AP Elections 2024: ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదివారం (మే 5) ధర్మవరం రానున్నారు. టీడీపీ బీజేపీ జనసేన కూటమి అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ తరఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించునున్నారు. ధర్మవరంలోని సి.ఎన్.బి కళ్యాణమండపం వెనుక భాగాన బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటలకు బహిరంగ సభ వేదిక వద్దకు అమిత్ షా, చంద్రబాబునాయుడు చేరుకుని ప్రసంగించునున్నారు. ఈ సభకు పెద్ద ఎత్తున కూటమి పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజలు అభిమానులు రానున్నారు.


అందుకు అనుగుణంగా భారీ ఏర్పాట్లు బీజేపీ టీడీపీ టీడీపీ జనసేన నేతలు చేశారు. పట్టణం మొత్తం కాషాయం,పసుపు జెండాలతో నిండిపోయింది. ధర్మవరం కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వస్తుండడంతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమయింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. ఇప్పటికే ధర్మవరం పట్టణాన్ని చుట్టుపక్కల ఉన్న గ్రామాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.