Andhra Pradesh Budget 2024: ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో నేటి నుంచి ఆఖరి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. వచ్చే వారంలో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ రానుంది. కాబట్టి ఈ సమావేశాల్లో ఇప్పటి వరకు చేసిన పనులు, సాధించిన విజయాలపై ప్రభుత్వం ఫోకస్ చేయనుంది. అందులోనూ ఇవి బడ్జెట్ సమావేశాలు కావడంతో మరింత ఆసక్తి నెలకొంది. 


రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈ ఉదయం పది గంటలకు ప్రారంభం కానున్నాయి. మొదట ఉభయ సభలను ఉద్దేశించిన గవర్నర్ ప్రసంగిస్తారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తారు. తర్వాత బీఏసీ సమావేశం అవుతుంది. సభ ఎన్నిరోజులు నడపాలనే దానిపై చర్చిస్తుంది. 


ఈ బడ్జెట్ శాసనసభ సమావేశాలు ఐదు రోజుల పాట నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. మంగళవారం రాష్ట్ర తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2024-25 సంవత్సరానికి రూపొందించిన వార్షిక తాత్కాలిక బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకురానున్నారు.