Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తిలోని 29 గ్రామాల్లో రూ.1,437 కోట్ల‌తో పెద్ద ఎత్తున మౌలిక వ‌సతులు కల్పించబోతున్నట్టు మంత్రి నారాయ‌ణ తెలిపారు. ఇప్ప‌టికే దీనికోసం రూ.904 కోట్ల‌కు ఆమోదం తెల‌ప‌గా తాజాగా మ‌రో రూ.533 కోట్ల‌కు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింద‌న్నారు. స‌చివాల‌యంలోని మొద‌టి బ్లాక్‌లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వ‌ద్ద జ‌రిగిన కేపిట‌ల్ రీజిన‌ల్ డెవ‌ల‌ప్ మెంట్ అథారిటీ 65వ స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌యాల‌ను మంత్రి నారాయ‌ణ మీడియాకు వెల్ల‌డించారు.  

Continues below advertisement

2014-19 మ‌ధ్య రాజ‌ధాని కోసం భూములిచ్చిన 29 గ్రామాల్లో క్రిటికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేసేందుకు అదనంగా రూ.533 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. రాజ‌ధానిలో మౌలిక వ‌స‌తుల మాదిరిగానే గ్రామాల్లో కూడా రోడ్లు, డ్రైన్లు,అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజి,తాగునీటి లైన్లు, లైటింగ్ తదితర మౌలిక వసతులను కల్పించనున్నట్లు చెప్పారు. అమరావతిలో యూజీడీ వ్యవస్థ ఉన్నందున 29గ్రామాల్లో యూజీడీ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కోసం రూ.904 కోట్లు మంజూరు కాగా, తాజాగా మంజూరు చేసిన రూ.533 కోట్లతో కలిపి మొత్తం రూ.1,437 కోట్లతో 29గ్రామాల్లో 100శాతం మౌలిక వసతులను పూర్తి చేయనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.

శాకమూరులో రూ.596 కోట్లతో సెంట్రల్ పబ్లిక్ లైబ్రరీ,ఆడిటోరియం,హెచ్‌ఆర్‌కు సంబంధించిన భవనాల నిర్మాణానికి రూ.596 కోట్ల విలువతో పనులు చేపట్టేందుకు అథారిటీ ఆమోదం తెలిపిందన్నారు మంత్రి. 29గ్రామాల్లో ఎల్పీఎస్ లేఅవుట్లలోని చిన్న రోడ్లను సీసీ రోడ్లుగా నిర్మించాలని తొలుత నిర్ణయించినప్పటికీ, సీఆర్ఆర్ఐ న్యూఢిల్లీ, ఐఐటీ ఖరగ్‌పూర్ సంస్థలతో అధ్యయనం చేయించినట్లు మంత్రి తెలిపారు. అమరావతి ప్రాంతంలోని నేల స్వ‌భావం, భవిష్యత్‌లో పెరగనున్న వాహనాల‌ను దృష్టిలో ఉంచుకుని సీసీ రోడ్ల‌కు బదులుగా బీటీ రోడ్లు నిర్మించాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు. అమరావతిలో డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ అభివృద్ధికి సంబంధించి డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్‌ సిద్ధం చేసేందుకు సీఆర్డీఏకు అథారిటీ అనుమతి ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.

Continues below advertisement

42ఎకరాల్లో వివిధ ప్రాజెక్ట్‌ల‌ను ప్రైవేట్ సంస్థ‌ల‌తో అభివృద్ధికి ఆమోదం తెలిపారు. అమరావతిలో నివాసాలు, షాపులు, కార్యాలయాలు తదితర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండాలని మంత్రి నారాయణ అన్నారు. ప్రభుత్వం నిర్మించే కార్యాలయాలతోపాటు ప్రైవేట్ రంగంలో కూడా అభివృద్ధి జ‌రిగేలా 42 ఎక‌రాల్లో వివిధ ప్రాజెక్ట్ ల‌ను చేప‌డుతున్నామ‌న్నారు. దీని కోసం పిచ్చుకలపాలెంలో 7.9ఎకరాలు, తుళ్లూరులో 5ఎకరాలు, మందడంలో 12.38ఎకరాలు, మరో ప్రాంతంలో 6ఎకరాలు, కురగల్లులో 6ఎకరాలు కలిపి మొత్తం 42 ఎకరాలను గుర్తించిన‌ట్లు మంత్రి నారాయ‌ణ చెప్పారు.

అదనపు భూముల కేటాయింపునకు కొత్త విధానం 

హోటళ్లు, పాఠశాలలు,ఇతర ప్రాజెక్టులకు ఇప్పటికే భూములు కేటాయించిన ప్రాంతాల్లో పక్కనే కొంత‌మేర అద‌నంగా కోరుతున్న వారికోసం కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్లు మంత్రి తెలిపారు. త్రీ స్టార్, ఫోర్ స్టార్, ఫైవ్ స్టార్ హోటళ్లు, నేషనల్, ఇంటర్నేషనల్ స్కూల్స్ అదనపు భూమిని కోరితే అమరావతిలోని ప్రస్తుత క‌నీస‌ ధరపై కనీసం 250 శాతం ధరకు కేటాయించేందుకు అథారిటీ అనుమతి ఇచ్చిందన్నారు. అమరావతిలో ప్రస్తుత క‌నీస‌ ధర ఎకరాకు రూ.4.1 కోట్లు కాగా, కనీసం ఎకరాకు రూ.10.25 కోట్లకు తగ్గకుండా అదనపు భూమిని కేటాయించనున్నట్లు మంత్రి వెల్ల‌డించారు.

ల్యాండ్ పూలింగ్ రైతు కుటుంబాలకు రూ.1.50 లక్షల వరకు రుణమాఫీ 

ప్ర‌స్తుతం ల్యాండ్ పూలింగ్ జ‌రుగుతున్న గ్రామాల్లోని రైతుల‌కు ఒక్కో కుటుంబానికి గ‌రిష్టంగా రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కూ రుణ‌మాఫీ చేసేందుకు అథారిటీ ఆమోదం తెలిపిన‌ట్లు మంత్రి నారాయ‌ణ వివ‌రించారు. 2026 జనవరి 1వ తేదీకి ముందు తీసుకున్న రుణాలకు వ‌ర్తించేలా అథారిటీ ఆమోదం తెలిపింద‌న్నారు.

మంగళగిరికి అమరావతి నుంచి తాగునీరు 

అమరావతి క్యాపిటల్ సిటీ నుంచి మంగళగిరి కార్పొరేషన్‌కు తాగునీరు అందించేందుకు అథారిటీ ఆమోదం తెలిపినట్లు మంత్రి నారాయణ తెలిపారు. ప్రస్తుతం మంగళగిరికి 30 ఎంఎల్‌డీ నీటి అవసరం ఉండగా, రాబోయే 30 సంవత్సరాల జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్‌లో 80ఎంఎల్‌డీ వరకు నీటి అవసరాలను పరిగణనలోకి తీసుకునేలా ప్రణాళిక రూపొందించనున్నట్లు చెప్పారు. అమరావతిలో నిర్మిస్తున్న స్టోరేజీల నుంచి మంగళగిరికి నీటిని అందించేందుకు, కిలోలీటర్‌కు రూ.10 చొప్పున ధర నిర్ణయించి సరఫరా చేయడానికి అథారిటీ అంగీకరించిందన్నారు.

ఐఓసీఎల్‌తో గ్రీన్ ఎనర్జీ కోసం ఎంఓయూ 

అమరావతిలో గ్రీన్ ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేసేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకునేందుకు సీఆర్డీఏకు అథారిటీ అనుమతి ఇచ్చిందన్నారు మంత్రి. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అమరావతిలో డీమ్డ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి 8.5 ఎకరాల భూమిని కేటాయించేందుకు అథారిటీ ఆమోదం తెలిపిందన్నారు. 

తాడికొండ,కంతేరులో ల్యాండ్ పూలింగ్ 

తాడికొండ, కంతేరు ప్రాంతాల మీదుగా ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే ట్రాక్ వెళ్తుండ‌టంతో వాటి పరిధిలోని క్యాపిటల్ సిటీ వరకు ఉన్న భూములను ల్యాండ్ పూలింగ్‌లోకి తీసుకునేందుకు సీఆర్డీఏకు అథారిటీ అనుమతి ఇచ్చిందని మంత్రి నారాయణ తెలిపారు.