Andhra Pradesh Latest News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెయ్యి వివాదం మరింత ముదురుతోంది. శాసన మండలిలో హెరిటేజ్, ఇందాపూర్‌సంస్థ అంశాలపై చర్చించాలని వైసీపీ పట్టుబడుతోంది. అందులో భాగంగా రోజూ వాయిదా తీర్మానాలు ఇస్తూ వస్తోంది. ఎప్పటి మాదిరిగానే మండలి ఛైర్మన్ వాటిని తిరస్కరిస్తున్నారు. శుక్రవారం కూడా వైసీపీ సభ్యులు టీటీడీకి సరఫరా అయిన నెయ్యి, హెరిటేజ్, ఇందాపూర్ వ్యవహారంపై చర్చించాలని వాయిదా తీర్మానాలు ఇచ్చారు. వాటిని ఛైర్మన్ తిరస్కరించారు. దీంతో వైసీపీ నేతలు తమ వెంట తెచ్చుకున్న వెంకటేశ్వర స్వామి ఫొటోలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసిపెట్టిన ఫ్లెక్సీలను ప్రదర్శించారు.
వైసీపీ సభ్యులు దేవుడి ఫొటోలను మండలిలోకి తీసుకురావడంపై అధికార పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దేవుడిని రాజకీయాల్లోకి లాగడం ఏంటని ప్రశ్నించింది. దేశ చరిత్రలోనే ఇలాంటివి ఎక్కడా జరగలేదని చెప్పింది. చట్టసభల్లో దేవుడి చిత్రాలు, మతపరమైన థింగ్స్ తీసుకురాకుడనే రూల్‌ను అతిక్రమించారని ఆరోపించారు. మంత్రి పయ్యావుల కేశవ మాట్లాడుతూ దేవుడిపై నమ్మకం లేని వారు దేవుడి ఫొటోలతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వారి చర్యలను చైర్మన్ ఖండించాలని డిమాండ్ చేశారు.
మండలి ఛైర్మన్ కూడా వైసీపీ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి సభలో ప్రదర్శించ కూడదని వారించారు. అయినా వైసీపీ సభ్యులు ఆయన సూచనలు పట్టించుకోలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీటీడీలో హెరిటేజ్ అక్రమాలకు ప్రభుత్వం వంతపాడుతోందని నిరసన తెలిపారు. ఆ అంశాల్లో చర్చ జరిపితే వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయని అభిప్రాయపడ్డారు.
ఓవైపు ఛైర్మన్, మరోవైపు అధికార పార్టీ సభ్యులు అభ్యంతరం చెప్పినా వైసీపీ నేతలు వినిపించుకోలేదు. వారు మండలి ఛైర్మన్ పోడియం చుట్టు ముట్టి నినాదాలు చేశారు. వారికి వ్యతిరేకంగా అధికార పార్టీ సభ్యులు వ్యతిరేకంగా నినాదాలు అందుకున్నారు. ఎవరూ తమ సీట్లలో కూర్చోకుండా మండలిలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో సభను వాయిదా వేస్తున్నట్టు మండలి ఛైర్మన్ ప్రకటించారు. అప్పటి వరకు వైసీపీ సభ్యులపై ఆగ్రహంతో మాట్లాడుతున్న మంత్రి పయ్యావుల కేశవ్ తన చేతిలో ఉన్న మైక్‌ను విసిరికొట్టారు.
