అన్యాయాలు అక్రమాలు జరిగిన చంద్రబాబు పాలనను... అభివృద్ధి సంక్షేమ రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్న తమ పాలనతో ప్రజలు పోల్చి చూసుకోవాలన్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్. ప్రజలకు అందించే సాయాన్ని అడుగడుగునా అడ్డుకుంటున్న చంద్రబాబు, ఆయనకు వత్తాసు పలుకుతున్న మీడియా వైఖరిని గమనించాలని సూచించారు. 


కేసులతో ప్రజలకు నష్టం


ప్రభుత్వానికి వ్యతిరేంగా హైకోర్టులో కేసులు వేస్తూ ఆటంకం కలిగిస్తున్నారని సీఎం జగన్ అన్నారు. అ కేసుల్లో వచ్చే తీర్పులు ప్రజలకు నష్టం కలిగిస్తాయి.  ఆవిషయం తెలిసినా కూడా చంద్రబాబు ఆనందిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి సంకుచితమైన చంద్రబాబు నిర్ణయాలకు... విస్తృత ప్రయోజనాల కోసం తమ ప్రభుత్వ చేస్తున్న పనులకు తేడా గుర్తించాలని ప్రజలుక రిక్వస్ట్ చేశారు. 


ప్రభుత్వ బడిని చంపేశారు


ప్రభుత్వ బడులు చంపేయాలని చంద్రబాబు చూస్తే... ఆ బడులకు కొత్త హంగులు ఇస్తూ అభివృద్ధి చేస్తున్నామన్నారు సీఎం జగన్.  ఇంకో ఐదేళ్లు చంద్రబాబు సీఎంగా ఉండి ఉంటే ప్రభుత్వ బడులను పూర్తిగా రూపు మాపేసేవాళ్లని ఎద్దేవా చేశారు. తాము ఇప్పుడు ఆ ప్రభుత్వ బడులకు పూర్వ వైభవం తీసుకొస్తున్నామన్నారు సీఎం. 


ఇంగ్లీష్‌తో అండగా


నారాయణ, చైతన్య వంటి కార్పొరేట్‌ కోసం పరిగెడితే.. తాము ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్థాయికీ తీసుకెళ్లేందుకు పరుగెడుతున్నామన్నారు జగన్.. బడుగు బలహీన వర్గాల కోసం ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశ పెట్టామని గుర్తు చేశారు. ఈ తరం పిల్లలు ఎక్కడైనా బతికేందుకు ఎదిగేందుకు అవకాశం ఉన్న చదువులు చదివించాలన్న విధానం గప్పదా... చంద్రబాబు నిర్ణయాలు గొప్పవో ప్రజలు చెప్పాలన్నారు. 


వెన్నుపోటు స్కీం


అమ్మ ఒడి వంటి స్కీం పెట్టాలన్న ఆలోచన చంద్రబాబు తన జీవితంలో ఎప్పుడైనా ఆలోచించారా అని ప్రశ్నించారు జగన్. 40 ఏళ్ల రాజకీయ జీవితం ఎందుకు పనికి వచ్చిందో ఆయన చెప్పాలన్నారు. ఆయన పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే ఒకే ఒక్క స్కీం వెన్నుపోటని విమర్శించారు. ఎన్టీఆర్‌ నుంచి మోదీ వరకు అందర్నీ వెన్నుపోటు పొడిచారని దుయ్యబట్టారు.


ప్రభుత్వ బడికి క్రేజ్


కరోనా టైంలో కూడా గవర్నమెంట్‌ బడుల్లో చదివే పిల్లల సంఖ్య పెరిగిందని చెప్పారు జగన్. వచ్చే ఏడాది నుంచి సబ్జెక్ట్ టీచర్స్‌ రాబోతుతన్నారని తెలిపారు. ఇలాంటి వినూత్న ఆలోచనతో స్కూల్స్ అభివృద్ధి చేస్తుంటే జగన్ మామా థాంక్యూ అని పిల్లలు చెబుతున్నారని పొంగిపోయారు. 


చంద్రబాబు అపాయింట్‌ కోసం ప్రముఖల క్యూ


2018-19లో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు 37 లక్షల 20వేలు ఉంటే.. ఇప్పుడా సంఖ్య 43 లక్షల 43వేలు చేరిందన్నారు జగన్. ప్రస్తుతం ప్రభుత్వ బడుల్లో చదవాలంటే ఎమ్మెల్యేలతో రికమండేషన్స్‌ చేయించుకునే పరిస్థితి వచ్చిందన్నారు జగన్. ఇదే చంద్రబాబు హయంలో ఒక్క లక్ష మంది విద్యార్థులు పెరిగి ఉంటే... ప్రపంచానికే చుక్కాని అని... ఐరాస అధ్యక్షుడు కూడా చంద్రబాబు అపాయింట్‌మెంట్‌కు క్యూ కడుతున్నారని రాసేవాళ్లని సెటైర్లు వేశారు. 


ఇంకా నెగెటివ్‌ స్టోరీలు


అరకొరగా ఫీజు రీయెంబర్స్‌ చేసినా కూడా చంద్రబాబు పాలన బాగుందని బ్రహ్మాండంగా ఉందని రాశారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్ల వరకు బకాయిలు పెట్టినా కూడా ఎవరూ అడగలేదన్నారు. పద్దెనిమిది వందల కోట్లు చంద్రబాబు కట్టకుండా దిగిపోయినా ఆ పాలన బాగుందని అదే జగన్ పాలనలో ఆ బకాయిలు చెల్లించినా కూడా నెగెటివ్‌ కథనాలు వస్తున్నాయన్నారు. 


మహిళలను రోడ్డున పడేశారు


2014 నాటికి ఉన్న డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ చేయకపోగా.. సున్నా  వడ్డీ రుణాలను తీసేసి ఘనత చంద్రబాబుది అని గుర్తు చేశారు సీఎం. వనజాక్షిని జుట్టుపట్టుకొని ఈడ్చినట్టే పొదుపు సంఘాల మహిళలను చంద్రబాబు ఆర్థికంగా రోడ్డుకు ఈడ్చేశారని తీవ్ర విమర్శలు చేశారు. ఇంతలా మహిళలను మోసం చేసిన చంద్రబాబు అంటే నేటికీ మహిళలు చీదరించుకుంటున్నారని అన్నారు. 


కళ్లార్పకుండా అబద్దాలు


బడుల్లో సౌకర్యాలు, ఆడపిల్లల చదువుల గురించి, వాళ్ల రక్షణ గురించి ఎప్పుడైనా చంద్రబాబు ఆలోచించారా అని జగన్ ప్రశ్నించారు. సెల్‌ఫోన్ నేనే కనిపెట్టాను, హైదరాబాద్ సిటీని నేనే కట్టా, అదిగో హైపర్‌ లూప్, ఇదిగో బులెట్‌ ట్రైన్, బిల్‌గేట్స్‌ నా కంప్యూటర్‌ స్కిల్స్‌ చూసి మూర్చపోయారు లాంటి ఉపన్యాసాలు ఇస్తారే తప్ప చేసిందేమీ లేదన్నారు సీఎం. కళ్లార్పకుండా అబద్దాలు చెప్పే చంద్రబాబుకు దిశ యాప్, దిశ పోలీస్‌స్టేషన్లు, దిశ చట్టం, గ్రామ సచివాలయంలో మహిళా కానిస్టేబుల్‌ లాంటి ఆలోచనలు ఎప్పుడైనా వచ్చాయా అని నిలదీశారు. 


దశ మార్చిన దిశ


దిశ యాప్‌ వల్ల తొమ్మిది వందల మంది తక్షమ సాయం పొందారని తెలిపారు సీఎం జగన్. ఈయాప్‌ను కోటీ పదమూడు లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారన్నారు. దీన్ని బాధ్యతగా చెప్పుకుంటున్నామే కానీ ఎప్పుడూ గొప్పగా చెప్పుకోలేదన్నారు. అయినా బాబు బుర్రతక్కువ పాలనే అమోగమని ఎల్లో మీడియా ప్రయత్నిస్తోందన్నారు. బుర్రకథలు చెప్పడానికి  వారి కింద బృందాలను తయారు చేసుకున్నారని మండిపడ్డారు జగన్. 


మహిళకు అండగా


45నుంచి అరవై సంవత్సరాల ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ మహిళల గురించి ఆలోచించి... వారికి ఆర్థికంగా అండగా నిలబడాలని ఆలోచించారా అని ప్రశ్నించారు. 25 లక్షల పేదల మహిళలకు 75వేలు ఇస్తున్నాం. ఏటా పద్దెనిమిదివేల ఐదు వందలు నాలుగేళ్ల పాటు వైఎస్‌ఆర్ చేయూత ద్వారా ఇస్తున్నామన్నారు. కార్పొరేట్‌ దిగ్గజాలతో టై అప్‌ చేసి వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడేలా చేస్తున్నామని తెలిపారు జగన్. 


చంద్రబాబు రాని ఆలోచన


కరోనా టైంలో అమ్మఒడి, ఆసరా, ఇళ్ల పంపిణీ, ఇళ్ల నిర్మాణం చేస్తూనే చేయూత వంటి పథకం కూడా అమలు చేస్తున్నామన్నారు సీఎం. ఇదే స్ఫూర్తి తోనే కాపు నేస్తం, ఈబీసీ నేస్తం కూడా తీసుకొచ్చామని తెలిపారు. ఇలాంటివి చంద్రబాబు జీవితంలో ఎప్పుడైనా ఆలోచించారా అని నిలదీశారు. 


ఇళ్ల నిర్మాణం కోసం 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చామన్న జగన్...చంద్రబాబు పార్టీ పుట్టి 40ఏళ్ల అయింది ఎప్పుడైనా ఇది చేశారా అని ప్రశ్నించారు. ఇలాంటివి పూర్తైతే ఆ ఇరవై మూడు సీట్లు కూడా దక్కవనే ఆలోచనతో కోర్టుల్లో కేసులు వేయించి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు జగన్. కట్టీ కట్టని టిడ్కో ఇల్లు కూడా తామే కట్టామని చెబుతున్నారని సటైర్లు వేశారు. వాటికి కనీస సౌకర్యాలు లేవు. వాటి బాధ్యత కూడా తామే తీసుకున్నట్టు చెప్పుకొచ్చారు. 


ఫస్ట్‌ టైం ఇన్ హిస్టరీ


దేశ చరిత్రలోనే తొలిసారిగా నామినేటెడ్ పోస్టులు, నామినేటెడ్‌ కాంట్రాక్ట్‌ల విషయంలో సామాజిక న్యాయం పాటించామన్నారు సీఎం జగన్. ఇందులో యాభై శాతం కచ్చితంగా మహిళలకు ఇచ్చేలా చట్టం చేశామని తెలిపారు. బీసీలను పనిముట్లుగా ఉపయోగించుకున్నారే తప్ప చంద్రబాబు చేసిందేంటని ప్రశ్నించారు. 


కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారు. నిత్యం ఏదో సంఘటనతో పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి ఏ సంబంధం లేకపోయినా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పట్టపగలు గుడులు కూలగొట్టారని అధికారం పోయాక చీకట్లో విగ్రహాలు విరిచేయడం, రథాలు తగలబెట్టడం చేస్తున్నారన్నారు. అయినా వాటిని పునరుద్దరించి పూర్వ వైభవం తీసుకొస్తున్నామని తెలిపారు. 


చరిత్ర అంటే మాదీ


ఒకేసారి లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర మాదని.. ఆర్టీని ప్రభుత్వంలో కలుపుకున్న చరిత్ర  మాదని చెప్పుకొచ్చారు జగన్. వైద్యారోగ్య శాఖలో డాక్టర్లు, నర్సులు లేని పరిస్థితి ఉండకూడదని 30 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్న చరిత్ర మాదన్నారు. ప్రభుత్వ సంస్థలను మూసి వేయడం పప్పుబెల్లాలకు అమ్మేయడం చంద్రబాబుకు తెలుసని ఎద్దేవా చేశారు. 


ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగాల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబు లేదన్నా సీఎం జగన్. ఆప్కాస్‌ ద్వారా లక్షల మందికి మెరుగైన జీవితాలు అందించామన్నారు. మొత్తంగా 6 లక్షల 3వేల మందికి ప్రభుత్వ సెక్టార్‌లో ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు టైం స్కేల్‌ తీసుకొచ్చామని తెలిపారు. చంద్రబాబు లాంటి మోసగాళ్లకు కమ్యూనిస్టులు తానా తందానా అంటున్నారని విమర్శించారు. ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ ఉద్యోగాలకు వేతనాలు పెంచామని చెప్పారు. 


వైద్యసేవలు మెరుగుపరిచేందుకు ఉన్నవాటికి అదనంగా 16 బోధనాసుపత్రులు తీసుకొస్తున్నామన్నారు జగన్. నాడు నేడు ద్వారా పదహారు వేల కోట్లు ఖర్చు చేసి ఆసుపత్రుల రూపురేఖలు మారుస్తున్నామని చెప్పారు. వైద్యారోగ్యంపై మాట్లాడే హక్కు చంద్రాబబు లేదన్నారు. 


రైతును చంద్రబాబు మోసం చేస్తే అదే రైతుకు న్యాయం చేస్తున్నామని సభకు తెలిపారు జగన్. ప్రతి రైతుకు పన్నెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి రైతు భరోసా కింద పదమూడు ఐదు వందలకు పెంచి ఐదేళ్లకు ఇస్తున్నామన్నారు. రైతుకు పెట్టుబడి సహాయం చేయాలన్న ఆలోచన చంద్రబాబు ఎప్పుడూ రాలేదన్నారు. ధాన్యం సేకరణ బిల్లులు, విత్తన బకాయిల బిల్లులు, విద్యుత్‌ బకాయిలు చంద్రబాబు కట్టకుండా వదిలేస్తే మేం కట్టామని చెప్పారు. 


రైతులను, వారి కుటుంబాలను నమ్మించిన మోసం చేసిన చంద్రబాబు పాలనకు తమ పాలనకు బేరీజు వేసుకోవాలని పిలుపునిచ్చారు జగన్. రైతు భరోసా కేంద్రాలు విత్తనం నుంచి పంట అమ్మకం వరకు అన్నింటికి తోడుగా ఉన్నాయని చెప్పారు జగన్. వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు కనిపిస్తున్నాయన్నారు జగన్. 


ఇవన్నీ ఆలోచించి ప్రజలు ఎప్పడూ అండగా ఉండాలని కోరారు సీఎం జగన్. 
అధికారం పోయి వెయ్యిరోజులు అయిన సందర్భంగా చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పారు జగన్. చంద్రబాబుకు, ఆయన మద్దతు దారులకు పాన్ 40 ట్యాబ్లెట్లు, జెలిసెల్ సిరప్‌, ఈనో ప్యాకెట్లు విరివిగా దొరకాలని కోరుకుంటున్నట్టు సటైర్‌తో ప్రసంగాన్ని ముగించారు.