హైకోర్టు అనుమతి ఇవ్వడంతో మహాపాదయాత్రకు అమరావతి రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వెయ్యిరోజులు పూర్తైన రోజు నుంచే పాదయాత్ర చేపట్టాలని రైతులు భావిస్తున్నారు. ఈ నెల 12 నుంచి తుళ్లూరు మండలం వెంకటపాలెంలో మహా పాదయాత్ర ఉదయం ఐదు గంటలకు ప్రారంభం కానుంది.
వెంకటపాలెంలోని శ్రీవెంకటేశ్వరుని ఆలయంలో పూజా కార్యక్రమాలు పూర్తి చేసి పాదయాత్రకు రెడీ కానున్నారు అమరావతి రైతులు. అక్కడ ప్రత్యేకంగా డిజైన్ చేసిన శ్రీవారి రథాన్ని ఆలయం నుంచి వెంకటపాలెం గ్రామంలోకి తీసుకొస్తారు. ఉదయం 9 గంటలకు రథానికి జెండా ఊపి పాదయాత్రగా రైతులు ముందుకు కదలనున్నారు.
ఇప్పటికే అన్ని పార్టీల అధినేతలతో అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని రైతు సంఘాలు కలిసి పాదయాత్రకు మద్దతు ఇవ్వాలని రిక్వస్ట్ చేశాయి. వైఎస్‌ఆర్‌సీపీ మినహా అన్ని పార్టీల నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వెంకటపాలెం నుంచి కృష్ణాయపాలెం, పెనుమాక, ఎర్రబాలెం మీదుగా మంగళగిరి చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారు.
పాదయాత్రలో సమస్యలు తలెత్తకుండా టీంలను ఏర్పాట్లు చేసింది అమరావతి పరిరక్షణ సమితి. ఆహారం, లాజిస్టిక్-1,2 తాగునీరు, ఫైనాన్స్, ఆహ్వాన, రథం కమిటీను ఏర్పాటు చేశారు. యాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ కూడా రెడీ చేశారు. ఆయా ప్రాంతాల్లో బసకు సంబంధించిన ఏర్పాట్లను కూడా ముందుగానే చేసుకున్నారు. న్యాయస్థానం నుంచి దేవస్థానానికి చేపట్టిన పాదయాత్రలో ఎదురైన అనుభవాల దృష్ట్యా... మరింత పటిష్టంగా ఏర్పాటు చేసుకున్నారు.
పాదయాత్రలో 600 మంది పాల్గొంటారని... వారి వివరాలను పోలీసులకు ఇచ్చింది అమరావతి పరిరక్షణ సమితి. హైకోర్టు ఆదేశాల మేరకు పాదయాత్రలో పాల్గొనే వారి పేర్లు, ఆధార్ కార్డులు పోలీసులకు అందజేశారు.
పాదయాత్ర ప్రారంభం రోజునే గ్రామసభలు ఏర్పాటు చేయడం ఇప్పుడు సరికొత్త వివాదానికి కారణమవుతున్నాయి. అమరావతి పురపాలక సంఘం ఏర్పాటు ప్రతిపాదనపై అభిప్రాయ సేకరణ చేపట్టింది. దీని కోసం గ్రామ సభలు నిర్వహిస్తోంది. అవి 12 నుంచే ప్రారంభంకానున్నాయి. ఇదే ఇప్పుడు సరికొత్త వివాదానికి తెరలేపుతున్నాయి. 12వ తేదీ నుంచి 17 వరకు ఈ సభలు నిర్వహించనున్నారు. రోజుకు మూడు గ్రామాల్లో సభలు జరుగుతాయి. పాదయాత్ర ప్రారంభమయ్యేరోజే వెంకటపాలెం సమీపంలోన గ్రామసభలు నిర్వహించనున్నారు.
ఇప్పటికే ఈ పాదయాత్రపై అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్దం నడుస్తోంది. ఉత్తరాంధ్ర పై చంద్రబాబు దండయాత్ర చేస్తున్నారని ఏపీ మంత్రులు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఇక్కడి ప్రజలు, ఈ ప్రాంత ఆత్మాభిమానంపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి రైతుల పాదయాత్రపై ప్రజలు తిరగబడితే అందుకు బాధ్యుడు చంద్రబాబే అవుతారని మంత్రులు హెచ్చరికలు జారీ చేశారు.