AP Matsyakara Bharosa 2026 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సుదీర్ఘ తీర ప్రాంతంపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మత్స్యకార కుటుంబాలు గుడ్ న్యూస్. సముద్రంలో చేపల వేటపై ఏటా విధించే 61 రోజుల వార్షిక నిషేధ సమయాన్ని దృష్టిలో ఉంచుకొని మత్స్యకారుల ఆర్థిక ఇబ్బందులను తీర్చేందుకు మత్స్యకార భరోసా పథకాన్ని అమలు చేస్తుంది. ఈ ఏడాది సాయాన్ని మరో పది రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో వేయనున్నారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
సముద్ర మత్స్య సంపదను సంక్షించడం, చేపల పునరుత్పత్తికి ఆటంకం కలగకుండా చూడటానికి ఈ 61 రోజుల నిషేధం విధిస్తారు. సాధారణంగా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు చేపలు, రొయ్యల, సంతాన ఉత్పత్తి కాలంగా పరిగణిస్తారు. ఈ సమయంలో యాంత్రిక, మోటరైజ్డ్ బోట్లతో వేట సాగిస్తే మత్స్యసంపద లభ్యతపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా తూర్పు తీరంలో ఈ నిబంధన అమల్లో ఉంది. అయితే ఈ రెండు నెలల పాటు సముద్రంలోకి వెళ్లలేని మత్స్యకారులకు ఉపాధి కరవై, వారి కుటుంబాలు గడవడం భారంగా మారుతుంది. అందుకే ప్రభుత్వం ఈ కష్టకాలంలో వారికి ఆర్థిక భరోసా కల్పిస్తోంది.
15 లేదా 16 తేదీల్లో లబ్ధిదారుల ఖాతాల్లో నగదు
గత ఏడాది 2025లో ఏప్రిల్ 26న నిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేశారు. అయితే 2026 సంవత్సరానికి సంబంధించి, ప్రస్తుతం క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం, మే 1 నుంచి మే ఆరు వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితాలను ప్రదర్శనకు ఉంచారు. ప్రజల అభ్యంతరాలను స్వీకరించిన అనంతర తుది జాబితాను కలెక్టర్లు ఆమోదించాల్సి ఉంటుంది. మత్స్యశాఖ అధికారుల అంచనా ప్రకారం మే 15 లేదా 16 తేదీల్లో డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో 20 వేల రూపాయల జమ అయ్యే అవకాశం ఉంది.
ఇవి పక్కాగా ఉంటేనే డబ్బులు
ఈ పథకం కింద లబ్ధి పొందడానికి ప్రభుత్వం కొన్ని కీలక నిబంధలను పెట్టింది. మత్స్యకారుల వయసు 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి. మత్స్యశాఖలో నమోదైన బోట్లలో పని చేసే వారు లేదా బోటు యజమానులు మాత్రమే అర్హులు. వేట నిషేద సమయంలో సముద్రంలోకి వెళ్లని వారికి మాత్రమే ఈ సాయం అందుతుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే బోటు రిజిస్ట్రేషన్ రద్దు చేయడమే కాకుండా, పథకానికి అనర్హులుగా ప్రకటిస్తారు. లబ్దిదారుడి బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉండటం తప్పనిసరి. దరఖాస్తుదారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి.
రూల్స్ సవరించిన కూటమి ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం మత్స్యకారుల ప్రయోజనం కోసం కొన్ని పాత రూల్స్‌ను సవరించింది. గతంలో మోటారు పడవలకు కనీసం వెయ్యి లీటర్ల, మెకనైజ్డ్ పడవలకు వెయ్యి లీటర్ల డీజిల్ రాయితీని వినియోగించి ఉండాలనే నిబంధన ఉండేది. ప్రభుత్వం ఆ రూల్‌ను తొలగించింది. మత్స్యశాఖలో నమోదైన అన్ని అర్హత గల బోట్లకు భృతిని వర్తింపజేస్తోంది. ఎన్టీఆర్ పెన్షన్ పొందుతున్న వారు మినహా, మిగిలిన అన్ని ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఈ ఇరవై వేల సాయం పొందేందుకు అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది.
స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?
మత్స్యకారులు తమ దరఖాస్తు స్థితిని తెలుసుకోవడానికి gswsnbm.ap.gov.in పోర్టల్‌ను సందర్శించవచ్చు. మీ 12 అంకెల ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ నమోదు చేసి, మొబైల్ ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వడం ద్వారా మీ పేమెంట్ స్టేటస్ చూడవచ్చు. ఏదైనా టెక్నికల్ సమస్య ఉంటే 1902 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయవచ్చు.
