Andhra Pradesh Weather Update: అతి పెద్ద పండుగైన సంక్రాంతి సంబరాలకు సిద్ధమవుతున్న వేళ వాతావరణం ఏపీ ప్రజలను కలవరపెడుతోంది. రాష్ట్రం ప్రస్తుతం విచిత్రమైన వాతావరణ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకవైపు బంగాళాఖాతాంలో పొంచి ఉన్న తుపాను ముప్పు కోస్తా తీరాన్ని భయపెడుతుంటే, మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు గజగజ వణికిస్తున్నాయి. ఈ డబుల్ ఎఫెక్ట్ ప్రజలకు సవాల్‌గా మారింది.
తుపాను ముప్పు ఎంత ఉంటుంది?
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇప్పుడు తీవ్ర రూపం దాలుస్తోంది. వాతావరణ శాఖ తాజా నివేదికల ప్రకారం, ఈ వాయుగుండం బలపడుతూ తుపానుగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వాయుగుండం పశ్చిమ- వాయువ్య దిశగా కదులుతూ శ్రీలంక వైపు ప్రయాణిస్తోంది. శుక్రవారం సాయంత్రం నాటికి ఇది శ్రీలంకలోని హంబన్‌తోట, బట్టికోల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ తీరంపై ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అయితే ఇది తుపానుగా మారిన పక్షంలో గాలుల వేగం గంటకు 60 నుంచి 100 కిలోమీటర్ల వరకు పెరిగే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఉత్తర ఆంధ్ర, ఒడిశా, తమిళనాడు తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకే మత్స్యకారులు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లకూడదని, తీరని ప్రాంత ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
చరిత్ర పునరావృతం కానుందా?
సంక్రాంతి సమయంలో తుపానులు రావడం కొత్తేమీ కాదని వాతావరణ రికార్డులు చెబుతున్నాయి. 1891 నుంచి 2024 మధ్య కాలంలో సంక్రాంతి పండుగ సమయంలో సుమారు 12 సార్లు తుపానులు ఏర్పడినట్టు ప్రజలు గుర్తు చేస్తున్నారు. ఈ ఏడాది కూడా అదే తరహా వాతావరణ పరిస్థితులు కనిపిస్తుండటంతో అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలను ముమ్మరం చేశారు. పండుగ పూట వర్షాలు కురిస్తే చేతికి వచ్చిన పంట దెబ్బతినే అవకాశం ఉండటంతో రైతాంగం ఆందోళన చెందుతోంది.
ఏజెన్సీలో గడ్డ కట్టే చలి- పదేళ్ల రికార్డుల దిశగా...
తుపాను గండం ఒకవైపు ఉంటే, అల్లూరి సీతారామరాజు జిల్లాలో చలి తీవ్రత పరాకాష్టకు చేరింది. మన్యం ప్రాంతం మంచు దుప్పటిని కప్పుకుంది. ముఖ్యంగా పాడేరులో గురువారం ఉదయం కేవలం 4.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే చాలా తక్కువ. చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రాంతంలోని ఇతర జిల్లాల్లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది.
ఉదయం పది గంటల వరకు మంచు తెరలు వీడకపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. చలి తీవ్రత పెరగడంతో గిరిజన ప్రాంతాల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు.