంది. రాజధాని అమరావతి భూముల కేటాయింపులు, క్విడ్ ప్రో కో ఆరోపణల చుట్టూ తిరుగుతున్న ఈ వివాదంలో 27వ తేదీన జరిగే విచారణ అత్యంత కీలకం కానుంది.